ఉప్పుడు బియ్యం.. ఉప్పు

0
290

ఇదే వారి రోజువారీ తిండి
చేతిలో చిల్లి గవ్వ లేదు.. ప్రభుత్వం నుంచి సాయమూ అందదు
బెంగాల్‌ వలసకార్మికుల కష్టాలు

కోల్‌కతా : లాక్‌డౌన్‌ తెచ్చిన కష్టాలు దేశంలో వలసకార్మికులను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కరోనా మహమ్మారి ఉధృతి, మోడీ సర్కారు అనాలోచిత లాక్‌డౌన్‌ నిర్ణయం, ప్రభుత్వాల అలసత్వం వెరసి.. వారు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. కూరగాయలను కొనడానికి కనీసం చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.

ఇటు మోడీ సర్కారు నుంచి కానీ, అటు మమత సర్కారు నుంచి కానీ వారికి తగిన హామీ లభించడం లేదు. దీంతో కేవలం రేషన్‌ దుకాణాల నుంచి అందిన ఆహార ధాన్యాల మీద వారు ఆధారపడుతున్నారు. ఉప్పుడు బియ్యం, ఉప్పుతోనే బెంగాల్‌ వలసకార్మికులు తమ రోజువారి దినచర్యను కొనసాగిస్తున్నారు.
లాక్‌డౌన్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి బెంగాల్‌ వలస కార్మికులు సొంత రాష్ట్రానికి చేరుకున్నారు. కాలినడకన కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ, తీవ్ర కష్టాలను ఎదుర్కొంటూ వారు తమ గమ్యస్థానాన్ని చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి బెంగాల్‌లోని తన ఇంటికి చేరుకున్న ఒక వలస కార్మికుడు సంజరు పరుయీ(21) మాట్లాడుతూ తన ఆవేదనను వెలిబుచ్చారు.

”మేము స్థానిక రేషన్‌ షాపు నుంచి బియ్యాన్ని పొందుతున్నాం. కానీ, ప్రస్తుతం మా వద్ద ఒక్క రూపాయి కూడా లేదు. వంటనూనె, ఇంటి సామాగ్రి కూరగాయలు, కనీసం ఉప్పు కొందామన్నా కష్టంగానే ఉన్నది” సంజరు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆయనతో పాటు మరో 17 మంది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చారు. వీరిది ఉత్తర 24 పరగణాలులోని ఒక మారుమూల గ్రామం.

”నేను ఆంధ్రప్రదేశ్‌లో పని చేశాను. అక్కడ నాకు రూ.9500 లభించేవి. వీటిలో రూ.5000లు ఇంటికి పంపేవాడిని. ఆరుగురు ఉండే మా కుటుంబంలో నేనే వారికి ఆధారం. కానీ ఇప్పుడు మాకు పనిలేక, ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సాయం అందక పూట గడవటమే కష్టంగా మారింది. ఉప్పుడు బియ్యం, ఉప్పుతోనే మా కడుపు నింపుకుంటున్నాం” అని బిజరు అనే మరో కార్మికుడు ఆందోళన వెలిబుచ్చారు.

మరో కార్మికుడు సుకాంత పరూయీ మాట్లాడుతూ..”నేను మహారాష్ట్రలోని ముంబయిలో స్వర్ణకారుడిగా పనిచేశాను. అప్పుడు నాకు రూ.12,500 జీతంగా వచ్చేది. ఇప్పుడు పనిలేక, చేతిలో చిల్లగవ్వ లేక తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాం. కూరగాయలూ కొనలేని పరిస్థితి. అన్నంలో ఉప్పు, కారం, నీరుతోనే మా రోజును గడుపుకుంటున్నాం” అని చెప్పారు. బెంగాల్‌ వ్యాప్తంగా తిరిగివచ్చిన వలసకార్మికుల పరిస్థితి ఈ విధంగానే ఉన్నది. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని వలసకార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply