మోడీ సేవలో మీడియా

0
170
జియా ఉస్‌ సలామ్‌

ప్రధాని నరేంద్ర మోడీ వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం సామాన్య ప్రజానీకాన్ని మాత్రమే కాక ఎలక్ట్రానిక్‌ మీడియాను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియాకు చెందిన అనేకమంది, ప్రధానికి సన్నిహితంగా ఉన్నట్లు, ఆయన చేసిన గొప్ప పనులు తమకు ముందే తెలుసని చెప్పుకున్నారు. కానీ వ్యవసాయ చట్టాలకు సంబంధించి, మోడీ ఏమి చేయనున్నారనే విషయంలో ఎవరికీ ఏ సందేహం కలగలేదు. టైమ్స్‌ నౌ, రిపబ్లిక్‌ భారత్‌, ఇండియా టీవీ, జీటీవీ, ఆజ్‌ తక్‌ లాంటి ఛానళ్ళకు చెందిన ప్రముఖ యాంకర్లకు వ్యవసాయ చట్టాల రద్దు గురించి మాత్రమే కాక, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలలో జరుగబోయే ఎన్నికలపై చట్టాల రద్దు ఎటువంటి ప్రభావాలను చూపుతుందనే సూచనలు కూడా తెలియదు.

నవంబర్‌ 26, 2020 నుండి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన 700మంది రైతులకు చెందిన కుటుంబాలతో మాట్లాడాల్సిన అవసరం ఉందనే ఆలోచన ఈ మీడియా ప్రముఖులెవరికీ తట్టలేదు. దేశ రాజధానికి చేరకుండా రైతులను టియర్‌ గ్యాస్‌, నీటి ఫిరంగులు, రోడ్డుపై మేకులు నాటించడం, పోలీస్‌ బారికేడ్లతో అడ్డుకునే ప్రయత్నం చేసిన సందర్భాలను గుర్తు చేసుకోవాలని వీరెవరికీ అనిపించలేదు. చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ చేస్తూ, 11 విడతలుగా వివిధ కేంద్ర మంత్రులతో చర్చలు జరిపే సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన భోజనం కూడా చేయనంతటి దృఢనిశ్చయంతో రైతులు ఎలా ఉన్నారనే విషయం గురించి ఏ ఒక్క మీడియా ప్రతినిధి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఆసక్తికరంగా, 700 మంది రైతులు ప్రాణాలను కోల్పోయి, సుదీర్ఘకాలం పాటు నిరసనలు తెలిపినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ ఏ ఒక్క రైతుతో మాట్లాడలేదు, రైతుల మరణాల పట్ల సానుభూతిని కూడా వ్యక్తం చేయలేదు.

ఒక్క ఎన్డీటీవీ ఇండియా మినహాయించి, ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపడంలో ఎలక్ట్రానిక్‌ మీడియా వైఫల్యం చెందింది. ఆ పని చేయడానికి బదులుగా, మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనుకున్న గురునానక్‌ జయంతి రోజున, దాదాపుగా అన్ని ఛానెళ్లు, జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేసింది, తన వ్యక్తిగతమైన, పార్టీ ప్రయోజనాలను కూడా కాదని ఒక నిజమైన దేశభక్తునిగా, రాజనీతిజ్ఞుడుగా నరేంద్రమోడీ ఎలా నిరూపించుకున్నాడనే ప్రభుత్వ కథనాలను ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. రిపబ్లిక్‌ భారత్‌కు చెందిన ఒక యాంకర్‌, దేశ చరిత్రలో మొదటిసారిగా భారతదేశం ఒక సమర్థుడైన ప్రధానమంత్రిని కలిగి ఉందని అత్యుత్సాహంతో పేర్కొన్నాడు.

జాతినుద్దేశించి మోడీ ప్రసంగించిన కొన్ని గంటల తర్వాత, న్యూస్‌ ఛానళ్ళ యాంకర్లకు, ప్రధాని నిర్ణయం పట్ల ఏమి మాట్లాడాలో తెలియలేదు. ప్రభుత్వ కథనాన్ని సిగ్గులేని తనంతో బలపరిచిన తీరును దాచడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వారి స్వరాలలో సహజమైన విశ్వాసం, ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి చేసిన వారి ప్రయత్నాలలో నమ్మకం కొరవడినట్లు అనిపించింది. ”మీరు చట్టాలను ప్రవేశపెట్టినప్పుడు, మా జర్నలిస్టు సోదరులంతా, చట్టాలలో ఉండే మంచి గురించి వివరించే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మీరు మమ్ముల్ని చాలా నిరుత్సాహానికి గురి చేశారు. కొంతమంది ప్రజలు ఆర్టికల్‌ 370 ని కావాలని కోరుతున్నారని, మీరు దానిని కూడా వెనక్కి తీసుకుంటారా?” అని సత్య ఛానెల్‌ కార్యక్రమాలను పరిచయం చేసే సుశాంత్‌ సిన్హా అన్నాడు. ప్రేక్షకులకు తన ముఖాన్ని చూపించలేని అసమర్థతను వ్యక్తం చేస్తున్న అతని ట్వీట్లు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అతని బాధ స్పష్టంగా కనిపించింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం ద్వారా తప్పు చేసి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తనకిష్టమైన రాజకీయ నాయకుడు, మోడీ తనను మోసం చేశాడని అతడు భావించాడు. ”బీజేపీ ఏమీ సాధించదని రాసిస్తాను, ఇది మీ (ప్రధాన మంత్రి) ప్రతిష్టకు ప్రమాదకరమని” అతడు తన విచారాన్ని వ్యక్తం చేస్తాడు.

టైమ్స్‌ నౌ ప్రతినిధి నావికా కుమార్‌ రైతు సంఘాల నాయకుడు రాకేశ్‌ టికాయత్‌ ఆగ్రహానికి గురైంది. ఒక లైవ్‌ షోలో, తనకు ఎన్నికల్లో పోటీ చేయడం ఆసక్తి లేదనీ, కానీ జర్నలిస్టులకు ఆసక్తి ఉంటుందని అన్నాడు. ”టీవీ యాంకర్లు, బీజేపీ అధికార ప్రతినిధుల కంటే ఎక్కువ అత్యుత్సాహంతో మాట్లాడతారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌ ఎవరికి కావాలో చెప్పండి, మేము వారికి టికెట్లు ఇప్పిస్తాం. నీవు తీసుకో టికెట్‌ మీకు నిరంతరాయంగా మాట్లాడే అలవాటు ఉంది. ముందు మీరు వినండి. మీకు వ్యవసాయ చట్టాల గురించి ఏమీ తెలియదని” అన్నాడు.

ప్రచారపు ఛానెళ్లు
రిపబ్లిక్‌ ఛానెల్‌ ప్రసారం చేసే ”ఆన్‌ ద డిబేట్‌ ఎట్‌ 9”లో ఆర్నబ్‌ గోస్వామి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ”వ్యవసాయ చట్టాలను ఒక సాధనంగా ఉపయోగించి దేశాన్ని నాశనం చేయాలని అనుకున్న కొన్ని శక్తులకు ఇప్పుడేమీ లేకుండా పోయింది. పాకిస్థానీయులకు, ఖలిస్తానీయులకు మద్దతిచ్చే, మద్దతు తీసుకునే అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల ఎన్నికల కోసం దీనిని రాజకీయం చేసే అవకాశం లేదు. ఈ రాత్రి వారు చాలా నిరుత్సాహానికి గురవుతారు. సంవత్సర కాలంగా, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలను రావణకాష్టంలా మండించడానికి లెక్కలు వేసి, పథకాలను రచించిన వారికి ఏమి జరుగుతుంది? ఇప్పుడు వారేమి చేయబోతున్నారు? ఇప్పుడు టూల్‌ కిట్‌ గ్యాంగ్‌ ఏమి చేస్తుందని” ఆయన పెడబొబ్బలు పెట్టాడు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోడానికి ముందు చనిపోయిన రైతులకు ఆర్నబ్‌ గోస్వామి శ్రద్ధాంజలి కూడా ఘటించక పోవడం ముందుగా ఊహించిన విషయమే. రైతులు టియర్‌ గ్యాస్‌, నీటి ఫిరంగులను ఎదుర్కొన్నప్పుడే ప్రభుత్వం ఎందుకు చట్టాలను రద్దు చేయలేదు లేదా రద్దు చేయలేకపోయిందని అతడు ప్రశ్నించలేదు.

‘న్యూస్‌ నేషన్‌’ కన్సల్టింగ్‌ ఎడిటర్‌ దీపక్‌ చౌరేషియా మోడీ నిర్ణయాన్ని ”కేంద్రం యొక్క గొప్ప నిర్ణయం”గా పేర్కొన్నాడు. ”నేనేమి చేసినా జాతి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేస్తాను” అని మోడీ అన్నట్టు దీపక్‌ చెప్పాడు. ”నీవు సంవత్సరం కాలంగా వ్యవసాయ చట్టాలను ప్రశంసిస్తున్నావు. ఇప్పుడు ప్రధాన మంత్రి క్షమాపణలు చెప్పాడు, కాబట్టి నీవు కూడా క్షమాపణలు చెప్పాలని” అతని ట్విట్టర్‌ ప్రేక్షకులు అన్నారు.

‘న్యూస్‌ ఇండియా 18’కు చెందిన ఆమన్‌ చోప్రా, మోడీ వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన రోజును ”ఒక ముఖ్యమైన దినం”గా పేర్కొన్నాడు. రైతు నాయకుడు టికాయత్‌ నిరసన వేదిక నుండి లేచి, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్తున్నారా లేదా అని అడిగాడు. దానికి టికాయత్‌ స్పందిస్తూ, ”సరియైన సమయంలో ఆ ముఖ్యమైన దినాన్ని మేము చూపిస్తాం. విరమించే ప్రశ్న ఎక్కడిది? ఇది ప్రారంభమే. కనీస మద్దతు ధర పైన ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియజేయాలి. ప్రభుత్వం ఏదో చెప్పింది కాబట్టి రైతులు వెళ్ళిపోయారనే భ్రమలో ఉండక్కర్లేదు” అని దీపక్‌కు సమాధానం చెప్పాడు.

‘ఆజ్‌ తక్‌’కు చెందిన అంజనా ఓం కాశ్యప్‌, మధ్య దళారులను వదిలించుకునే ఉద్దేశంతోనే వ్యవసాయ చట్టాలను తెచ్చారని అన్నారు. అసలు చట్టాలలోనే తప్పుడు ధోరణులు ఉన్నాయనే విషయాన్ని చెప్పుకోడానికి సిద్ధంగా లేకుండా, చట్టాలను సానుకూలంగా అర్థం చేసుకోవడంలో రైతులు విఫలం చెందారని ఆమె అన్నారు. టికాయత్‌తో ఆమె నిర్వహించిన కార్యక్రమం, బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రను కంగారు పెట్టింది. వ్యవసాయ చట్టాల లోని లోపాలను, కనీస మద్దతు ధరకు సంబంధించిన చట్టం అవసరాన్ని టికాయత్‌ నొక్కి చెప్పారు.

అసౌకర్యమైన ప్రశ్నలు
వ్యవసాయ చట్టాలను ఎందుకు, ఎలా వెనక్కు తీసుకున్నారనే విషయం గురించి ఏ ఒక్క ఛానెల్‌ కూడా విశ్లేషించే ప్రయత్నం చేయలేదు. తన పార్టీ ఎన్నికల్లో సాధించే విజయాలను, పార్టీ రాజకీయాలను కూడా లెక్క చేయకుండా చట్టాలను రద్దు చేసిన గొప్ప రాజనీతిజ్ఞుడుగా మోడీని చూపే ప్రయత్నం ఛానెళ్లు చేశాయి. వ్యవసాయ చట్టాలను ఇంతకు ముందే ఎందుకు రద్దు చేయలేదు? లేదా ప్రధానమంత్రి చట్టాల రద్దు నిర్ణయానికి ముందు రైతులతో ఒక సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు? అనే అసౌకర్యమైన ప్రశ్నలను ఏ ఒక్క యాంకర్‌ కూడా అడగలేదు.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ భారీగా స్థానాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ చట్టాలు రద్దు కావాలనీ, 2013లో ముజఫర్‌ నగర్లో జరిగిన మత అల్లర్ల గాయాలు మానిపోవాలని అక్కడి జాట్లు, ముస్లింలు కోరుకున్నారు. కానీ ఈ విషయాలను చానళ్లేవీ ప్రసారం చేయలేదు. పంజాబ్‌లో వ్యవసాయ చట్టాలు పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన తర్వాత అనేక మంది బీజేపీ శాసనసభ్యులు వారి నియోజకవర్గాలలోకి వెళ్లలేకపోయారు. బీజేపీతో మూడు దశాబ్దాల స్నేహంతో తెగతెంపులు చేసుకోవాలని శిరోమణి అకాలీదళ్‌ పై ఒత్తిడి పెరిగింది.

చిత్తశుద్ధి గల స్వరాలు
ఇక్కడ ఒక రెండు మినహాయింపులున్నాయి. బర్ఖాదత్‌, తన మోజో కథనంలో వ్యవసాయ చట్టాల రద్దును ”అద్భుతమైన” విషయంగా పేర్కొంది. చట్టాల రద్దును ప్రకటించే సందర్భంలో ప్రధానమంత్రి ”క్షమాపణలు” చెప్పాడని, ఇది ”ఎవ్వరినీ నిందించే సమయం కాదని” ఆమె అన్నారు. ”ఇది ఖచ్చితంగా ఎన్నికల వ్యూహం. తన విమర్శకుల కన్నా, మోడీ నేడు తన మద్దతుదారులనే ఎక్కువగా ఆశ్చర్యపరిచాడని” బర్ఖాదత్‌ అన్నారు. ”మోడీ భక్తులే ఆయనను ప్రధానమంత్రిగా అంగీకరించడం లేదని” ప్రముఖ జర్నలిస్టు తవ్లీన్‌ సింగ్‌ తన కార్యక్రమంలో చెప్పింది. చట్టాల రద్దును ప్రకటించిన రోజు సాయంత్రం తన అరగంట కార్యక్రమంలో ఎన్డీటీవీకి చెందిన రవీశ్‌ కుమార్‌, చర్చించదగిన ప్రతి విషయాన్ని చర్చించారు. ఇతర ఛానెళ్లు ”మోడీ తపస్సు”, ప్రేమ, ఆప్యాయత, దయా గుణాల గురించి వివరిస్తుంటే, ఒకవేళ ప్రధానమంత్రి మంచితనానికి మారుపేరుగా ఉంటే, ఆయన ఒక్కసారి కూడా రైతులను ఎందుకు కలవలేదు? ఇన్ని నెలల్లో సంభవించిన రైతుల మరణాలకు ఎందుకు నివాళులు అర్పించలేదు? ఆయన ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన పోరాటంలో ఉన్న గాయపడిన రైతులను ఉపశమింపజేయడానికి ఎందుకు వెళ్ళలేదు? ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయాలను ఆయన ప్రశ్నిస్తూ, ”ఒకవేళ ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు లేకుండా ఉండి ఉన్నట్లైతే, బహూశా వ్యవసాయ చట్టాలు రద్దయి ఉండెడివి కాదని” అన్నాడు.

అంతేకాకుండా సంవత్సరం పొడవునా, అధికార పార్టీ మంత్రులు, ఎంఎల్‌ఏలు, ఎంపీలు రైతులను ఖలిస్తానీయులని ఎలా నిందించారని ఆయన ప్రశ్నించాడు. ”జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా నరేంద్ర మోడీ రైతుల మరణాలకు విచారాన్ని వ్యక్తం చేయలేదు. వ్యవసాయ చట్టాలను అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం కారణంగా రైతులు ఎదుర్కొన్న కష్టాలకు కనీసం క్షమాపణలు చెప్పలేదు. కానీ వ్యవసాయ చట్టాలలో ఉండే అనుకూలమైన విషయాలను వివరించి, రైతులను ఒప్పించడంలో తన అసమర్థతను వ్యక్తం చేయడానికే పరిమితం అయ్యాడని” రవీశ్‌ కుమార్‌ అన్నాడు.

రైతులకు మార్గాన్ని చూపిన షాహీన్‌ బాగ్‌ మహిళలను రవీశ్‌ మాత్రమే ప్రశంసించాడు. ”వారు శాంతియుత నిరసనలలో భాగస్వాములై, భారత రాజ్యాంగం పరిధిలో మాత్రమే హక్కుల కోసం పోరాడడం సాధ్యమవుతుందని దేశ ప్రజలకు ఒక త్రోవ చూపించారని” ఆయన అన్నాడు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధానమంత్రి నిర్ణయాన్ని పొగుడుతూ చేసిన కాకిగోలలో, రవీశ్‌ కుమార్‌, బర్ఖాదత్‌ల స్వరాలు మాత్రమే చిత్తశుద్ధితో కూడుకున్నవి. ప్రభుత్వ కథనాన్ని ముందుకు తీసుకొని పోయేందుకు పాలక పార్టీ ఎంపీల కంటే కూడా మీడియానే ఎక్కువ అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తుంది.

Courtesy Nava Telangana

Leave a Reply