బడా కంపెనీ గుప్పిట్లో మన బడి!

0
176
 • పాఠశాలల అభివృద్ధి పనులన్నీ ఒకే కంపెనీకి!
 • చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లను.. 
 • దూరం పెట్టడానికి నిబంధనల్లో మార్పులు
 • అనుభవం లేదనే పేరుతో పనుల తిరస్కరణ
 • ఉమ్మడిగా రంగంలోకి బడా కంపెనీలు
 • ‘మంత్రి కుమారుడి’తో జాయింట్‌ వెంచర్‌
 • అంచనా వ్యయం కన్నా ఎక్కువకు కోట్‌
 • 1,539 కోట్ల పనులకు1800 కోట్ల టెండర్‌
 • 7 వేల కోట్ల పనుల్లో అవకతవకలకు రంగం సిద్ధం
 • లోకాయుక్త, సీబీఐకి ఫిర్యాదు

మన ఊరు-మన బడి ఈ టెండర్ల వ్యవహారంలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై విచారణ  జరిపించాలంటూ గణేశ్‌ ఉయ్యూరి అనే సామాజిక కార్యకర్త.. లోకాయుక్తకు, సీబీఐకి ఫిర్యాదు చేశారు. బడా కంపెనీలకు ఈ పనులను అప్పగించడానికి వీలుగా ఇతర కంపెనీలను అనర్హులుగా ప్రకటించారని పేర్కొన్నారు. అంచనా కంటే ఎక్కువ మొత్తంలో టెండర్లను ఖరారు చేయడానికి ప్రయత్నం జరుగుతోందని, దీనిని అడ్డుకోవాలని కోరారు. 

హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ పథకం ఓ బడా కంపెనీ గుప్పిట్లో చిక్కుకుంది. రూ.వేల కోట్ల నిధులతో చేపట్టదలచిన ఈ పనులన్నింటినీ ఒకే కంపెనీ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. పైగా టెండర్‌లో పేర్కొన్న వ్యయం కన్నా ఎక్కువ మొత్తానికి కోట్‌ చేసి ప్రభుత్వ సొమ్మును పెద్ద ఎత్తున సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం అధికారులు చిన్న, మధ్య తరహా కాంట్రాక్టర్లకు ఈ పనులు దక్కకుండా నిబంధనలు మార్చి.. పోటీ లేకుండా చేశారు. ఈ తతంగంపై సీబీఐకి, లోకాయుక్తకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.7,289 కోట్ల నిధులను కూడా కేటాయించింది. మూడు దశల్లో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో 9,123 స్కూళ్లను అభివృద్ధి చేయనున్నారు.

ఇందులో పాఠశాల భవనాల మరమ్మతు పనులు, కొత్త తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ గోడ నిర్మాణం, మంచినీరు, విద్యుత్తు వంటి సౌకర్యాలతోపాటు, గ్రీనరీ వంటి పనులు చేయనున్నారు. వీటితో పాటు పాఠశాలకు అవసరమయ్యే గ్రీన్‌ చాక్‌బోర్డులు, ఫర్నిచర్‌, డ్యూయల్‌ డెస్క్‌ల ఏర్పాటు, రంగులు వేయడం చేయనున్నారు. అయితే సివిల్‌ పనులను మాత్రమే స్థానికంగా నిర్వహిస్తూ.. ఫర్నిచర్‌, రంగులు వేయడం, గ్రీన్‌ చాక్‌బోర్డుల ఏర్పాటు వంటి పనులకు రాష్ట్ర స్థాయిలో టెండర్లను పిలిచారు. సాధారణంగా నీటిపారుదల, రోడ్ల నిర్మాణం, భారీ భవన నిర్మాణ పనులను చిన్నవిగా విభజించలేని పరిస్థితుల్లో మాత్రమే పెద్దమొత్తాలకు టెండర్లను పిలుస్తుంటారు. ఈ టెండర్లలో అనుభవం ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు పాల్గొంటాయి. కానీ, మన ఊరు-మన బడిలో మాత్రం ఎటువంటి సంక్లిష్టమైన సాంకేతికత అవసరంలేని, స్థానికంగా చేసే  ఫర్నిచర్‌, రంగులు వేయడం వంటి చిన్న చిన్న పనులను కూడా పెద్ద కంపెనీలకు అప్పగించాలని నిర్ణయించారు.

వాస్తవానికి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో అనేక జీవోలు జారీ చేశాయి. స్థానిక కాంట్రాక్టర్లకే అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం అనేకమార్లు ఆయా శాఖలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ టెండర్లలో పాల్గొనేందుకు చిన్న పరిశ్రమలకు అనేక మినహాయింపులు ఇస్తూ జీవో-51ను విడుదల చేసింది. దీని ప్రకారం కేవలం రూ.10 వేలు చెల్లించి ఎంఎ్‌సఎంఈలు టెండర్లలో పాలుపంచుకోవచ్చు. బ్యాంకు గ్యారంటీ, అడ్వాన్సు చెల్లింపుల నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. కానీ, ప్రభుత్వం వీటన్నింటినీ కాదని కొత్త నిబంధనలు పెట్టింది. ఇందులో భాగంగా.. డ్యూయల్‌ డెస్క్‌ ఏర్పాటు పనులకు సంబంధించి ఏప్రిల్‌ 20న ప్లోట్‌ టెండర్‌ డాక్యుమెంట్‌లో అంచనా వ్యయాన్ని రూ.219 కోట్లుగా ఖరారు చేశారు. ఈ టెండర్‌లో పాల్గొనాలంటే.. టెండర్‌ విలువలో 25 శాతంగా రూ.54.75 కోట్ల వ్యాపార అనుభవం ఉండాలని నిబంధన పెట్టారు. అనంతరం మే 9వ తేదీన ఈ టెండర్‌ అంచనా వ్యయాన్ని రూ.360 కోట్లను పెంచారు. పైగా ఇందులో పాల్గొనే కంపెనీకి అర్హతను ముందు నిర్ణయించినట్లుగా 25 శాతం కాకుండా 50 శాతానికి పెంచుతూ రూ.180 కోట్ల వ్యాపార అనుభవం ఉండాలనే నిబంధన తీసుకువచ్చారు. చిన్న కంపెనీలకు ఈ స్థాయి ఉండని కారణంగా వాటిని పక్కకు తప్పించేందుకే ఈ నిబంధనను తెచ్చారు.

ఇతర కంపెనీలతో జాయింట్‌ వెంచర్‌గా..
మన ఊరు-మన బడిలో భాగంగా పెయింట్స్‌ కోసం రూ.820 కోట్లు, ఫర్నిచర్‌ కోసం రూ.195 కోట్లు, డ్యూయల్‌ డెస్క్‌ల కోసం రూ.360 కోట్లు, గ్రీన్‌ చాక్‌బోర్డుకు రూ.164 కోట్లు కలిపి మొత్తం రూ. 1,539 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ పనులను దక్కించుకోవడానికి రాష్ట్రంలో పేరుమోసిన ఒక కంపెనీ రంగంలోకి దిగింది. ఈ కొన్ని పనులకు నేరుగా, మరికొన్ని పనులకు తను అనుబంధ సంస్థలతో కలిసి టెండర్లలో పాల్గొంది. తన కంపెనీలకు అనుభవం లేని పనులకు జాయింట్‌ వెంచర్‌గా మరికొన్ని కంపెనీలను జత చేసుకుని టెండర్లు వేసింది. మరోవైపు టెండర్లల్లో పాల్గొన్న ఇతర కంపెనీలను దూరం పెట్టడానికి వీలుగా అధికారులు ముందుగానే లేని పోని నిబంధనల్ని జోడించారు. తద్వారా కొన్ని కంపెనీలను ఈ పనులు చేసేందుకు అర్హత లేనివిగా నిర్ధారించారు. దీంతో పనులు అప్పగించదలచిన కంపెనీకి ఎక్కువగా పోటీ లేకుండా చేశారు. ఈ టెండర్లకు సంబంధించిన ఆర్థిక బిడ్లను ఇప్పటికే తెరిచారు.

అంచనా విలువ కన్నా ఎక్కువకు టెండర్‌..
పెయింట్‌ కోసం పిలిచిన టెండర్లల్లో ఎల్‌-1గా నిలిచిన సంస్థ రూ.900 కోట్లకు పైగా, ఎల్‌-2గా వచ్చిన సంస్థ అంతకుమించి బిడ్లను దాఖలు చేసినట్లు తెలిసింది. ఇక గ్రీన్‌ చాక్‌ బోర్డులకు సంబంధించిన టెండర్లలో ఎల్‌-1గా నిలిచిన సంస్థ రూ.200 కోట్లకు అటు ఇటుగా, ఎల్‌-2గా ఉన్న కంపెనీ మరో రూ.10 కోట్లకు అదనంగా బిడ్లను దాఖలు చేసినట్టు సమాచారం. ఇక డ్యూయల్‌ డెస్క్‌ సరఫరాకు సంబంధించిన టెండర్లల్లో ఎల్‌-1గా వచ్చిన సంస్థ రూ.400 కోట్లకు పైగా బిడ్‌ను, ఎల్‌-2గా ఉన్నసంస్థ మరో రూ.50 కోట్లకు అదనంగా బిడ్‌ను దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫర్నిచర్‌ సరఫరా టెండర్లలో ఎల్‌-1గా సంస్థ రూ.200 కోట్లకు పైగా, ఎల్‌-2 సంస్థ రూ. 20 కోట్లకు అదనంగా బిడ్లను దాఖలు చేసినట్లు సమాచారం. అంటే.. మొత్తం రూ.1,539 కోట్ల విలువైన పనుల కోసం ఎల్‌-1గా వచ్చిన సంస్థలు రూ.1,700 కోట్ల నుంచి రూ.1800 కోట్ల వరకు  టెండర్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఎల్‌-2 సంస్థలు దాఖలు చేసిన టెండర్‌ ఇంకా ఎక్కువగా ఉంది.

