ఇక డాక్టరీ చదివినట్టే!

0
216
  • వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరత
  • ఉన్నవాటిలోనే 37 శాతం మంది లేరు
  • ప్రైవేటు కాలేజీల్లోనూ అదే తంతు..
  • కొత్తగా 7 కాలేజీలు మంజూరు చేసిన సర్కారు
  • వాటిలో శాశ్వత పద్ధతిన సిబ్బంది భర్తీకి సిద్ధం
  • నేడో, రేపో సంబంధిత ఉత్తర్వులు జారీ!
  • ప్రైవేటులో వైద్యులకు భారీ డిమాండ్‌
  • అరకొర సర్కారీ జీతాలకు ఎవరొస్తారు..?
  • గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేందుకు విముఖం
  • అక్కడ ప్రాక్టీస్‌ ఉండదు.. బోధనా అంతంతే
  • కాలేజీల ఏర్పాటే కాదు.. బోధనపై దృష్టి పెట్టాలి
  • రాష్ట్రంలో వైద్యవిద్య నాణ్యతపై లేని పర్యవేక్షణ
  • ప్రైౖవేటులో కొవిడ్‌ చికిత్సకు రోజుకు 4 వేలే

హైదరాబాద్‌ : వైద్యులను దేవుళ్లతో సమానంగా చూస్తాం. అలాంటి వైద్యులను తయారు చేసే కళాశాలల్లో బోధనా ప్రమాణాలు అత్యున్నతంగా ఉండాలి. వైద్యవిద్యను బోధించేందుకు నాణ్యమైన అధ్యాపక సిబ్బంది ఉండాలి. అలా ఉన్నప్పుడే ఉత్తమ వైద్యులు అందుబాటులోకి వస్తారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారు. కానీ, రాష్ట్రంలో పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలు అధ్యాపకుల కొరతతో అల్లాడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య కళాశాలల్లో అయితే పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వైద్య కళాశాలలతో పాటు అనుబంధంగా బోధనాస్పత్రులు ఉన్నా.. అక్కడికి వెళ్లేందుకు ప్రొఫెసర్లు ఇష్టపడడం లేదు. కారణం.. ప్రాక్టీస్‌ ఉండదన్న భయమే! ఉదాహరణకు మహబూబ్‌నగర్‌లో వైద్యకళాశాల, బోధనాస్పత్రి ఉన్నా.. అక్కడి ప్రొఫెసర్లకు పెద్దగా ప్రాక్టీస్‌ ఉండదు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారే ఆయా బోధనాస్పత్రులకు వస్తారు. పెద్ద సమస్యలుంటే నగరాలకే వెళతారు.

ఫలితంగా ప్రొఫెసర్లకు, వైద్య విద్యార్థులకు ఉపయోగం ఉండదు. అదే హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ఉభయతారకంగా ఉంటుంది. ప్రొఫెసర్లకు బోధనతో పాటు ప్రాక్టీస్‌ కూడా ఉంటుంది. వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న వైద్య కళాశాలల్లోనే అధ్యాపకుల కొరత ఉండగా.. కొత్తగా 7 కళాశాలలు ప్రారంభిస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ హయాంలో ఇంజనీరింగ్‌ కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కొన్ని కాలేజీలనైతే కేవలం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసమే ఏర్పాటు చేశారు. అలాంటి కాలేజీల్లో నాణ్యమైన బోధనా సిబ్బంది లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. పేరుకు ఇంజనీరింగ్‌ పూర్తి చేసినా, రోడ్డున పడ్డారు. అలాంటి వారు చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకొని బతికేస్తారు. కానీ, వైద్య విద్య అలా కాదు. విద్యార్థులకు సరైన బోధన అందకపోతే సమాజానికి పెను ప్రమాదమే! అరకొర చదువులతో డాక్టర్‌ పట్టా పుచ్చుకొని బయటికొస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైద్య కళాశాలల సంఖ్య పెంచడంతో పాటే ఉన్న కాలేజీల్లో నాణ్యమైన బోధన అందించే ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 30-40 శాతం మంది ప్రొఫెసర్లు లేరు. ప్రైవేటులోనూ అంతకంటే ఎక్కువగానే కొరత ఉంది. కొవిడ్‌ కారణంగా ప్రొఫెసర్లు, పాఠాల గురించి పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రుల్లోనే అధ్యాపకుల్లేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో అధ్యాపకులను నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయుంచింది. సంబంధిత జీవో నేడో, రేపో విడుదల కానున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, వనపర్తి, నాగర్‌కర్నూలు, మంచిర్యాల, మహబూబాబాద్‌లలో ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో 2135 మంది సహాయక సిబ్బంది (సపోర్టింగ్‌ స్టాఫ్‌)ని తాత్కాలిక పద్ధతిలో తీసుకుంటున్నారు. వీరిని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో తీసుకునేందుకు బుఽధవారం ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోవైపు కొత్త వైద్య కళాశాలలతో పాటు 13 నర్సింగ్‌ కాలేజీలను కూడా ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. వీటిలో 900 మంది సపోర్టింగ్‌ స్టాఫ్‌ను తాత్కాలిక పద్ధతిలో నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

30-40 శాతం మంది కొరత..
రాష్ట్రంలో ప్రస్తుతం 9 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. వాటిలో 2866 మంది అధ్యాపకులను రాష్ట్ర ప్రభుత్వం కేడర్‌ స్ట్రెంత్‌ కింద మంజూరు చేసింది. ఈ 9 కాలేజీల్లో 230 మంది ట్యూటర్లు, 1561 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 614 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 461 మంది ప్రొఫెసర్లు ఉండాలి. ప్రస్తుతం అన్ని వైద్య కాలేజీల్లో 1561 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు గాను 983 మందే ఉన్నారు. 578 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అంటే ఆ ఒక్క విభాగంలోనే 37 శాతం ఖాళీలు ఉన్నాయి. ప్రొఫెసర్ల పోస్టులు కూడా 60కి పైగా ఖాళీలున్నట్లు వైద్యవిద్య వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో 30-40 శాతానికిపైగా ఖాళీలున్నట్లు సమాచారం. ఉదాహరణకు నిజామాబాద్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 35 ప్రొఫెసర్లకు గాను కేవలం 14 మందే ఉన్నారు. 21 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ కళాశాలల్లో అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉంది.

నేరుగా నియామకాలు ఒక్కసారే..
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు ఒకే ఒక్కసారి అధ్యాపకుల నియామకాలను చేపట్టారు. నేరుగా నియామకాల్లో కేవలం అసిస్టెంట్‌ ప్రొఫెసర్లనే తీసుకోవాలి. వారు నాలుగేళ్ల పాటు పనిచేసి, పరిశోధనా పత్రాలు సమర్పిస్తే అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి లభిస్తుంది. అసోసియేట్లుగా మూడేళ్లపాటు పనిచేసి పరిశోధనా పత్రాలు సమర్పిస్తే ప్రొఫెసర్‌గా పదోన్నతి ఇస్తారు. కాగా 2017లో 237 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో 200 మందే ఎంపికయ్యారు. కొన్ని పోస్టులకు సాంకేతికపరమైన కారణాల వల్ల అభ్యర్థులే దొరకలేదు. ఆ తర్వాత మళ్లీ డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ చేపట్టలేదు. ఆఖరికి సూర్యాపేట, నల్లగొండల్లోని కొత్త కళాశాలలకూ నేరుగా నియామకాలు చేపట్టలేదు.

ఈ జీతాలకు ఎవరొస్తారు?
ప్రస్తుతం వైద్యులకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ప్రభుత్వమిచ్చే జీతాల కంటే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఇచ్చే వేతనాలు భారీగా ఉంటున్నాయి. ప్రత్యేక ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేయడం కంటే బయట ప్రాక్టీస్‌ చేసుకుంటే భారీగా సంపాదించవచ్చన్న ఉద్దేశంతో వైద్యులు ఉంటున్నారు. అందుకే చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత నెలకొంది. ప్రొఫెసర్లకు వేతనాలతో పాటు ప్రత్యేక ప్యాకేజీలు లేదా ప్రోత్సాహకాలు వంటివి ఇస్తేనే వారు ఎక్కువకాలం బోధన వృత్తిలో కొనసాగుతారు. లేకుంటే ఏ కార్పొరేట్‌ ఆస్పత్రినో చూసుకుంటారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధ్యాపకులు కోరుతున్నారు. అలాగే నియామకాలన్నింటినీ శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సూచిస్తున్నారు.

కొత్త కాలేజీల్లో ఎంతమంది ఉండాలంటే?
కొత్తగా ఒక వైద్యవిద్య కళాశాలను ప్రారంభించాలంటే సీట్ల ఆధారంగా ఎంతమంది అధ్యాపకులుండాలనే దానిపై ఇప్పటికే జాతీయ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. 100 ఎంబీబీఎస్‌ సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే కనీసం 90 మంది అధ్యాపకులు ఉండాలి. 150 సీట్లు అయితే 116 మంది, 200 సీట్లుంటే 142 మంది, 250 సీట్లుంటే 159 మంది ఫ్రొఫెసర్లు ఉండాలి. తెలంగాణ సర్కారు మంజూరు చేసిన 7 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కో దాంట్లో 150 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండేలా ఇప్పటికే డీపీఆర్‌ సిద్ధం చేశారు. అంటే ఒక్కో కాలేజీకి ఎన్‌ఎంసీ నిబంధనల మేరకు 116 మంది అధ్యాపకులు అవసరం. అందులో 21 మంది ప్రొఫెసర్లు, 38 మంది అసోసియేట్లు, 57 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉండాలి. వీరికి అదనంగా 32 మంది ట్యూటర్లు, మరో 35 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు అవసరమని ఎన్‌ఎంసీ నిబంధనలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఏడు మెడికల్‌ కాలేజీలకు మొత్తం 1281 మంది అధ్యాపక సిబ్బంది కావాలి.

అయితే ఒక్కసారి ఒక కాలేజీలో మానవ వనరుల నియామకాలకు సంబంధించి ‘ఇంత మంది’ని మంజూరు చేస్తున్నట్లు సర్కారు జీవో ఇచ్చిందంటే.. ఆ తర్వాత అక్కడ మళ్లీ సిబ్బంది సంఖ్య పెంచుకోవడం కష్టమని వైద్య శాఖ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. అందుకే కాలేజీ ప్రారంభమయ్యే సమయంలోనే ఎక్కువ మంది అవసరమయ్యేలా జీవో జారీ చేసుకోవాలి. ఉదాహరణకు సిద్దిపేట కళాశాలకు 2017లో జీవో నంబరు 80 ద్వారా 135 అధ్యాపక పోస్టులను మంజూరు చేశారు. అదే సూర్యాపేట, నల్లగొండ కాలేజీలకు 228 మంది చొప్పున అధ్యాపక పోస్టులను సర్కారు మంజూరు చేసింది. వాస్తవానికి ఎన్‌ఎంసీ సూచించిన దానికంటే ఎక్కువ పోస్టులనే మంజూరు చేశారు. దానికీ కారణం లేకపోలేదు. ఒక కాలేజీ ప్రారంభమైన నాలుగో ఏడాది నుంచి తగినంతమంది అధ్యాపకులుంటే ఎన్‌ఎంసీ పీజీ సీట్లను మంజూరు చేస్తుంది. కొత్త కాలేజీలకు కూడా ఇదే పద్ధతిలో మానవ వనరుల నియామకం చేపట్టాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీలకు కాంట్రాక్టు పద్ధతిలో అధ్యాపకులు కావాలని ప్రభుత్వం ప్రకటనలిస్తున్నా పెద్దగా స్పందన లేదు. రెగ్యులర్‌ వారికంటే కాంట్రాక్టు పద్ధతిలో వచ్చేవారికి జీతాలు ఎక్కువగా ఇస్తామన్నా అక్కడ చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. కొన్ని ప్రభుత్వ కళాశాలలు కూడా ఎన్‌ఎంసీ తనిఖీల సమయంలో వేరే కాలేజీల సిబ్బందిని తెచ్చి మేనేజ్‌ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ..
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ తీవ్రమైన అఽధ్యాపకుల కొరత నెలకొంది. కొన్ని కాలేజీలు సరిగా వేతనాలివ్వడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. శాశ్వత ప్రాతిపదికన కేవలం 40 శాతం అధ్యాపకులనే నియమించుకుంటున్నట్లు సమాచారం. మిగిలిన వారందర్నీ ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు బయట నుంచి తీసుకొచ్చి చూపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని మెడికల్‌ కాలేజీల్లో సీటు ఇస్తామన్నా విద్యార్థులు చేరడానికి ఇష్టపడడం లేదని ఓ ప్రొఫెసర్‌ చెప్పారు. పేరున్న మెడికల్‌ కాలేజీలు మాత్రం ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ప్రైవేటు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ఇచ్చే వేతనాలతో పోలిస్తే బయట ప్రాక్టీసు చేసుకుంటే వచ్చే ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇటువైపు వచ్చేందుకు వైద్యులు మొగ్గు చూపడం లేదు. బోధనపై ఆసక్తి ఉన్నవారు మాత్రమే వైద్యవిద్య అధ్యాపక వృత్తి వైపు వస్తున్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఈ విభాగాల్లో చాలా కష్టం..
వైద్యవిద్య కళాశాలల్లో మొత్తం 22 విభాగాలుంటాయి. వాటిలో క్లినికల్‌, నాన్‌ క్లినికల్‌ ఉంటాయి. నాన్‌ క్లినికల్‌కు సంబంధించి అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్‌ విభాగాల్లో అధ్యాపకులు దొరకడం చాలా కష్టమని ప్రొఫెసర్లు చెబుతున్నారు. అలాగే క్లినికల్‌లో రేడియాలజీ, డెర్మటాలజీ, అధ్యాపకుల లభ్యత తక్కువగా ఉంటుందని అంటున్నారు.

