మావోయిస్టు కళావతి అరెస్టు

0
306

* కోర్టులో హాజరు పర్చిన పోలీసులు
* కాల్పుల్లో కాలికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స
కాకినాడ సిటీ, అమరావతి బ్యూరో:
సిపిఐ మావోయిస్టు విశాఖ జిల్లా పెదబయలు ఏరియా కమిటీ సభ్యురాలు సాకే కళావతి అలియాస్‌ భవానిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డిజిపి గౌతం సవాంగ్‌, తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పి నయీమ్‌ అస్మీ శనివారం తెలిసిన వివరాల ప్రకారం… విశాఖ జిల్లా జి.కె.వీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ మాదుగమల్లు అటవీ ప్రాంతంలో ఈ నెల 22న పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టు కళావతి తమకు పట్టుబడినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్‌పి నయీమ్‌ అస్మీ తెలిపారు.
కాకినాడలోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మాదుగమల్లు వద్ద జరిగిన ఎదురు కాల్పుల అనంతరం కొంతమంది మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి తప్పించుకొని పారిపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం గుర్తేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా బురదకోట అటవీ ప్రాతంలో కళావతి పట్టుబడినట్లు చెప్పారు. బుల్లెట్‌ గాయాలతో పోలీసులకు చిక్కిన ఆమెను రరపచోడవరం కోర్టులో ప్రవేశపెట్టామని డిజిపి గౌతం సవాంగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం మెరుగైన వైద్యం కోసం ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. కళావతి 20 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో వివిధ విభాగాల్లో పనిచేసినట్లు తెలిపారు. ఆమె మావోయిస్టు స్టేట్‌ జోన్‌ కమిటీ సభ్యులు పెద్దన్న అలియాస్‌ జగన్‌ భార్య అని డిజిపి పేర్కొన్నారు. విశాఖ మన్యంలో కూంబింగ్‌ కొనసాగుతోందని తెలిపారు.

Courtesy Prajashakathi…

Leave a Reply