వైద్యానికి ప్రజల జేబులు గుల్ల!

0
565

ప్రభుత్వం వెచ్చిస్తున్నది 27 శాతమే..
ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత
పార్లమెంటరీ స్థాయీసంఘం నివేదిక
ఐఏఎస్‌ మాదిరిగా.. వైద్య సర్వీసు అవసరమని సూచన
వైద్య రంగానికి నిధుల పెంపు, పేదలకు సబ్సిడీ ధరల్లో కొవిడ్‌ టీకా సరఫరాకు సిఫార్సు

దిల్లీ: కొవిడ్‌ మహమ్మారి భారత ఆరోగ్య వ్యవస్థలోని లోపాలన్నింటినీ బయటపెట్టిందని పార్లమెంటరీ స్థాయీసంఘం పేర్కొంది. ప్రజావైద్యం కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఏమాత్రం సరిపోవడం లేదని ఆక్షేపించింది. 2020-21లో వైద్య, ఆరోగ్యశాఖ బడ్జెట్‌ను బట్టి చూస్తే వైద్యం కోసం చేస్తున్న మొత్తం వ్యయంలో ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది కేవలం 27.1% మాత్రమే. కాగా ప్రజలు తమ జేబుల్లోంచి 62.4% ఖర్చు చేయాల్సి వస్తోందని, దీనివల్ల మరింతమంది దారిద్య్రరేఖకు దిగువకు జారిపోతున్నారని పేర్కొంది. ఈమేరకు సమాజ్‌వాదీ పార్టీ నేత రాంగోపాల్‌ యాదవ్‌ నేతృత్వంలోని వైద్య, ఆరోగ్య శాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడికి నివేదికను అందజేసింది.

కొవిడ్‌ నేపథ్యంలో దేశ వైద్య ఆరోగ్య రంగంలో కనిపించిన బలాలు, బలహీనతలను విశ్లేషించి పలు సిఫార్సులు చేసింది. కొవిడ్‌ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు, వెంటిలేటర్ల కొరత కొట్టొచ్చినట్లు కనిపించిందని, అది చివరకు మహమ్మారి నియంత్రణ చర్యలను సంక్లిష్టంగా మార్చేసిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని మెరుగు పరచడానికి పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. మన వైద్యఆరోగ్య వ్యవస్థను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడానికి ఇదే సరైన సమయంగా పేర్కొంది. పేదలకు కొవిడ్‌ టీకాలను సబ్సిడీ ధరల్లో అందించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో సమర్థమైన మానవ వనరులను పెంచుకోవాలంటే ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌(ఏఐఎస్‌) తరహాలో ఇండియన్‌ హెల్త్‌ సర్వీస్‌(ఐహెచ్‌ఎస్‌)ను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

మౌలిక వసతులకు నిధులేవీ!
‘‘దాదాపు 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రజారోగ్య రంగంపై వచ్చే రెండేళ్లలోనే జీడీపీలో 2.5% నిధులు కేటాయించాలి. జాతీయ వైద్య ఆరోగ్య విధానంలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు 2025 వరకు వేచిచూడటం ఏమాత్రం మంచిది కాదు. అలా చేస్తే ప్రజారోగ్య రంగం ప్రమాదంలో చిక్కుకుంటుంది. 2021-26 మధ్యకాలంలో రూ. 6,16,189 కోట్లు ఖర్చుపెట్టాలని మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. 2017 జాతీయ వైద్య విధానం ప్రకారం అందరికీ వైద్యసేవలను అందించాలంటే ఈ నిధులను భారీగా పెంచాల్సి ఉంది’’ అని స్థాయీసంఘం స్పష్టం చేసింది.

వైద్య సిబ్బంది కొరత తీవ్రం..
‘‘ప్రజలు తమ జేబుల్లోంచి అత్యధిక మొత్తాన్ని వ్యయం చేసే 186 దేశాల్లో భారత్‌ 15వ ర్యాంకులో ఉంది. కరోనా వైద్య సేవలు అందించడంలో అనిశ్చితి నెలకొంది. దేశంలో పెరిగిపోయిన కొవిడ్‌ బాధితులతో పాటు, ఇతర వ్యాధుల బారిన పడినవారికి వైద్యసేవలు అందించే స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు లేవు. మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు కొరవడిన విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ప్రైవేటురంగంతో కలిసి పీపీపీ విధానంలో పనిచేసేందుకు ప్రణాళికలు రూపొందించి ఉండాల్సింది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీలు పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని చాలా ఆసుపత్రులు, వైద్య కళాశాలలు మంజూరు చేసిన సిబ్బంది సంఖ్య కంటే తక్కువతో పనిచేస్తున్నాయి. బోధన సిబ్బంది లేకపోవడంవల్ల చాలా స్పెషాలిటీ విభాగాలు పనిచేయలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల వైద్య ఆరోగ్య రంగంలోని అన్ని ఖాళీలను తక్షణం భర్తీచేయడానికి చర్యలు తీసుకోవాలి.’’ అని స్థాయీసంఘం పేర్కొంది.

