కష్టాల నెలవు

0
241
  • బడుగు జీవులపై లాక్‌డౌన్‌ దెబ్బ
  • మెకానిక్‌ల బతుకు బండి బ్రేక్‌డౌన్‌
  • కష్టాల్లో ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, దర్జీలు
  • టూరిస్టుల్లేక పర్యాటక రంగం కుదేలు
  • దాంతో ముడిపడ్డ36 సెగ్మెంట్లు బంద్‌
  • రోజుకు 500 కోట్ల వ్యాపారానికి దెబ్బ
  • హోటల్‌ రంగానికే 100 కోట్లు నష్టం
  • హోటళ్లు, పబ్‌లు, ట్రావెల్‌ ఏజెన్సీలు
  • రిసార్టుల సిబ్బందికి ఉపాధి కరువు
  • ఆలయాల వద్ద చిరు వ్యాపారులు
  • తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం

మధ్యాహ్నం భోజనం కోసం మండే ఎండలోనూ కనుచూపు మేరంతా భౌతిక దూరం పాటిస్తూ నిలుచున్న అన్నార్తులు. వీరిలో పేదలే కాకుండా దిగువ మధ్యతరగతి ప్రజలు కూడా ఉండటం మారిన బతుకు చిత్రానికి తార్కాణం. హైదరాబాద్‌ హయత్‌నగర్‌ బస్టాండ్‌ బయట దృశ్యమిది.

కుటుంబాన్ని పోషించేదెలా?
నెల రోజులుగా షాపు మూసి ఉంచడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది. కుటుంబ పోషణ భారంగా మారింది.

షాపు తెరిస్తే పోలీసులతో భయం. అందుకే.. తప్పని పరిస్థితులలో షాపు నుంచి టూల్స్‌ తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకున్నా. తెలిసిన వారు ఫోన్‌ చేస్తే వారి ఇంటి వద్దనే బైక్‌ మరమ్మతులు చేస్తున్నాం. మా షాపులో పనిచేసే ముగ్గురు మెకానిక్‌లకు ఉపాధి లేక నన్ను డబ్బులు అడుగుతున్నారు. ఇద్దామని ఉన్నా.. నా పరిస్థితే అంతంతమాత్రంగా ఉండడంతో వారికి ఇవ్వలేకపోతున్నా.
ప్రశాంత్‌, బైక్‌ మెకానిక్‌, చిక్కడపల్లి

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌ : గుప్పెడంత గువ్వ పిట్టలు.. పుల్లా పుడకా పేర్చి కట్టుకున్న గూడును ఒక్క గాలివాన చెల్లాచెదురు చేసినట్టు.. చాలీచాలని సంపాదనతో జీవితాలను నెట్టుకొచ్చే చిరుజీవులపై లాక్‌డౌన్‌ అనే పిడుగు పడి బుధవారానికి నెల రోజులు!! కానీ.. ఈ నెల రోజుల్లో ఎంత తేడా? జీవితాలు తల్లకిందులయ్యేంత తేడా!! షాపింగ్‌ మాళ్లు.. సినిమా హాళ్లు.. దుకాణాలు మూగబోయాయి! అచ్చం వాటిల్లో పనిచేసే వేతన జీవుల జీవితాల్లాగా!! నిత్యం వందలాది వాహనాలతో, వేలాది మంది జనాలతో కళకళలాడే రోడ్లన్నీ బోసిపోయాయి. వారి ఆర్థిక పరిస్థితిలాగా!! కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా మార్చి 22న ప్రకటించిన జనతా కర్ఫ్యూ.. ఆ తర్వాత ఏప్రిల్‌ 14 దాకా లాక్‌డౌన్‌.. మళ్లీ మే 3 దాకా లాక్‌డౌన్‌ పొడిగింపు.. ఆ బడుగు జీవుల బతుకుల్ని ఛిద్రం చేశాయి! ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల నుంచి దర్జీల దాకా.. మెకానిక్‌ షాపులు, ఫ్యాన్సీషాపులు, పూల దుకాణం వంటివాటితో తమ కాళ్ల మీద తాము నిలబడిన చిరుజీవుల నుంచి.. హోటళ్లు, ఎలకా్ట్రనిక్‌, వస్త్ర దుకాణాల వంటివాటిలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవారి దాకా.. అందరిదీ ఒకటే వ్యధ. ‘ఈ రోజు గడిచేదెలా.. రేపు బతికేదెలా?’ అని!
ప్రజలకు కావాల్సిన నిత్యావసరాల దుకాణాలను ప్రభుత్వం తెరిచి ఉంచుతున్నా.. ఆ నిత్యావసరాలను కొనుక్కోవడానికి అవసరమైన డబ్బు సంపాదించుకునే మార్గం లేక వీరంతా అల్లాడుతున్నారు.  ప్రభుత్వం అందిస్తున్న సాయం కొందరు పేదలకు అందుతోంది సరే.. ఆ సాయం పరిధిలోకి రానివారి సంగతి, ఏ సంక్షేమ పథకానికీ నోచుకోని మధ్యతరగతి బడ్జెట్‌ బతుకుల సంగతి ఎవరికీ పట్టట్లేదు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం? వేతన జీవుల, చిరువ్యాపారుల ఆకలి కేకలు తప్ప!!

