ఉపాధి చెల్లింపుల్లో విభజన

0
155

– ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరీల కింద డివైడ్‌
– సమయానికి చెల్లింపులపై ప్రభావం : ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా ఆగ్రహం

న్యూఢిల్లీ : దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) లో చెల్లింపులపై మోడీ సర్కారు మరో మార్పునకు సిద్ధమైంది. వేతన చెల్లింపులను ఎస్సీ, ఎస్టీ, ఇతర కేటగిరిల కింద విభజించాలని విభజించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే సలహా ఇచ్చింది. అయితే, ఎలాంటి సంప్రదింపులు జరపకుండా, ఆ నిర్ణయం వెనుక గల సరైన కారణాన్ని తెలపకుండా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విధంగా వ్యవహరించింది. అయితే, మోడీ ప్రభుత్వ నిర్ణయంపై ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా (ఇది దేశవ్యాప్తంగా ఉన్న సంస్థలు, వ్యక్తుల సమూహం) ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్మికుల విభజనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర తోమర్‌కు లేఖ రాసింది. ఒకే వేతనాన్ని పొందే అర్హత కలిగిన కార్మికులను ఇలా వర్గాలు విభజించడంలో అర్థమే లేదు అని సంఘర్ష్‌ మోర్చా పేర్కొన్నది.

గతంలో వేతన చెల్లింపు పద్దతిని మార్చిన ప్రతిసారీ కార్మికులు ఆలస్యమైన వేతన చెల్లింపుతో బాధపడుతూ వస్తున్నారని గుర్తు చేసింది. చెల్లింపుల పద్దతిని సరళీకృతం చేసి సకాలంలో జరిగేలా చూడాలని కోరింది. ” ఇప్పటికే సంక్లిష్టమైన చెల్లింపు విధానాన్ని మరింత క్లిష్టంగా మార్చడం తప్ప ఈ చర్య నుంచి నాకు ఎలాంటి ఉపయోగమూ కనిపించడం లేదు. ఈ పథకానికి ప్రణాళిక ప్రక్రియకు గ్రామ సభ నేతృత్వం వహించాలి.

ఇప్పటికే చెల్లింపులు ఒక నెల వరకు జరుగుతున్నాయి” అని ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చాకు చెందిన దేవ్‌మాల్య నందీ అన్నారు. అయితే, ఈ విధంగా ఎస్సీ, ఎస్టీలు, ఇతర కేటగిరీలుగా విభజించి ప్రభుత్వం చేసే ఖర్చును ఆ వర్గాలకు (ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు) కోసం చేసిన ఖర్చు కింద వేయడానికి కేంద్రానికి అవకాశం కలుగుతుందని నిపుణులు తెలిపారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించే నిధుల మొత్తం పరోక్షంగా తగ్గుతుందని చెప్పారు.దళిత మానవహక్కుల సమాచారం ప్రకారం.. కేంద్రంలో తొలిసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2019 మధ్య ఎస్సీలకు అవసరమైన మొత్తం రూ.

6.2 లక్షల కోట్లు. అయితే, మోడీ ప్రభుత్వం కేటాయించింది మాత్రం రూ. 3.1 లక్షల కోట్లు కావడం గమనించాల్సిన అంశం. అవసరమైన మొత్తంలో కేటాయింపులు జరిగింది సగమే.

దేశ జనాభాలో ఎస్సీలు 16 శాతం ఉన్నారు. కానీ, కేంద్ర పథకాలలో 8శాతం మాత్రమే ఈ వర్గానికి కేటాయించారు. ఇక షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) కోసం 2014-19 మధ్య రూ. 3.28 లక్షల కోట్లు అవసరం కాగా మోడీ సర్కారు జరిపిన కేటాయింపు రూ. 2 లక్షల కోట్లు మాత్రమే. అంటే 60 శాతం. దేశ జనాభాల్లో ఎస్టీ జనాభా 8 శాతంగా ఉండగా మొత్తం వ్యవయంలో వారికి కేటాయించింది మాత్రం ఐదు శాతమే. ఇందులో కూడా అసలు ఖర్చు చాలా తక్కువ.

Courtesy Nava Telangana

Leave a Reply