కీలక సిఫార్సులివే..
వైద్య పరిశోధనలపై భారత్‌ చేసే ఖర్చు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉంది. ఇందుకోసం జీడీపీలో అమెరికా 2.84%, చైనా 2.19% ఖర్చు చేస్తుంటే భారత్‌ కేవలం 0.68% మాత్రమే వెచ్చిస్తోంది. ఈమేరకు వచ్చే రెండేళ్లలో చేసే ఖర్చును కనీసం ప్రపంచ సగటుకు సమానంగా 1.72%కి పెంచాలి.
 పరిశోధనలను విస్తృతం చేయడానికి ఐసీఎంఆర్‌కి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి.
 గ్లోబల్‌ హెల్త్‌ సెక్యూరిటీ అజెండా ప్రకారం ప్రతి 2 లక్షల మంది జనాభాకు ఒక సుశిక్షితుడైన అంటువ్యాధుల నిపుణుడు ఉండేలా చూడాలి.
 ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రిని ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’గా తీర్చిదిద్దాలి. టెలీ కన్సల్టేషన్‌కు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేయాలి.
 దేశంలో వైద్య పరికరాల తయారీ సామర్థ్యాన్ని మరింత పెంచాలి.
 ఏప్రిల్‌ 1 నాటికి 151 మేర ఉన్న కొవిడ్‌ పరీక్ష కేంద్రాలను నవంబరు 10 నాటికి 2082కి పెంచడం ప్రశంసనీయం. అయితే ఇవన్నీ జిల్లా కేంద్రాలు, పెద్ద నగరాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు లేకపోవడం వల్ల అక్కడ కేసులను తక్కువచేసి చూపుతున్నారు. ప్రాథమిక, సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పెద్దగా పరీక్ష వసతులు గానీ, అందుకు అనువైన సిబ్బంది గానీ లేరు. అందువల్ల పెరిగిపోతున్న కొవిడ్‌ కేసుల నియంత్రణకు కేంద్రప్రభుత్వం వైరల్‌ రీసెర్చి డయోగ్నస్టిక్‌ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలి.
 కొవిడ్‌ను నియంత్రించడానికి 5టీ (ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌, టెక్నాలజీ) సూత్రం చాలా ప్రధానం. ఈ అంశంలో మంచి ఫలితాలు సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మరింత పెరగాల్సి ఉంది. 5టీ సూత్రాన్ని రాత్రికి రాత్రి అమలు చేయడం సాధ్యంకాదు. అందుకోసం తగిన ఆర్థిక, మానవ వనరులను సమకూర్చాలి.
కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నందున పోస్ట్‌ కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌ మోడల్‌/ప్రొటోకాల్‌, ప్లాన్‌ను మరింత మెరుగుపరచాలి.

పేదలకు సబ్సిడీ ధరలో వ్యాక్సిన్‌..
పేద ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సబ్సిడీ ధరల్లో అందించాలని పార్లమెంటరీ స్థాయీసంఘం సిఫార్సు చేసింది. ‘‘ప్రస్తుత మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్‌ను వేగవంతంగా అభివృద్ధి చేయాలన్న ప్రపంచ శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని అర్థం చేసుకోగలం. అయినప్పటికీ నైతికపరంగా, అనుమతుల విషయంలో, పరిశోధన అధ్యయనాల్లో అత్యున్నత ప్రమాణాలను పాటించాల్సిందే. అన్ని దశల ప్రయోగాలూ కఠినమైన నియంత్రణ పరీక్షలను అధిగమించాల్సిందే. ఈ ప్రయోగాల ఫలితాలన్నింటినీ ప్రజాబాహుళ్యంలో ఉంచాలి. వైద్య, ఆరోగ్యశాఖ పారదర్శక విధానాన్ని అనుసరిస్తే వ్యాక్సిన్‌ అనుమతులు, ఉత్పత్తిలో అవకతవకలను నివారించడానికి వీలవుతుంది. ప్రభుత్వం వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే సంస్థలతో మాట్లాడి సరసమైన ధరలకే ప్రజలకు అందించేందుకు ప్రయత్నించాలి. వ్యాక్సిన్ల బ్లాక్‌ మార్కెటింగ్‌, కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూత్రాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాలి. తాత్కాలికంగా స్మార్ట్‌ వ్యాక్సినేషన్‌ విధానాన్ని అనుసరించినా అనంతర కాలంలో మొత్తం జనాభాకు టీకాలు అందించాలి. దేశవ్యాప్తంగా కోల్డ్‌ చైన్‌ నిల్వ వ్యవస్థను విస్తరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యాక్సిన్‌ అందించడానికి వీలవుతుంది’’ అని స్థాయీసంఘం పేర్కొంది.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి సూచనలు..
ఆహార భద్రత విషయంలో అవినీతి, అనైతిక కార్యకలపాలను తీవ్రంగా పరిగణించి, చర్యలు చేపట్టేలా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేయాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)కు పార్లమెంటరీ స్థాయీసంఘం సూచించింది. ఆహార పదార్థాల కల్తీ కేసులు పెరుగుతుండటంతో ఈ విషయమై కఠిన చర్యలు అవసరమని పేర్కొంది.

Courtesy Eenadu

Leave a Reply