సుఖేష్ గుప్తాను కస్టడీలోకి తీసుకున్న ఈడీ అధికారులు

0
71

హైదరాబాద్ : ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో ఉన్న ఆయనను అధికారులు ఈడీ ఆఫీసుకు తరలించి ప్రశ్నిస్తున్నారు.కోర్టు ఉత్తర్వుల మేరకు ఇవాళ్టి నుంచి నవంబర్ 2వ తేదీ వరకు ఆయన కస్టడీ కొనసాగనుంది. ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాను 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈ నెల 20న ఈడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. విచారణలో భాగంగా ఈడీ అధికారులు ఎంఎంటీసీ నుంచి కొనుగోలు చేసిన బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బు ఎక్కడికి తరలించారన్న అంశంపై ఆరా తీయనున్నారు. దీంతో పాటు ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల ఎగవేతపైనా సుఖేష్ ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.

ఎంఎంటీసీకి రూ.504 కోట్ల రుణం ఎగవేత కేసుకు సంబంధించి ఈడీ సుఖేష్ గుప్తాను ఈ నెల 17న అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కీలక ఆధారాలు సేకరించగా.. ఈడీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఈ నెల 16,17 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోని ఎంబీఎస్ జ్యుయెలర్స్ లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో లభించిన కీలక సమాచారం ఆధారంగా సుఖేష్ గుప్తాను అరెస్ట్ చేశారు. ఎంబీఎస్ జుయెలర్స్ నుంచి రూ. 150 కోట్ల విలువైన బంగారం, రూ.1.50 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఎంఎంటీసీ సంస్థ నుంచి రూ.504 కోట్ల విలువైన బంగారాన్ని సుఖేష్ గుప్తా క్రెడిట్ రూపంలో తీసుకున్నారు. అయితే ఆ డబ్బు తిరిగి చెల్లించలేకపోవడంతో ఎంఎంటీసీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ 2013లో ఎంబీఎస్ జ్యుయెలర్స్ ఎండీ సుఖేష్ గుప్తాపై కేసు నమోదుచేశారు. దీని ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply