వలస కార్మికుల విషాదం

0
253

అనిశెట్టి రజిత

కోవిడ్‌ –19 అనంతరం ఈ వలస కార్మికుల స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనాలు చేయాల్సి ఉంది. యుద్ధ ప్రాతిపదికన వారిని మానవీయ వాతావరణంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. యజమానులు, కాంట్రాక్టర్లు ఇప్పటికైనా మేలుకోవాలి. అందరం స్పందించి తీరాలి. మానవతను నిలబెట్టి సుస్థిరం చేయాలి.

సామాజిక బాధ్యతను విస్మరించేవాళ్ళూ, సామా జిక భద్రత అసలేమీ పట్టనివాళ్ళూ అధికంగా ఉన్న నిర్లిప్త నిర్దాక్షిణ్యపు సమాజం మనది. నాలుగూర్లు తిరిగిచూసే వరకూ ఇన్నాళ్ళూ నాకెప్పుడూ తట్టని వలస కూలీల పరిస్థితి దిగ్భ్రాంతిని కలిగించింది. కరోనా వచ్చి కరిచే దాకా కళ్ళు తెరుచుకోనందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఊర్లకు దూరంగా వెలిసిన వలస కూలీల వాడలు అభాగ్యుల వెలివాడలుగా అనిపిస్తాయి. అల్లకల్లోలంగా ఉన్న ఈ దుర్భర వాతావరణంలో కాలుతున్న పెనం మీద నుండి మండుతున్న పొయ్యిలో పడిపోయినట్లు ఉన్నది వాళ్ళ నిర్భాగ్యత. నిర్మాణపు పనులు, ఇటుక బట్టీలూ, క్వారీలూ, పరిశ్రమల్లో పనుల కోసం మధ్యదళారులూ, కాంట్రాక్టర్లూ, గుత్తేదార్లూ వేల సంఖ్యలో ఈ పనివాళ్ళను సప్లయ్‌ చేస్తారు.

ఒక్క వరంగల్‌ జిల్లాలోనే లక్షా ఇరవై వేల వలస కార్మికులు ఉన్నారంటే హైదరాబాద్‌లో వీరి సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో ఊహకందదు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌, బీహార్‌, గుజరాత్‌, ఒడిషా రాష్ట్రాల నుండి వీరిని తరలించుకొస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, ఒంగోలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుండి వందల సంఖ్యలో తోలుకురాబడుతున్నారు. వీళ్ళలో కొందరు కుటుంబాలతో సహా వచ్చి ఉంటుంటే, కొందరు ఒంటరిగా ఉంటున్నారు.

ఒక్కొక్క పని స్థలంలో వందా, రెండు వందల చీప్‌ లేబర్‌ కుటుంబాలు ఉంటాయి. కుక్కలు, పందుల గూళ్ళలాంటి రేకుల షెడ్లూ, మట్టి, రాతి నివాసాలనబడే వాటిల్లో కనీస సౌకర్యాలు గానీ, భద్రత గానీ లేకుండా ఈ కుటుంబాల వారు ఉంటున్నారు. మంచినీళ్ళు, వాడుకనీళ్ళు, మరుగుదొడ్లూ, స్నానాల గదులూ, సురక్షిత పరిసరాలూ మృగ్యం. వీళ్ళు మనుషుల్లా కాకుండా యం త్రాల్లా గాలీ, వెలుతురు, కనీస వైశాల్యం ఏమీ లేని కొట్టాల్లో పశువుల్లాగా పడి ఉంటున్నారు. ఏం తింటున్నారో, ఎట్లా బతుకుతున్నారో అనేది విషాదకరమైన బిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఈ నివాసాలను చూసిన ఎవరికైనా దిగ్భ్రాంతి కలుగుతుంది. ఈ లాక్‌డౌన్‌లో అయితే పనీ లేదు, పైసలూ రావు. కాంట్రాక్టర్లూ, గుత్తేదార్లూ వీరిని కనీసం పట్టించుకున్న పాపాన లేరు. చాలా సముదాయాల్లో ప్రభుత్వం వల్ల అరకొరగానో, పూర్తిగానో సాయం అందుతున్నదీ, అందడం లేదన్నదీ నిజం. ఒకవిధంగా ఆకలితో మాడుతున్నారు. వరంగల్‌ జిల్లా నక్కలపల్లి గ్రామ శివార్లలో ఇటుకబట్టీల పనికి ఒడిషా నుండి వచ్చిన 230కుటుంబాలున్నాయి. ఒక స్త్రీ ప్రసవించి ఐదారు రోజులవుతున్నా ఆమె స్నానం చేయలేదంటే, అక్కడ నెలకొన్న పరిస్థితి ఏమిటో ఊహించుకోవాల్సిందే.

ఊరికి దూరంగా ఉండే ఈ వలస కూలీల గుడారాలు, ఇతర సమాజంతో వీరికి సంబంధాలు ఏర్పడనివ్వవు. వీళ్ళ భాషలు వేరు. ఎవ్వరితోనూ మాటలు కలపలేరు, తమ గోడు చెప్పుకోలేరు. వీళ్ళను పని యంత్రాల్లా వాడుకునే కాంట్రాక్టర్లు, యజమానులు శ్రమ దోపిడీ చేయడమే గానీ వీళ్ళను మనుషుల్లా చూసే పరిస్థితి లేదు. వీళ్ళపై అత్యాచారాలు, భౌతిక దాడులు జరుగుతూంటాయి.

ప్రపంచంలో ఎక్కడైనా ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు ఆయా ప్రాంతాల ప్రజలు, బాధితులు అధికారుల దిక్కూ, ప్రభుత్వాల దిక్కూ సహాయం కోసం చూస్తారు. కానీ పెద్ద విపత్తులు వచ్చిపడితే వాటిని ఎదుర్కొని నిలువరించడం ప్రభుత్వాలకు శక్తికి మించిన పనిగా ఉంటుంది. సామర్థ్యం సరిపోకపోవచ్చు, వనరుల పరిమితి ఉండవచ్చు. చాలా వరకు ప్రజలే ప్రజల్ని ఆదుకోవాల్సి వస్తుంది. ఇదేమీ కొత్త కాదు. ప్రస్తుత కష్టకాలంలో ఎందరో వ్యక్తులూ, సామాజిక కార్యకర్తలూ, దాతలూ, మానవతావాదులూ ఇలాంటి అన్నార్తులనూ, అవసరార్థులనూ ఆదుకుంటున్నారు.

అయితే, కోవిడ్‌ -19 అనంతరం ఈ వలస కార్మికుల స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధ్యయనాలు చేయాల్సి ఉంది. యుద్ధ ప్రాతిపదికన వారిని మానవీయ వాతావరణంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. యజమానులు, కాంట్రాక్టర్లు ఇప్పటికైనా మేలుకోవాలి. అందరం స్పందించి తీరాలి. మానవతను నిలబెట్టి సుస్థిరం చేయాలి.

‘ప్రరవే’, తెలంగాణ

Courtesy Andhrajyothi

Leave a Reply