భారత్‌లో ఆగని కరోనా కల్లోలం

0
36

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా వైరస్‌ మహమ్మారి భారత్‌లోనూ విజృంభిస్తోంది. శరవేగంగా వ్యాప్తిచెందుతూ మిలియన్‌ మార్క్‌ను దాటేసి మృత్యుఘంటికలు మోగిస్తోంది.

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ శరవేగంగా కొనసాగుతోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య శుక్రవారం నాటికి 10 లక్షల మార్క్‌ దాటేసింది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో అత్యధికంగా 34,956 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య మిలియన్‌ మార్క్‌ను అధిగమించింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10,03,832కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది.

గడచిన 24 గంటల్లో 687 మరణాలు చోటుచేసుకోవడంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 25,602కు చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 6,35,757 మంది కోలుకోగా, మరో 3,42,473 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల రికవరీ రేటు 63శాతంగా ఉంది. జూన్‌ నెల మధ్యలో 50శాతంగా ఉన్న రికవరీ రేటు జులై నాటికి 63శాతానికి పెరిగింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిలక్షల జనాభాకు దాదాపు 1630 కేసులు నమోదవుతుండగా భారత్‌లో మాత్రం ఈ సంఖ్య 658గా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అత్యధికంగా అమెరికాలో ప్రతి పదిలక్షల జనాభాకు 10,731 కేసులు నమోదవుతుండగా, స్పెయిన్‌, రష్యా, యూకే దేశాల్లో ఈ సంఖ్య దాదాపు 5వేలుగా ఉంది. కరోనా మరణాల్లోనూ ప్రపంచ సగటు (ప్రతి పదిలక్షల జనాభాకు) 73 మంది చనిపోతుండగా భారత్‌లో మాత్రం 17 ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతుండగా మరణాల్లో మాత్రం ఎనిమిదో స్థానంలో ఉంది.

భారత్‌లో తొలి కోవిడ్‌-19 కేసు జనవరి 30న కేరళలో నమోదైంది. దాదాపు 170 రోజుల్లోనే కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో కరోనా కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. మహారాష్ట్రలో 2 లక్షల 84,281 మంది కరోనా బారిన పడగా, 11,194 మంది మృతి చెందారు. తమిళనాడులో లక్షా 56,369 కరోనా కేసులు 2,236 మరణాలు సంభవించాయి. కర్ణాటకలో ఇప్పటివరకు 51,422 మందికి కరోనా సోకగా 1,032 మంది మృత్యువాత పడ్డారు. ఢిల్లీలో లక్షా 18,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,545 మంది ప్రాణాలు విడిచారు. ఆంధ్రప్రదేశ్‌ లో 35,159 మందికి కోవిడ్‌ బారిన పడగా 492 మంది మరణించారు. తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 41,018కి చేరుకోగా 396 మరణాలు నమోదయ్యాయి.

Leave a Reply