రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు

0
106
  • మతిస్థిమితం కోల్పోయిన మహిళ మరణించినట్లు ధ్రువీకరణ పత్రం
  • సృష్టించిన భర్త, కుమారుడు
  • ఆమె పేరుతో ఉన్న రూ.15 కోట్ల ఆస్తుల బదిలీ
  • హనుమకొండలో వెలుగుచూసిన అమానవీయ ఉదంతం

వరంగల్‌ క్రైం: బంధాలు..అనుబంధాలు మాయమైపోతున్నాయ్‌. డబ్బు, అస్తిపాస్తుల ముందు విలువలన్నీ మంటగలిసిపోతున్నాయ్‌. మతిస్థిమితం తప్పిన మహిళను భర్త, కుమారుడు కలిసి రైలెక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకుని కోట్ల రూపాయల ఆస్తిని తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. చెన్నై చేరిన ఆమెను ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసింది. వారు పంపిన ఫొటోను పోలీసులు చూపెడితే తన తల్లే కాదు పొమ్మన్నాడా పుత్రరత్నం. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఉదంతం హనుమకొండలో వెలుగుచూసింది.

విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం… హనుమకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన మహిళ (46)కు భర్త, కుమారుడు ఉన్నాడు. కుమారుడు బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. పెళ్లి సమయంలో ఆమె తండ్రి కట్నకానుకల కింద ఇచ్చిన ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం సుమారు రూ.15 కోట్లు ఉంటుంది. భర్త మరో మహిళను వివాహం చేసుకుని, ఆమెను వదిలించుకునేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఆస్తిని తన పేరిట బదిలీ చేయాలని ఆమెను వేధించసాగాడు. తనకూ ఆస్తిలో కొంత భాగం వస్తుందని కుమారుడు సైతం వంతపాడాడు. అయినా ఆమె అందుకు అంగీకరించలేదు.

ఆస్తి కోసం భర్త, కుమారుడి వేధింపులతో కొన్నాళ్లకు ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఆమె చనిపోతేనే ఆస్తిని తమ పేరు మీద చేయించుకోవచ్చని వారు పన్నాగం వేశారు. 2017లో ఓ రోజు ఇద్దరూ దగ్గరుండి ఆమెను రైలెక్కించి పంపించారు. ఆమె ఎక్కడో తప్పిపోయిందని బంధువులను నమ్మించారు. భర్త మరో మహిళతో విదేశాలకు వెళ్లిపోయాడు. కొంతకాలానికి బంధువులు సైతం ఈ విషయాన్ని మర్చిపోయారు. సదరు మహిళ తల్లి వృద్ధురాలు కావడం, స్థానికంగా లేకపోవడంతో ఆమె సైతం కుమార్తె గురించి ఎన్నడూ వాకబు చేయలేదని స్థానికులు పేర్కొన్నారు.

చేరదీసిన స్వచ్ఛంద సంస్థ
అలా రైలెక్కిన ఆమె కొద్దిరోజుల తర్వాత చెన్నైకి చేరుకోగా అక్కడి రైల్వే పోలీసుల సాయంతో స్వచ్ఛంద సంస్థ అన్బగం రిహాబిలిటేషన్‌ సెంటర్‌ ఆమెను చేరదీసింది. మానసికంగా కుంగిపోయిన ఆమె పాత జ్ఞాపకాలు మరచిపోయింది. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఆమెకు ఆశ్రయం కల్పించి, వైద్యం చేయించి ఆమెలో మార్పు తీసుకొచ్చేందుకు యత్నించారు. అయినా ఆమె గతాన్ని గుర్తు తెచ్చుకోలేకపోయింది.

ఆధార్‌తో వెలుగులోకి..
స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమెకు ఆధార్‌ కార్డు తీయాలని చెన్నైలోని కేంద్రానికి తీసుకెళ్లారు. వేలిముద్రలు తీస్తుండగా అప్పటికే ఆమెకు కార్డు ఉన్నట్లు సాఫ్ట్‌వేర్‌ గుర్తించింది. వెంటనే కార్డు తీసుకుని వివరాలు సేకరించగా హనుమకొండ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. చిరునామాలో సంప్రదించేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు అందుబాటులోకి రాకపోవడంతో వారు హనుమకొండ పోలీసులను ఆశ్రయించారు. వారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పంపించిన ఫొటోతో మహిళ కుమారుడి వద్దకు వెళ్లారు. ఆమె ఫొటో చూపిస్తూ.. మీ తల్లి అవునా..? కాదా..? అని ప్రశ్నించారు. ముందుగా కాదు అని చెప్పాడు. తరువాత తమ తల్లి ఎప్పుడో చనిపోయిందంటూ..మరణ ధ్రువపత్రం తమ వద్ద ఉందని బుకాయించాడు. లోతుగా విచారిస్తే వారి కుట్ర బయటపడింది.

కోట్ల రూపాయల ఆస్తుల బదిలీ..
తప్పిపోయి అయిదేళ్లు పూర్తవడంతో భర్త, కుమారుడు కలిసి ఆమె మృతి చెందినట్లు చెప్పి వరంగల్‌ నగర పాలక సంస్థ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకున్నారు. వెంటనే ఆమె పేరిట ఉన్న సుమారు రూ.15 కోట్ల ఆస్తులను తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. ఆస్తుల కోసం తల్లి చనిపోయినట్లు ధ్రువపత్రాలు సృష్టించారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరణ ధ్రువపత్రం ఎలా జారీ అయ్యిందనే కోణంలో విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం సదరు మహిళ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల వద్ద ఉంది. కుటుంబసభ్యులు అనుమతి ఇస్తే ఆమెను తీసుకొచ్చే వీలుంది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సీఎం, గవర్నర్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్‌లకు లేఖలు పంపించారు.

Leave a Reply