ఎల్‌-1గా నిలిచిన సంస్థలకే పనులను అప్పగించాల్సి వస్తే.. టెండర్‌లో పేర్కొన్న పనుల విలువ కంటే రూ.200 కోట్లకు పైగా విలువ పెరగనుంది. సాధారణంగా టెండర్‌లో పేర్కొన్న పనుల విలువ కంటే సుమారు 5 శాతం వరకు ఎక్కువ మొత్తానికి అనుమతి ఇస్తారు. పోటీ ఎక్కువగా ఉన్న సమయంలో టెండర్‌లో పేర్కొన్న అంచనా విలువకంటే తక్కువకు కూడా కంపెనీలు ముందుకు రావడం సహజం. అయితే.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఈ టెండర్‌లో ఆర్థిక బిడ్లు సుమారు 15 శాతం ఎక్కువకు దాఖలైనట్లు తెలుస్తోంది. దీంతో వీటిని రద్దు చేసి, మళ్లీ టెండర్లను పిలుస్తారా? లేక అదే కంపెనీకి అప్పగిస్తారా? అనే అంశం ఆసక్తిగా మారింది. ఒకవేళ వీరికే ఈ టెండర్లను కట్టబెడితే…ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున దుర్వినియోగమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మొత్తం తతంగం వెనుక ఆ కంపెనీ!

 • మన ఊరు-మన బడి టెండర్ల తతంగాన్ని ఒకే కంపెనీ నడిపిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ టెండర్లలో అర్హత సాధించిన వాటిల్లో కొన్ని నేరుగా ఈ కంపెనీవే ఉండగా, మరికొన్ని టెండర్లలో జాయింట్‌ వెంచర్‌, సిస్టర్‌ కంపెనీల తరపున ఎల్‌-1గా నిలిచాయి. ఈ కంపెనీకి టెండర్లను కట్టబెట్టేందుకు కేంద్రీయ బండార్‌, నాకాఫ్‌ వంటి ప్రముఖ సంస్థలను కూడా అర్హత లేనివిగా ప్రకటించినట్టు తెలుస్తోంది. ఓ బడా కంపెనీకి, ఓ మంత్రి కుమారుడి కంపెనీకి పనులు ఇచ్చేందుకే ఇలా నిబంధనల్ని మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పైగా ఈ కంపెనీలు టెండర్‌ డాక్యుమెంట్‌లో సరైన ధ్రువపత్రాలను పొందుపరచకపోయినా.. అధికారులు వెరిఫై చేయకుండానే అనుమతించారనే ఫిర్యాదులు వస్తున్నాయి.
 • కంపెనీల అర్హతలను, సామర్థ్యాలను నిర్ణయించే ప్రక్రియను కూడా ఒక కంపెనీ ప్రతినిధులే పర్యవేక్షించినట్టు సమాచారం. ఇన్ని జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలను పర్యవేక్షించాల్సిన తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఈడబ్ల్యుఐసీ) అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి టెండర్‌లోనూ పిలిచిన మొత్తానికి, అడుగుతున్న అనుభవానికి పొంతన ఉండడం లేదు.
 • పెయింట్లు వేయడానికి అర్హతగా 131.50 లక్షల చదరపు మీటర్ల పనిని ప్రభుత్వంలో చేసి ఉండాలన్న నిబంధన పెట్టారు. అయితే దేశంలోని టాప్‌-15 కంపెనీల్లో ఒక్క ఏషియన్‌ పెయింట్స్‌కు మాత్రమే ఈ అనుభవం ఉంది. దీంతో ఈ కంపెనీని జాయింట్‌ వెంచర్‌ కింద పెట్టుకుని సదరు బడా కంపెనీ పనులను చేజిక్కించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 • గ్రీన్‌ చాక్‌బోర్డ్‌లో దేశంలో ఉన్న ఏకైక డీలర్‌ను కాదని, ఎక్కువ లాభం పొందడం కోసం వైట్‌మార్క్‌ అనే సంస్థతో జాయింట్‌ వెంచర్‌ కుదుర్చుకున్నారు. కాగా, డ్యూయల్‌ డెస్క్‌ ఫర్నిచర్‌ సరఫరా విషయంలో ఎలిగెంట్‌-గోద్రెజ్‌లు టెండర్‌ను వేశాయి. గోద్రెజ్‌కు మాన్యుఫ్యాక్చర్‌ వింగ్‌ లేదు. అయితే బోగస్‌ పత్రాలతో ఎలిగెంట్‌ సంస్థ టెండర్లను దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.

Leave a Reply