అధ్యాపకులు దొరకడం కష్టమే..  
వైద్యవిద్య ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్‌ కాలేజీలకు అధ్యాపకులు దొరకడం కష్టంగా మారుతుంది. కొత్త కాలేజీల్లో అధ్యాపకులను రెండు రకాలుగా భర్తీ చేసుకోవాలి. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లను నేరుగా నియమించాలి. ఉన్న అసోసియేట్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలి. అప్పుడే కొత్త కాలేజీలకు అధ్యాపకులు దొరుకుతారు. సకాలంలో పదోన్నతులివ్వాలి.
– డాక్టర్‌ బొంగు రమేశ్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ఉస్మానియా వైద్య కళాశాల 

ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నాం   
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ అధ్యాపకుల కొరత ఉంది. మేం తీసుకున్నా.. ప్రొఫెసర్లు ఎక్కువ కాలం పనిచేయడం లేదు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి అధ్యాపకులను తీసుకుంటున్నాం. వారు కూడా రైలు, విమాన ప్రయాణ సౌకర్యం ఉంటేనే వస్తున్నారు. వారాంతాల్లో వారి రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక జిల్లాల్లోని మెడికల్‌ కాలేజీలకు కొందరు అధ్యాపకులు హైదరాబాద్‌ నుంచి వెళ్లి వస్తున్నారు. వారానికి మూడు, నాలుగు క్లాసులు తీసుకుంటారు. ఇక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో రిటైరైన వారిని గత ఏడాది వరకు తీసుకున్నాం. ఇప్పుడు వయోపరిమితి పెంచడంతో వారు కూడా రావడం లేదు.
– ఓ ప్రైవేటు కాలేజీ యజమాని

ప్రొఫెసర్లుండేది పేపర్‌పైనే..   
ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ప్రొఫెసర్లంతా కేవలం కాగితాలపైనే ఉంటున్నారు. ఎన్‌ఎంసీ తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే వారు కనిపిస్తారు. దీంతో వైద్యవిద్య నాణ్యతపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణ లేదు. ఆరోగ్య వర్సిటీ కూడా పట్టించుకోవడం లేదు.
– ఓ ఎంబీబీఎస్‌ విద్యార్థి

Courtesy Andhrajyothi

Leave a Reply