పర్యాటకం కుదేలు..
రాష్ట్రంలో నిత్యం దేశ, విదేశీ పర్యాటకులతో కళకళలాడే హోటళ్లు, పర్యాటక కేంద్రాలు, చారిత్రక స్థలాలు లాక్‌డౌన్‌ దెబ్బకు బోసిపోతున్నాయి. స్టార్‌ హోటళ్లు కళావిహీనమయ్యాయి.  విందులు, వినోదాలు లేవు. కనీవినీ ఎరుగని విధంగా ఎవరింటికి వారే పరిమితం కావాల్సిన పరిస్థితి. దీంతో పర్యాటక రంగం పూర్తిగా కుదేలైంది. ఆ రంగంతో ముడిపడి ఉన్న 36 విభాగాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీనివల్ల రోజుకు రూ.500 కోట్ల వ్యాపారంపై దెబ్బ పడుతోంది. రాష్ట్రంలో చిన్నా చితకా హోటళ్లన్నీ కలిపి.. 35 వేల దాకా ఉంటాయి. ఈ రంగంలోనే రోజుకు రూ.100 కోట్ల మేర బిజినెస్‌ దెబ్బతిన్నదని ఆ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ రోజుకు రూ.20 లక్షల దాకా వ్యాపారం చేసి రూ.80 కోట్ల వార్షిక టర్నోవర్‌ సాధించేది. ఇప్పుడు అవేవీ లేవు.

బతుకు బండి బ్రేక్‌డౌన్‌
రెక్కాడితేగానీ డొక్క నిండని మెకానిక్‌ల జీవితాలు.. లాక్‌డౌన్‌ దెబ్బకు బ్రేక్‌డౌన్‌ అయ్యాయి! రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్‌లోనే 10 వేల మంది మెకానిక్‌లు ఉంటారని అంచనా. వారితో పాటు ఒక్కో దుకాణంలో ఇద్దరు నుంచి నలుగురు దాకా కుర్రాళ్లు పనిచేస్తుంటారు. లాక్‌డౌన్‌ వల్ల మెకానిక్‌ షాపులన్ని మూతపడిపోవడంతో వారంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. ఫ్యాన్సీషాపుల వంటి చిన్న చిన్న దుకాణాలు నడుపుకొనే వారి పరిస్థితీ ఇదే! సొంత వాహనాలు లేనివారిని గమ్యం చేర్చే ఆటో, క్యాబ్‌డ్రైవర్ల పరిస్థితి లాక్‌డౌన్‌ కారణంగా అగమ్యగోచరంగా మారింది. ఒకవైపు ఆటో/క్యాబ్‌ కొనడానికి బ్యాంకులో తీసుకున్న రుణవాయిదాలు కట్టాలి. మరోవైపు ఇల్లు గడపాలి. సంపాదన మాత్రం ఒక్క పైసా లేదు. జంటనగరాలలో దాదాపు 20 వేల కుటుంబాలు టైలరింగ్‌ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి.

మరో 10వేల మంది టైలర్‌షాపులలో పనిచేస్తున్నారు. కానీ, ఇప్పుడు కుట్టు మిషన్ల చప్పుడు పూర్తిగా ఆగిపోయింది. ఇప్పుడా కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా భక్తులు లేక ఆలయాలన్నీ బోసిపోయాయి. దీంతో పూజసామగ్రి అమ్ముకుంటూ జీవించే చిరువ్యాపారుల బతుకులు ఛిద్రమయ్యాయి. వీరే కాదు, చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే వేతనజీవులు ఇంకా ఎందరో లాక్‌డౌన్‌ వల్ల ఆకలితో అలమటిస్తున్నారు.

నెల రోజులుగా షాపు మూత  
లాక్‌డౌన్‌ సందర్భంగా నెల రోజులుగా షాపు మూతపడింది. దుస్తులు కుట్టించుకునే వారు లేరు. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం. ఇంటి అద్దె, షాపు అద్దె కట్టలేకపోతున్నాం. ఆర్థిక సహయంతోపాటు నిత్యావసర వస్తువులను ప్రతి టైలర్‌ కుటుంబానికీ  ఇవ్వాలి.
రచ్చ శ్రీనివాస్‌, టైలర్‌, బాగ్‌అంబర్‌పేట 

హోటల్‌ రంగం కోలుకోవడానికి నాలుగైదేళ్లు!
హోటళ్లరంగం పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే కనీసం నాలుగైదేళ్లు పడుతుంది. నా 50 ఏళ్ల సర్వీసులో ఇంతటి నష్టాలను ఎప్పుడూ చవిచూడలేదు. ఈ దెబ్బతో సగం హోటళ్లు మూతపడినా ఆశ్చర్యపోనక్కరలేదు.
 ఎంఎస్‌ నాగరాజు, తెలంగాణ హోటల్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌

క్యాబ్‌ డ్రైవర్లకు రూ.5వేలు ఇవ్వాలి
దాదాపు 90% మంది క్యాబ్‌ డ్రైవర్లు అప్పులు చేసి కార్లు కొనుగోలు చేశారు. కార్లు ఉండడంతో వారికి తెల్ల కార్డు తీసివేశారు.ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉపాధి కోల్పోయిన క్యాబ్‌ డ్రైవర్లకు రూ.5 వేలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా క్యాబ్‌ డ్రైవర్లకు రూ.5 వే లు ఇవ్వాలి.
 షేక్‌ సల్లావుద్దీన్‌,
అధ్యక్షుడు, క్యాబ్‌ డ్రైవర్స్‌ సంఘం

Courtesy Andhrajyothi

Leave a Reply