యూపీలో కార్‌ చిచ్చు

0
215
  • ఇద్దరు రైతుల దుర్మరణం.. తీవ్ర ఉద్రిక్తత
  • మంత్రి స్వగ్రామంలోనే ఘటన 
  • సాగు చట్టాలపై నిరసనలో దుర్ఘటన
  • అన్నదాతల్లో ఆగ్రహావేశాలు.. 3 కార్లు దహనం
  • ఆందోళనలు హింసాత్మకం.. మరో 8 మంది మృతి
  • మరణించిన రైతులు ఇద్దరు కాదు నలుగురు
  • ఇవి కేంద్రమంత్రి కుమారుడు చేసిన హత్యలే
  • కేంద్ర మంత్రిని బర్తరఫ్‌ చేయాలి: ఎస్‌కేఎం
  • ఇంత జరిగినా మౌనంగా ఉంటే చచ్చినట్టే: రాహుల్‌ 
  • మా అబ్బాయి అక్కడ లేనేలేడు.. సాక్ష్యాలున్నాయి
  • రాళ్ల దాడితోనే వాహనం తిరగబడింది
  • ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్‌ మృతి: అజయ్‌
  • రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత

లఖీంపూర్‌ ఖీరీ, లఖ్‌నవూ : సాగు చట్టాలపై నిరసన హింసకు దారి తీసింది! రైతుల ