సామాజిక వైవిధ్యం కొరవడిన మీడియా

0
123
యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

పదహారు సంవత్సరాల నాటి మాట. 2006 వేసవిలో మండల్–2 ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఉన్నత విద్యా రంగంలో ఓబీసీ (ఇతర వెనుకబడిన కులాలు)లకు కుల ప్రాతిపదిక రిజర్వేషన్ల భావనపై భారతీయ మీడియా విషం కక్కుతున్న రోజులవి. ఆ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అగ్రకుల విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు వార్తా పత్రికలు, టెలివిజన్ ఎనలేని ప్రాధాన్యమిస్తున్నాయి కుల పరమైన వివక్షలు, ప్రతికూలతలను రూపుమాపడానికి కుల ప్రాతిపదిక విధానాలు అనివార్యమని మేము పోరాడుతున్న సందర్భమది. చాలా కఠినమైన పోరాటమది. అందులో భాగంగా బహిరంగ చర్చల్లో తీరిక లేకుండా పాల్గొంటూ రిజర్వేషన్ల వ్యతిరేక వాదనలను ఖండిస్తూ మా వాదనలను ఓర్పు, నేర్పుతో నివేదించాము.

ఆందోళనాభరిత, అయితే భావోద్వేగాలు ముప్పిరిగొన్న ఆ వేసవిలో ఒక రోజు సిఎస్‌డిఎస్ (సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవెలపింగ్ సొసైటీస్)లో నేను నా ఆఫీసులో ఉన్నాను. జితేంద్రకుమార్ అనే యువ పాత్రికేయుడు ఆగ్రహావేశాలతో వాదిస్తున్నాడు: ‘మీడియా అంతా బ్రాహ్మిణిక్ మనస్తత్వంతో ఉన్న అగ్రకుల పాత్రికేయులతో నిండిపోయి ఉంది. ఆది నేను ప్రత్యక్షంగా చూసిన వాస్తవం’. మీడియాలో అగ్రకులేతర ప్రజల అభిప్రాయాలకు స్థానం కల్పించేందుకు ధర్మబద్ధ పోరాటం చేస్తున్న అనీల్ చమారియా కూడా మాతో ఉన్నాడు. అతడు కూడా జితేంద్ర వాదనతో ఏకీభవించాడు ‘మీ వాదనలకు రుజువులు ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి?’ అని నేను ప్రశ్నించాను. ఇరువురూ తమ వాదనను నిరూపించేందుకు సుప్రసిద్ధ జర్నలిస్టుల పేర్లను, వారి కుల నేపథ్యాలను వెల్లడించారు. వారి వాదనలు సహేతుకమైనవే అయినా వాటికి సరైన రుజువులు కన్పించడం లేదు. సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా వారి వాదనలను నిరూపించవచ్చని నేను సూచించాను. నా యువ మిత్రులు అంగీకరించారు.

అలా మొదలయింది మన జాతీయ మీడియాలోని వృత్తి నిపుణుల సామాజిక నేపథ్యాలకు సంబంధించిన వివరాల మొదటి సర్వే. నిజానికి దానిని సర్వే అనకూడదు. వివిధ మీడియా సంస్థలలో పనిచేస్తున్న పాత్రికేయులు మొత్తం ఎంత మంది ఉన్నారన్న లెక్కింపు మాత్రమే అది. మంగళవారమో లేక బుధవారమో మేము మా పని ప్రారంభించాం. మేము కనుగొన్న వాస్తవాలను సోమవారమే వెల్లడించాలనేది మా నిర్ణయం. మా పని ఎక్కువగా ఆ వారాంతంలో జరిగింది. పాత్రికేయుల సంబంధిత సామాజిక సమాచార సేకరణ ఉత్కృష్ట ప్రమాణాలతో జరిగిందని నేను చెప్పబోవడం లేదు. లోక్‌నీతి, సిఎస్‌డిఎస్ నుంచి మేము ఎలాంటి సహకారం తీసుకోలేదు. అవీ మా పనితో ఎలాంటి ప్రమేయం పెట్టుకోలేదు. జితేంద్ర, అనీల్, నేను మా వ్యక్తిగత స్థాయిలో మాత్రమే ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించాము.

ఆశ్చర్యకరంగా మా పని చాలా సులభంగా జరిగింది. మేము 40 మీడియా సంస్థల (హిందీ, ఇంగ్లీష్ టీవీ ఛానెల్స్, దినపత్రికలు) జాబితాను రూపొందించాము. ఆయా సంస్థలలో పనిచేసే ఒకరిని, ఎడిటర్ సహా నిర్ణయాలు తీసుకునే పది మంది ఉన్నత స్థాయి పాత్రికేయుల జాబితాను సిద్ధం చేయమని కోరాము. ఆ పదిమందిలో ఎవరిని చేర్చాలి, ఎవరిని చేర్చకూడదనే విషయమై చిన్నచిన్న సమస్యలు తలెత్తినా అవేమీ మా పనికి అడ్డురాలేదు. ఆ తరువాత జెండర్, మతం, కులంకు సంబంధించిన వివరాలను సేకరించాము. తమకు సంబంధించిన ఈ సమాచారాన్ని కొంతమంది సంతోషంగా పంచుకున్నారు. అయితే చాలా మంది ఎడిటర్లు అందుబాటులో లేరు; ఉన్నా మేము అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు విముఖత చూపారు. ఇటువంటి సందర్భాలలో మేము సదరు సమాచారం చెప్పగల వ్యక్తుల (ఇన్ఫర్మంట్స్)పై ఆధారపడ్డాం. అలా ఆ ఉన్నత స్థాయి పాత్రికేయుల కుల, కుటుంబ వివరాలను సేకరించాం. మేము తొలుత సిద్ధం చేసుకున్న జాబితాలోని 400 మందిలో 315 మంది పాత్రికేయుల సామాజిక నేపథ్య వివరాలను ఆ వారాంతానికల్లా సేకరించాము.

ఆ వివరాలు మా అనుమానాలను ధ్రువీకరించాయి. ఏ వార్తలను ప్రచురించాలి, ఎడిటోరియల్ విధానమేమిటో నిర్ణయించే ఆ 315 మందిలో 88 శాతం మంది అగ్రకుల హిందువులే. ఈ సామాజిక వర్గాల వారు దేశ జనాభాలో 20 శాతానికి మించి ఉండరు. కేవలం 2 లేదా 3 శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మిణ్‌లు 49శాతం ఉన్నత స్థాయి పాత్రికేయ పదవుల్లో ఉన్నారు. ఈ 315 మందిలో దళిత్, ఆదివాసీ నేపథ్యం కలవారు ఒక్కరు కూడా లేరు. దేశ జనాభాలో 45 శాతంగా ఉన్న ఓబీసీలలో ఉన్నత స్థాయి పాత్రికేయ బాధ్యతల్లో ఉన్నవారు కేవలం 4 శాతం మంది మాత్రమే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు కలసికట్టుగా దేశ జనాభాలో 70 శాతానికి పైగా ఉన్నారు. అయినా మీడియా సంస్థల విధాన నిర్ణేతలలో వారు కేవలం 4 శాతం మంది మాత్రమే. ఆ 315 మందిలో 16 శాతం మంది మహిళలు కాగా ముస్లింలు కేవలం 4 శాతం మంది మాత్రమే.

మేము కనుగొన్న విషయాలను ఒక పత్రికా ప్రకటన రూపంలో వెల్లడించాము. దానిని ప్రచురించేందుకు చాలా పత్రికలు సంకోచించాయి. అయితే ‘ది హిందూ’తో సహా ప్రధాన స్రవంతి పత్రికలు దాన్ని కవర్ చేశాయి. ఆ రోజుల్లో న్యూస్ పోర్టల్స్‌కు పెద్దగా ప్రాచుర్యం లేదు. ప్రత్యామ్నాయ మీడియా సంస్థలు మేము వెల్లడించిన వాస్తవాలను విస్తృతంగా ఉపయోగించుకున్నాయి. ఊహించిన విధంగానే మా సర్వే ‘వివాదాస్పద’మయింది. ఎందుకు వివాదాస్పదమో ఎవరూ చెప్పలేదు పాత్రికేయుల అభిప్రాయాలను వారి సామాజిక నేపథ్యం నిర్ణయిస్తుందని (ఇది మేము ఏ విధంగానూ చెప్పని విషయం) సూచించినందుకు పలువురు మమ్ములను మందలించారు. మేము మా ప్రకటనకు కట్టుబడి ఉన్నాము: ‘‘భారతదేశ ‘జాతీయ’ మీడియాలో సామాజిక వైవిధ్యం కొరవడింది. దేశ సామాజిక స్వరూపాన్ని జాతీయ మీడియా ప్రతిబింబించడం లేదు’’. ‘దైనిక్ హిందుస్థాన్’లో ఎడిటర్ మృణాల్ పాండే (అత్యంత గౌరవనీయ ఎడిటర్లలో ఒకరు. ఆమె వంటి వారు ఇప్పుడు చాలా చాలా అరుదు) మా సర్వే ఫలితాలపై ఒక ఎడిటోరియల్ రాశారు. ఆమె సొంత పత్రికలో వార్తా నివేదన ఎంత పక్షపాతంతో ఉంటుందో ససాక్ష్యంగా పేర్కొంటూ నేను ప్రతివాదన చేశాను. నా ప్రతిస్పందననూ ఆమె ప్రచురించారు. మేము వెల్లడించిన వాస్తవాలను ఎవరూ సవాల్ చేయలేదు. వాటి గురించి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. వాటి విషయమై ఎవరూ ఏమీ చేయలేదు.

సరే, 2022కు వద్దాం. ‘హు టెల్స్ అవర్ స్టోరీస్ మ్యాటర్స్ : రిప్రజెంటేషన్ ఆప్ మార్జినలైజ్డ్ క్యాస్ట్ గ్రూప్స్ ఇన్ ఇండియన్ మీడియా’ అనే నివేదికను ఆక్స్‌ఫామ్ ఇండియా గతవారం విడుదల చేసింది. విస్తృత సర్వే ఆధారంగా ఆ నివేదికను రూపొందించారు. మేము నిర్వహించిన సర్వే కంటే ఆక్స్‌ఫామ్ ఇండియా సర్వే మరింత క్రమబద్ధంగా ఉంది. వార్తాపత్రికలు, టీవీ ఛానెల్స్‌తో పాటు మ్యాగజైన్లు, డిజిటల్ మీడియాను కూడా ఆ సంస్థ కవర్ చేసింది. భవిష్యత్తులో ‘ప్రాంతీయ మీడియా’ను కూడా ఆ సంస్థ తప్పక పరిగణనలోకి తీసుకుంటుందని నేను విశ్వసిస్తున్నాను. ‘నాయకత్వ స్థానం’కు ఆక్స్‌ఫామ్ ఇచ్చిన నిర్వచనం మరింత కచ్చితంగా ఉన్నది. యజమానులతో పాటు ఎడిటోరియల్ విభాగంలో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని కూడా నాయకత్వ స్థానంలోని వారుగా పరిగణించింది టీవీ యాంకర్లు, ప్యానలిస్ట్‌లు, బైలైన్‌తో రాసే జర్నలిస్టుల వివరాలను కూడా విశ్లేషించింది. ఆక్స్‌ఫామ్ ఇండియా సేకరించిన సమాచారం చాలా పారదర్శకంగానూ నిర్దుష్టంగానూ ఉన్నది.

అయితే నా హృదయ నాళాలలో ఏదో మెలిక పడింది. జాతీయ మీడియాలోని పాత్రికేయుల సామాజిక నేపథ్యాల వివరాలలో ఎలాంటి మార్పు గోచరించలేదు. పదిహేను సంవత్సరాల నాటి వాస్తవాలే నేటి వాస్తవాలు. ‘నాయకత్వ స్థానం’లో ఉన్న 218 మందిలో 88.1 శాతం మంది అగ్రకుల హిందువులే. నిజానికి ‘డోన్ట్ నో’ అన్న దాని కింద ఉన్న వివరాలను మినహాయిస్తే నాయకత్వ స్థానంలో ఉన్న అగ్రకుల హిందువులు 90 శాతం మంది అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలకులు సాధించిన దానిని మనం ఎలాంటి లాంఛనప్రాయమైన వివక్ష వ్యవస్థా లేకుండానే సాధించాము.

ప్రతి శ్వేత జాతీయుడు శ్వేత జాతి దురహంకారి కానట్టే, ప్రతి పురుషుడు పురుషహంకారి కానట్టే ప్రతి అగ్రకుల పాత్రికేయుడు అగ్రకుల మనస్తత్వాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు. అయినా కులపరమైన అణచివేత సంబంధిత సంఘటనలకు మన మీడియాలో కవరేజీ దాదాపుగా లేక పోవడమనేది యాదృచ్ఛికమేనా? కుల ఘర్షణల కంటే మతతత్వ అల్లర్లు తొమ్మిది రెట్లు ఎక్కువగా కవరేజీ అవుతుండడం కద్దు. ఏ రోజూ మైనారిటీ మతస్థులకు వ్యతిరేకంగా వార్తా శీర్షికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటాయి. కుల ప్రాతిపదికపై జనాభా గణనకు వ్యతిరేకంగా దాదాపుగా ఏకాభిప్రాయం లేదూ? ఇప్పుడు విదేశీ విశ్వవిద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తోన్న అగ్రకుల విద్యాధికులు పాశ్చాత్య సమాజ సందర్భం నుంచి గ్రహించిన న్యాయ (జస్టిస్) పరిభాషను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఏ చర్చలోనైనా శ్వేతజాతీయేతరుల ప్రస్తావన లేకపోతే వారు తప్పక నిరసిస్తారు. అయితే వారి చైతన్యశీలత పరిమిత స్థాయిలోనే ఉండిపోతోంది. భారతదేశ పరిస్థితుల్లో తమకు సంక్రమించిన ప్రత్యేక హక్కుల గురించిన లోతైన అవగాహనగా వారి చైతన్యం పరిణమించడం లేదు. నా కులమేమిటో నాకు తెలియనే తెలియదు అన్న ప్రతిస్పందనకు మించి వారు విశాల దృక్పథంతో ఆలోచించడం లేదు. భారతీయ మీడియా తనను తాను సరిదిద్దుకుంటదా? లేక ఈ సంకుచిత బంధనాలను ఛేదించే బాహ్య వ్యక్తి కోసం మనం నిరీక్షిస్తున్నామా?

Leave a Reply