
(వ్యాసకర్త ఎ.పి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా… అంగన్‌వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం ఆపాలి. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలి. అంగన్‌వాడీ సెంటర్లకు మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలి. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలి. కరోనా కాలంలో చనిపోయిన అంగన్‌వాడీలందరికీ బీమా వర్తింపచేయాలి. సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి.
కేంద్రప్రభుత్వం నిర్దేశించిన జాతీయ నూతన విద్యా విధానం-2020 ను దేశంలోకెల్లా మొట్టమొదట మన రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పిల్లలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంచటానికని (అబద్ధాలు చెపుతూ) విద్యారంగంలో భారీ మార్పులు చేస్తూ మే 30న 172 సర్క్యులర్‌ను తీసుకు వచ్చారు. తద్వారా ప్రస్తుతం అమలు జరుగుతున్న 10+2 విధానాన్ని 5+3+3+4గా మార్చబోతున్నారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు కూడా శిశువులకు విద్యాబోధన చేసే వై.ఎస్.ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మారబోతున్నాయి. కొన్ని అంగన్‌వాడీ సెంటర్లు ప్రాథమిక పాఠశాలలో విలీనం కాబోతున్నాయి. దీనివలన పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధం. అందుకే విద్యార్థులకు, చిన్నపిల్లలకు, లబ్ధిదారులకు, అంగన్‌వాడీలకు, ఉపాధ్యాయులకు, ప్రజలకు నష్టదాయకమైన 172 సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలి.
రాబోయే విద్యా సంవత్సరం నుండి అంగన్‌వాడీ సెంటర్లలో పెడుతున్న పిపి 1, పిపి 2, ప్రిపరేటరీ, ప్రాథమిక పాఠశాలల్లోని 1, 2 తరగతులు కలిపి ఫౌండేషన్ తరగతులుగా మార్పు చేస్తున్నారు. 3 నుండి 12వ తరగతి వరకు హైస్కూల్‌గా మార్పు చేయాలని నిర్ణయించారు. ఫౌండేషన్ స్కూల్‌కు సంబంధించి అంగన్‌వాడీ సెంటర్లలోని పిల్లలకు పిపి 1, పిపి 2 అంగన్‌వాడీలు బోధించాలని, ప్రాథమిక పాఠశాలలోని 1,2 తరగతులు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జిటి) బోధించాలని నిర్ణయించారు. ప్రిపరేటరీ ఎవరు బోధించాలనేది స్పష్టత లేదు. ఫౌండేషన్ స్కూళ్ల నిర్వహణ ప్రస్తుతానికి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే అన్నప్పటికీ రాబోయే కాలంలో సొసైటీలకు అప్పగించరనే గ్యారంటీ లేదు. ప్రీస్కూల్ విద్యలో కూడా ప్రైవేటీకరణను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు.
ఐసిడిఎస్ లక్ష్యం
అంగన్‌వాడీ సెంటర్లను ప్రారంభించింది కేవలం ప్రీస్కూల్ కోసం మాత్రం కాదు. సమాజంలో మాతా శిశు మరణాలను తగ్గించటానికి, పిల్లలను బడికి పంపించటానికి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించటానికి 1975లో ఐసిడిఎస్‌ను ప్రారంభించారు. దీనివల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయని అనేక సంస్థలు తెలియజేశాయి. అంగన్‌వాడీ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరింపచెయ్యాలని 2001 లోనే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి అనుగుణంగానే అంగన్‌వాడీ సెంటర్లలో గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు, కిషోర బాలికలకు అనుబంధ ఆహారం, ఆరోగ్యం, ఇమ్యూనైజేషన్ వంటివి అందిస్తున్నారు. 3-6 పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి చదవటం, రాయటం, ఆటపాటలు, వర్క్ బుక్స్ ద్వారా విద్యాభ్యాసం జరుగుతుంది. 5 సంవత్సరాల లోపు పిల్లల మెదడుపై ఎటువంటి ఒత్తిడి లేకుండానే బాషాభివృద్ధికి, పిల్లలను బడికి అలవాటు చేయటానికి అంగన్‌వాడీ సెంటర్లు ఉపయోగపడుతున్నాయి. దేశంలోనే ఎక్కువ అక్షరాస్యత వున్న కేరళలో కూడా అంగన్‌వాడీ సెంటర్లు నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్‌లో విద్యాబోధన వలన పిల్లల్లో ఒత్తిడి, భయం, ఆందోళన పెరిగి చివరకు చదువు మీద వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది.
అంగన్‌వాడీ సెంటర్లను బలోపేతం చెయ్యాలి
రాష్ట్రంలో 48,700 మెయిన్ అంగన్‌వాడీ సెంటర్లు, 6006 మినీ అంగన్‌వాడీ సెంటర్లు దాదాపు 32 లక్షల లబ్ధిదారులకు అనేక సేవలు అందిస్తున్నాయి. ఇందుకోసం లక్ష మంది అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ హెల్పర్లు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 34 వేల అంగన్‌వాడీ సెంటర్లు అద్దె ఇళ్ళల్లో నడుస్తున్నాయి. గ్రామాలలో రూ.1000, మున్సిపాలిటీలలో రూ.4000 ఇస్తామని నిర్ణయించిన కొలతల పేరిట కొన్ని అంగన్‌వాడీ సెంటర్లకు నేటికి నెలకు రూ.200 మాత్రమే చెల్లిస్తున్నారు. కనీసం నెలనెలా సెంటర్ అద్దెలు చెల్లించనందువలన వర్కర్లే పెట్టుబడులు పెడుతున్నారు. దాదాపు 60 శాతం అంగన్‌వాడీ సెంటర్లలో ఎటువంటి వసతులు లేవు. మంచినీరు, మరగుదొడ్లు, ఆటస్థలం, ప్రహరీలు, చివరికి కరెంట్ కూడా లేని సెంటర్లు అనేకం.
ఐసిడిఎస్‌ను వదిలించుకునే ప్రయత్నాలు ఆపాలి
బిజెపి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన దగ్గర (2014) నుంచి ఐసిడిఎస్ సేవలను ప్రజలకు దూరం చెయ్యటానికి ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలకు అప్పగించటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి రాష్ట్రాలకు ఇస్తున్న ఐసిడిఎస్ నిధులను తగ్గించింది. వేదాంతకు 4 వేల సెంటర్లను అప్పగించింది. ఆధార్ లింక్ చేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించింది. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చి రాష్ట్రాల మీద బలవంతంగా అమలుచేయాలని చూస్త్తున్నారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచుతానన్న హామీ నేటికీ నెరవేరలేదు. కరోనా కాలంలో పనిచేస్తున్న అంగన్‌వాడీలకు బీమా వర్తింపచేయటంలేదు.
రాష్ట్రంలో అంగన్‌వాడీల పరిస్థితులు
ప్రభుత్వం మారితే వారి కష్టాలు తీరతాయని ఆశించారు. కాని అంగన్‌వాడీల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లు అయింది. రాబోయే కాలంలో అంగన్‌వాడీ సెంటర్లే కనుమరుగయ్యే విధంగా నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. అంగన్‌వాడీలు గతంలో పోరాడి సాధించుకున్న ఇళ్ళ స్థలాలు, హెల్పర్ల ప్రమోషన్ల జీవోలు, మినీ వర్కర్ల ప్రమోషన్ల జీవోల అమలులో ఎంఎల్‌ఎల పెత్తనం ఎక్కువగా ఉంది. కరోనా కాలంలో కూడా లబ్ధిదారులకు ఆహారాన్ని, ఆరోగ్య సేవలను అందిస్తున్న అంగన్‌వాడీలకు ఎటువంటి గుర్తింపు లేదు. చివరకు చనిపోయినాసరే…మట్టి ఖర్చులు ఇచ్చే దిక్కు కూడా లేదు. పెన్షన్ లేకుండానే రిటైర్ చేయటం వలన ఒంటరి మహిళలు, అనాథలు అడుక్కునే పరిస్థితికి నెట్టబడుతున్నారు. 7 సంవత్సరాలుగా సూపర్‌వైజర్ పోస్టులు భర్తీ చేయనేలేదు.
ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా… అంగన్‌వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లో విలీనం చేయడం ఆపాలి. ఐసిడిఎస్‌కు బడ్జెట్ పెంచాలి. అంగన్‌వాడీ సెంటర్లకు మౌలిక వసతులు కల్పించి బలోపేతం చేయాలి. అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలి. కరోనా కాలంలో చనిపోయిన అంగన్‌వాడీలందరికీ బీమా వర్తింపచేయాలి. సంక్షేమ పథకాలు అమలు చెయ్యాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోని పక్షంలో…లబ్ధిదారులను కలుపుకొని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు మరో పోరాటానికి సిద్ధం అవుతారనడంలో సందేహం లేదు.
Courtesy Prajashakti