‘ఉపాధి’ ఢమాల్‌

0
46
  • ఐదేళ్ల కనిష్ఠానికి ఉపాధి హామీ పనులు
  • ఈ ఏడాది కుటుంబానికి 42 రోజులే
  • కరోనా దెబ్బలోనూ.. తగ్గిన పనిదినాలు
  • 9 రాష్ట్రాలు, యూటీల్లో మరింత దారుణం
  • కేటాయింపుల్లో 70% కంటే తక్కువే ఖర్చు

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిదినాలు ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఈనెల 20వ తేదీ నాటికి ఒక్కో కుటుంబానికి సగటున 42 పనిదినాలు మాత్రమే లభించాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం(2021-22) సగటు(50 పనిదినాలు) కంటే చాలా తక్కువ. కరోనా పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన చాలామంది ఉపాధి హామీపై ఆధారపడినప్పటికీ, ఈ ఏడాది పనులకు డిమాండ్‌ తగ్గడం గమనార్హం. వ్యవస్థాగత సమస్యలే దీనికి కారణమని విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ‘నిధుల కొరతతో పనులు తగ్గించడం, కూలి చెల్లింపుల్లో జాప్యం చేయడం వంటివి ఉపాధి కూలీలలో నిరుత్సాహానికి దారితీస్తాయి’ అని అజీం ప్రేమ్‌జీ వర్సిటీ ప్రొఫెసర్‌ రాజేంద్రన్‌ నారాయణన్‌ పేర్కొన్నారు. పథకం సమర్థవంతంగా నడవాలంటే కనీసం 2 లక్షల కోట్లు కేటాయించాలని ఆయన సూచించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 2 నెలలే మిగిలి ఉన్నప్పటికీ, తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేటాయించిన పనిదినాల్లోనూ 70% కంటే తక్కువ వినియోగించుకున్నాయి. డామన్‌ డయ్యూ ఒక్క పనిదినాన్ని కూడా వినియోగించుకోలేదు. కాగా, కేంద్రం ఎటువంటి కారణం చూపకుండానే తరచుగా రాష్ట్రాలు పెట్టిన లేబర్‌ బడ్జెట్‌లో కోత విధిస్తోంది.

Leave a Reply