మల్లన్న సాగర్ రెడీ..

0
265

సిద్దిపేట/గజ్వేల్‌‌ : రిజర్వాయర్​ప్రారంభానికి రెడీ అయినా మల్లన్నసాగర్​నిర్వాసితుల గోడు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. రిజర్వాయర్ ను ఈ నెల 23న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించడానికి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్వాసితుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో 50 టీఎంసీల కెపాసిటీతో మల్లన్నసాగర్ రిజర్వాయర్​నిర్మాణం చేపట్టారు. ఆఫీసర్ల మాటలు నమ్మి గ్రామాన్ని వదిలిన  కుటుంబాలు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతం అవుతున్నాయి. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించడంపై శ్రద్ధ చూపిన ఆఫీసర్లు ఆ తరువాత వారి సమస్యలను గాలికి వదిలేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ తో 8 పంచాయతీల్లోని దాదాపు 6,533 కుటుంబాలు నిర్వాసితులుగా మారాయి. రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయడం కోసం ఒక్కో గ్రామాన్ని విడతలవారీగా పలు హామీలిస్తూ ఆఫీసర్లు తరలించారు. దాదాపు 22 నెలల క్రితం లక్ష్మాపూర్ గ్రామ నిర్వాసితులను తరలించగా 8 నెలల క్రితం చివరగా  బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులను తరలించారు. ముంపు గ్రామాల నుంచి నిర్వాసితులను తరలించేటప్పుడు వారి ఆప్షన్ల మేరకు కొందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించగా మరికొందరికి ఓపెన్ ప్లాట్లను ఇవ్వడానికి హామీ ఇచ్చారు. గజ్వేల్ పట్టణ సమీపంలోని సంగాపూర్ వద్ద నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీకి దాదాపు మూడు వేల కుటుంబాలను తరలించి వారికి ఇండ్లను కేటాయించగా  మిగిలిన 3500 కుటుంబాలకు ఆరు నెలలలోపు 250 గజాల ఓపెన్ ప్లాట్లు కేటాయించడానికి హామీ ఇచ్చారు. ఓపెన్ ప్లాట్ల ఆప్షన్ ను ఎంచుకున్న వారిలో దాదాపు రెండు వేల కుటుంబాలకు  గజ్వేల్లో నిర్మించిన డబుల్​బెడ్ రూమ్ ఇండ్లల్లో, మరికొందరికి వర్గల్ మండలం తునికి ఖల్సాలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో తాత్కాలిక వసతి కల్పించారు. వసతి దొరకని దాదాపు వెయ్యికిపైగా కుటుంబాలను అద్దె ఇండ్లలో ఉండాలని, ఆరు నెలల అద్దె కింద రూ. 30 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇది జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇటు ఓపెన్ ప్లాట్లను ఇవ్వలేదు. అద్దే చెల్లించడం లేదు. అధికారులు మాత్రం చాలామందికి అద్దె డబ్బులు చెల్లించామని, కొందరి అడ్రసులు దొరకడం లేదని చెబుతున్నారు.

ప్లాట్ ​నంబర్​ లేకుండానే పట్టాలు
నిర్వాసితుల కోసం గజ్వేల్ పట్టణ సమీపంలో మూడు ప్రదేశాల్లో ఓపెన్ ప్లాట్లను కేటాయించాలని నిర్ణయించారు. ఓపెన్ ప్లాట్లు కోరుకున్న నిర్వాసితులకు మూడేండ్ల కిందట కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణభాస్కర్ పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. సర్వే నంబర్, ప్లాట్ నంబర్ లేకుండా కేవలం నిర్వాసితుని పేరిట పట్టా సర్టిఫికెట్ జారీ చేశారు. ఇటీవల పల్లెపహాడ్, వేములఘాట్, బ్రాహ్మణ బంజేరుపల్లి నిర్వాసితులకు ఓపెన్ ప్లాట్ల కోసం ఆఫీసర్లు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చారు. అందులో ప్లాట్ నంబర్లు, హద్దులు లేకపోవడంతో వాటిని ఏం చేసుకోవాలో అర్థం కావడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్లాట్ల కోసం ఎంపిక చేసిన స్థలంలో రోడ్లు, తాగునీటి వసతి, డ్రైనేజీ నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు ప్లాట్ల కోసం నిర్వాసితులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్లాట్ల కేటాయింపుల్లో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిర్వాసితులు పక్షం రోజుల క్రితం ప్రజ్ఞాపూర్​లో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఆఫీసర్లు త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచలేదు.

దళారుల దందా
కొందరు స్థానికంగా నివాసం ఉండటం లేదని ఓపెన్ ప్లాట్ల కేటాయింపులో వారి పేర్లను అధికారులు పెండింగ్ లో పెట్టారు. దళారులు దీన్ని అవకాశంగా తీసుకుని డబ్బులిస్తే జాబితాల్లో మీ పేర్లు వచ్చేలా చూస్తామని లక్ష నుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇలాగే దేవదాస్​అనే నిర్వాసితుడి నుంచి రూ. 3 లక్షలు డిమాండ్​చేశారు. ఆఫీసర్ల చుట్టూ ఎంత తిరిగినా ప్లాట్​విషయాన్ని తేల్చకపోవడంతో దేవదాస్​రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. మరోవైపు ప్లాట్ల కోసం ఎదురుచూస్తూ ఆవేదనతో నిర్వాసితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేవదాస్ సోదరుడు రాజబాబు ఏడాది క్రితం ఇద్దరు ఆడ పిల్లలకు  ప్యాకేజీ అందక ఆవేదనకు లోనై గుండెపోటుతో మృతిచెందాడు. ఆరు నెలల క్రితం బానోతు హన్మంతు అనే నిర్వాసితుడు చనిపోగా, ఒంటరి మహిళల ప్యాకేజీ అందక వేములఘాట్ గ్రామానికి చెందిన వృద్ధురాలు బాలవ్వ(80) ఆత్మహత్య చేసుకుంది.

Courtesy V6velugu

Leave a Reply