మైనార్టీలపై కత్తిగట్టిన కేంద్రం

0
58

మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ నిలిపివేతపై సర్వత్రా ఆగ్రహం
ఒక వర్గాన్ని ఉన్నత విద్యకు దూరం చేయటమే : విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు

న్యూఢిల్లీ : ‘మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌’ను నిలిపివేస్తూ కేంద్రం తీసుకున్న చర్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఫెలోషిప్‌ను నిలిపివేస్తున్నామని గత గురువారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు. ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వర్గాన్ని ఉన్నత విద్యకు దూరం చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఇదంతా చేస్తోందన్నారు. మైనార్టీల్లో అత్యంత వెనుకబడిన విద్యార్థులు ఆర్థిక కారణాలతో ఉన్నత విద్యను మధ్యలో వదిలేయకుండా ఆదుకోవటం కోసం యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ‘మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌’. ఎంఫిల్‌, పీహెచ్‌డీ చదివే ముస్లిం, బౌద్ధ, క్రైస్తవ, జైన, పార్సీ, సిక్కు విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. ఎంపికైన విద్యార్థులకు పలు దఫాలుగా ఆర్థిక సాయం అందుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నోవేల మందిని ఆదుకునే ఈ పథకాన్ని మోడీ సర్కార్‌ హఠాత్తుగా నిలిపివేయటాన్ని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యావేత్తలు తప్పుబడుతున్నారు. ఉన్నత విద్యా అవకాశాల్ని మైనార్టీలకు దూరం చేయటంగా విద్యావేత్తలు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ ఫెలోషిప్‌లను కూడా మోడీ సర్కార్‌ నిలిపివేసే ప్రమాదముందని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.సాయి బాలాజీ చెప్పారు. మైనార్టీ వ్యతిరేక విధానాల్లో భాగంగానే ఈ ఫెలోషిప్‌ను కేంద్రం నిలిపివేసిందన్నారు. ”కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం. స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా ఆజాద్‌ పేరుమీదుగా ఈ పథకాన్ని యుపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఆపేయటమంటే, స్వాతంత్య్ర సమరయోధుల్ని అగౌరవపర్చటమే”నని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మౌలానా ఆజాద్‌ కుటుంబ సభ్యులు కూడా విమర్శించారు. మౌలానా ఆజాదీ సేవల్ని మోడీ సర్కార్‌ తగ్గించి చూపే ప్రయత్నం చేస్తోందిన మౌలానా ఆజాద్‌ మేనకోడలు హస్నారా సలీం అన్నారు. ఆయన విగ్రహాన్ని తొలగించారని గతంలో ఒక కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యలో మైనార్టీ విద్యార్థుల చేరికలు (ఎన్రోల్‌మేంట్‌) కేవలం 16శాతానికి పరిమితమైందని యుజీసీ మాజీ చైర్మన్‌ సుఖాడియో థోరట్‌ చెప్పారు. ఆ వర్గాల్లోని పేద విద్యార్థులు యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కొనసాగించలేక పోతారని చెప్పారు.

ఫెలోషిప్‌ నిలిపివేయటం దారణం : ఇర్ఫాన్‌ హబీబ్‌, ప్రముఖ చరిత్రకారుడు
ఇది కేవలం మౌలానా ఆజాద్‌ను అగౌరవపర్చటమే కాదు, స్వాతంత్య్ర సమరయోధుల్ని కించపర్చటమేనని ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ అభిప్రాయపడ్డారు. ”కేంద్ర విద్యామంత్రిగా సుదీర్ఘకాలం సేవలందించిన వ్యక్తి మౌలానా ఆజాద్‌. ఆయన పేరుమీద తీసుకొచ్చిన ఫెలోషిప్‌ పథకాన్ని ఉపసంహరించటం దారుణం. మౌలానా హయాంలోనే ఐఐటీ-ఖరగ్‌పూర్‌ సహా అనేక ప్రధాన విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. సంగీత నాటక అకాడమీ ఉనికిలోకి వచ్చింది” అని ఆయన అన్నారు. పథకాన్ని నిలిపివేయటం చాలా దురదృష్టకరమని లక్నోకు చెందిన ప్రొఫెసర్‌ సూరజ్‌ భహదూర్‌ తాపా అన్నారు. ‘ముస్లిం వ్యతిరేక’ వైఖరిలో భాగంగానే మైనార్టీ విద్యార్థులకు ఎంతో అవసరమైన ఈ సమయంలో పథకాన్ని కేంద్రం నిలిపివేసిందని ‘ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌’ అధ్యక్షురాలు నందితా నరైన్‌ అన్నారు.

Leave a Reply