84వేల కోట్లు కేంద్రం ఎగవేత

0
19

– పీఎం మాతృవందన యోజన అంతంతే..
– రూ.14వేల కోట్లు అవసరమైతే..రూ.1300 కోట్లు కేటాయింపు
– బడ్జెట్‌ నామమాత్రం..అమలు అరకొర..
– గర్భిణులు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం, పోషకాహారంపై దెబ్బ

న్యూఢిల్లీ : ప్రసవించిన మహిళకు ప్రత్యేక ప్రయోజనాలు అందజేయాలని ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ స్పష్టంగా చెబుతోంది. చట్టంలోని సెక్షన్‌-4 ప్రకారం ప్రతి గర్భిణి, ప్రసవ మహిళ రూ.6 వేలు నగదు సాయం పొందటానికి అర్హురాలు. అంతేకాదు పోషకాహారం, ఆరోగ్యం కోసం పలు ప్రయోజనాల్ని ప్రభుత్వం అందజేయాలి. నవజాత శిశు రక్షణ, ఆరోగ్యం, పాలిచ్చే తల్లిగా ఆమె ఆరోగ్యం కోసం ఈ ప్రయో జనాల్ని అందజేయాలని చట్టం పేర్కొన్నది. వీటిని అమలు జేస్తామని కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన హామీ ఇచ్చింది. అయితే ఇదంతా కూడా గత ఏడేండ్లుగా కాగితాలకే పరిమిత మైందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడేండ్లలో రూ.84వేల కోట్ల రూపాయల విలువజేసే ప్రసూతి ప్రయోజనాలకు కేంద్రం ఎగనామం పెట్టింది. తద్వారా దేశవ్యాప్తంగా ఎంతోమంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు నష్టపోయారు. ప్రభుత్వం నుంచి దక్కాల్సిన నగదు సాయం, ఇతర ప్రయోజనాలకు దూరమయ్యారు.

రూ.1300కోట్లతో సరిపెట్టారు
ప్రధాని మోడీ నేతృత్వంలో 2014లో ప్రభుత్వం ఏర్పడింది. ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించి చట్టబద్ధమైన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే. ఇందుకోసం వారికి నచ్చిన పేరుతో ఏదో ఒక పథకాన్ని ప్రారంభించాలి. కానీ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల తర్వాత ..’పీఎం మాతృవందన యోజన’ పథకాన్ని 2017లో తీసుకొచ్చింది. 2015-16లో, 2016-17లో ప్రసూతి ప్రయోజనాలకు నామమాత్రంగా నిధులు విడుదల చేసింది. పథకం తీసుకొచ్చిన తర్వాతైనా ప్రయోజనాలు అందజేశారా? అంటే అదీ లేదు. 2017-18లో మాతృవందన యోజన కింద కేంద్ర బడ్జెట్‌లో రూ.2,700కోట్లు కేటాయించారు. అసలు వ్యయం మరింతగా తగ్గింది. మరుసటి ఏడాది బడ్జెట్‌లో కేటాయింపు రూ.2500కోట్లకు తగ్గింది. 2020-21లో కేవలం రూ.1300కోట్లతో సరిపెట్టారు. ఇలా ఏటేటా పెరగల్సిన బడ్జెట్‌, వాస్తవ వ్యయం..తగ్గుతూ వస్తోంది.

అనేక అడ్డంకులు
నిధుల వ్యయంలో కోతలు విధించటమేగాక, పథకం అమలును ఎలా నీరుగార్చాలా ?అనే విధంగా కేంద్రం వ్యవహరిస్తోంది. ప్రతి గర్భిణి, పాలిచ్చే తల్లి ప్రభుత్వ నగదు సాయం, ప్రయోజనాలకు అర్హులు. మాతృ వందన యోజన 2017లో తీసుకొచ్చాక, పథకం మార్గదర్శకాల్ని మోడీ సర్కార్‌ మార్చేసింది. మొదటి ప్రసవానికి మాత్రమే పథకాన్ని అమలుజేస్తామని పేర్కొన్నది. నగదు సాయాన్ని రూ.6వేల నుంచి రూ.5వేలకు తగ్గించింది. పేదలు, పెద్దగా చదువుకోని మహిళలు పథకం ప్రయోజనాలు పొందేందుకు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పదుల సంఖ్యలో పత్రాలు జత చేయాల్సి రావటం, ఏదైనా లేకపోతే..పథకం కింద ప్రయోజానాలు నిరాకరించటం సర్వసాధారణమైంది. క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కార్యకర్తలు అన్ని వివరాలతో కాగితాలు పంపుతున్నా..ప్రసూతి ప్రయోజనాలు రావటం లేదు.

రూ.14వేల కోట్లు లేవా?
కోట్లాది మంది మహిళల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన అంశమిది. బడ్జెట్‌ పరిమితికి మించి నిధులు ఖర్చు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.మనదేశ జనాభా 132కోట్ల మందిలో, ప్రతి వెయ్యిమందికి జననాల రేటు 17.4 ఉంది. దీని ప్రకారం 90శాతం కేసుల్లో ప్రసూతి ప్రయోజనాలకు కేంద్రం సుమరుగా రూ.14వేల కోట్లు ఖర్చు చేయాల్సి వుంటుంది. ఇది దేశ జీడీపీలో కనీసం 0.05శాతం కూడా ఉండదు. రూ.34లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌లో రూ.14వేల కోట్ల వ్యయం కష్టతర మైన అంశం కాదు. ఆరోగ్యకరమైన పౌర సమాజం, మహిళల ఆరోగ్యానికి సంబంధించిన అంశమిది. గర్భిణులు, పాలిచ్చే తల్లులపై ప్రభుత్వం చేసే ఖర్చు వృధా కాదని పాలకులకు తెలియనిది కాదు.

ప్రచారం మాత్రం ఘనం
వివిధ మాధ్యమాల్లో ప్రసూతి ప్రయోజనాలపై మోడీ సర్కార్‌ ఘనంగా ప్రచారం చేస్తోంది. ప్రతి ఏటా బడ్జెట్‌లో కేంద్రం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని కాగితాలపై లెక్కలు చూపుతోంది. వాస్తవానికి నిధుల వ్యయం అరకొరగా ఉందని తేలింది. దాంతో రూ.84వేల కోట్ల విలువజేసే ప్రసూతి ప్రయోజనాలకు అర్హులు దూరమయ్యారు. బడ్జెట్‌ సమయంలో భారీ మొత్తంలో కేటాయింపులు జరపటం, ఆ తర్వాత నిధుల వ్యయంలో కోతలు విధించటం పరిపాటిగా మారింది.

Courtesy Nava Telangana

Leave a Reply