మతిలేని యువతిపై అమానవీయకాండ

0
325

రాజధానిలో మరో దుష్కృత్యం
నిందితుల్లో ఇద్దరు ఆటోడ్రైవర్లు, ఒక బ్యాండ్‌మ్యాన్‌

హైదరాబాద్‌; న్యూస్‌టుడే, జియాగూడ: హైదరాబాద్‌లో మరో అమానవీయకాండ వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ‘దిశ’ దారుణ ఉదంతానికి సరిగ్గా ఒకరోజు ముందు (నవంబరు 26) పాతబస్తీలోని ఒక మానసిక వికలాంగురాలిపై ముగ్గురు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు ఆటోడ్రైవర్లు కాగా మరో వ్యక్తి బ్యాండ్‌మ్యాన్‌. మతిలేని యువతి కావడంతో ఆమె సరిగా వివరాలు చెప్పలేకపోవడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల సహకారంతో ఆధారాలు సేకరించిన కుల్సుంపురా పోలీసులు మానవ మృగాలైన ఖలీమ్‌, అజీజ్‌, నజీర్‌లను అరెస్ట్‌ చేశారు.

ఒంటరిగా కనిపించడంతో..
కుల్సుంపురా పరిధిలో పందొమ్మిదేళ్ల యువతి తన తల్లి, సోదరులతో కలిసి ఉంటోంది. ఆమెకు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తరచూ ఇంటినుంచి బయటకు వెళ్లిపోతుండేది. సోదరులు వెతికి తీసుకొస్తుండేవారు. గత నెల 26న సాయంత్రం పురానాపూల్‌ చౌరస్తా సమీపంలో ఆమె నిలబడి ఉండగా ఖలీమ్‌ (28), అతడి బంధువైన అబ్దుల్‌ అజీజ్‌ (38) అనే ఆటో డ్రైవర్లు ఆమెపై కన్నేశారు. ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి ఆటోలో ఎక్కించుకుని మూసీనది ఒడ్డుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 8.30 గంటలకు ఆమెను జుమ్మెరాత్‌బజార్‌ చౌరస్తాలో దింపి, అక్కడ ఉన్న నజీర్‌ (46) అనే బ్యాండ్‌మ్యాన్‌కు అప్పగించి ఆమె చిరునామా కనుక్కుని ఇంటికి చేర్చమని చెప్పి వెళ్లిపోయారు. ఆమెను చూడగానే నజీర్‌కు కూడా దుర్బుద్ధి పుట్టింది. అతడు కూడా మూసీ ఒడ్డుకే తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఆమెను తీసుకొచ్చి పురానాపూల్‌ చౌరస్తాలో వదిలేసి వెళ్లిపోయాడు. తమ సోదరి కనిపించడం లేదంటూ అప్పటికే ఆమె సోదరులు కుల్సుంపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గాలిస్తుండగా పురానాపూల్‌ వద్ద ఆమె కనిపించడంతో ఇంటికి తీసుకెళ్లారు. తనపై ఎవరో ఏదో చేశారంటూ సైగలతో వివరించింది. ఏం జరిగిందో బాధితురాలు స్పష్టంగా చెప్పలేకపోవడంతో కుల్సుంపురా పోలీసులు మరుసటిరోజు ఆమెను భరోసా కేంద్రానికి తీసుకెళ్లారు. మానసిక నిపుణులు, వైద్యులతో సుమారు ఐదు గంటలపాటు మాట్లాడించి చికిత్స అందించారు. కోలుకున్న బాధితురాలు ఆరోజు జరిగిందేమిటో చూచాయగా వైద్యులు, మానసిక నిపుణులకు వివరించడంతో పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కానీ వారికి ఒక్క ఆధారం కూడా లభించలేదు. దీంతో శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలపై దృష్టి కేంద్రీకరించారు.

బార్‌ వద్ద సీసీ కెమెరాల్లో..
బాధితురాలు చివరగా కనిపించిన బార్‌ నుంచి పరిశోధన ప్రారంభించారు. బ్యాండ్‌మ్యాన్‌ నజీర్‌ ఆమెను అక్కడ వదిలేసినట్టు గుర్తించారు. స్థానికులకు అతడి పోలికలను చెప్పి విచారించగా ఆచూకీ దొరికింది. అతడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. మళ్లీ సీసీ కెమెరాలను పరిశీలించగా బాధితురాలిని ఆటోలో తీసుకువెళ్తున్న ఖలీమ్‌, అబ్దుల్‌ అజీజ్‌లు ఫుటేజీల్లో దొరికారు. ఆటో నంబరు ఆధారంగా పరిశోధించి యజమానిని విచారించగా, తాను అద్దెకు ఇస్తుంటానని వివరించడంతో నిందితుల ఫొటోలను స్థానికులకు చూపించారు. ఆదివారం రాత్రి వారి వివరాలన్నీ తెలియడంతో సోమవారం అరెస్టు చేశారు.

Courtesy Eenadu…

Leave a Reply