- వంతెన కింద నగ్నంగా మృతదేహం..
- ముఖంపై బండరాయితో మోది దారుణం
- మృతురాలి మెడలో బంగారు గొలుసు
- చేతులకు 2 బంగారు గాజులు, ఉంగరం
- మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రానికి చెందిన మహిళగా అనుమానం!
చేవెళ్ల/హైదరాబాద్ సిటీ : రంగారెడ్డి జిల్లాలో ‘దిశ’ తరహా మరో ఘటన వెలుగుచూసింది. గుర్తు తెలియని ఓ వివాహితపై అత్యాచారం చేసిన దుండగులు ఆమెను దారుణంగా హత్య చేసి.. ఓ వంతెన కింద పడేశారు. బాధితురాలిని గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖంపై బండరాయితో మోది పరారయ్యారు. చేవెళ్ల మండలం తంగడపల్లి శివారు ప్రాంతానికి ఉదయం 7గంటల సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు బహిర్బూమికి వెళ్లాడు. అక్కడ కొద్ది దూరంలో ఉన్న వంతెన కింద ఒంటిపై దుస్తులు లేకుండా నగ్నంగా పడిఉన్న ఓ మహిళ (30-35) మృతదేహం కనిపించింది.
వెంటనే అతడు గ్రామస్థులకు సమాచారమిచ్చాడు. విషయం తెలిసిన చేవెళ్ల సీఐ బాలకృష్ణ, ఎస్సై రేణుకారెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించగా.. ముఖంపై బండరాయితో బలంగా మోది హత్య చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ముందుగా బాధితురాలిని తాడుతో ఉరేసి హత్య చేసిన దుండగులు మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల ప్రాంతంలో ఇక్కడ పడేసి ఉంటారని భావిస్తున్నారు. మృతదేహానికి తాడు కట్టి వంతెన కిందికి దించినట్లుగా అనుమానిస్తున్నారు. మృతురాలి మెడలో ఓ బంగారు గొలుసు, చేతులకు బంగారు గాజులు, ఉంగరం ఉన్నట్లుగా గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించగా.. వంతెన సమీపంలో కొద్ది దూరం వరకు వెళ్లి ఆగిపోయాయి.
హత్యాచారానికి గురైన బాధితురాలికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ జరిగిందని, ఆమె వివాహితగా భావిస్తున్నట్లు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు చెప్పారు. వివాహేతర సంబంధం, ఆర్థిక గొడవలు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దుండగులను పట్టుకుంటామని ఘటనా స్థలాన్ని సందర్శించిన శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, చేవెళ్ల ఏసీపీరవీందర్‌రెడ్డి పేర్కొన్నారు.
కీలకంగా మారిన హాల్‌మార్క్
మృతురాలి రింగుపై ఉన్న బంగారం కేడీఎం హాల్‌మార్కు గుర్తులే పోలీసులకు కీలక ఆధారంగా మారాయి. రింగుపై డి2093 కెడీఎం.21, బి2 అని రాసి ఉంది. ‘స్టోన్‌తో కూడిన గొలుసులు, హాల్‌మార్క్ ఏ రాష్ట్రంలో మహిళలు ఎక్కువగా ఉపయోగిస్తారు. కొత్త రకం మోడల్‌తో ఉన్న బంగారు రింగు ఎక్కడ ఎక్కువగా వాడుకలో ఉంది’ అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గుర్తించిన వారు చేవెళ్ల పోలీసులను 9440627356, 9440627359, 9440627352 నంబర్లలో సంప్రదించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.
Courtesy Andhrajyothi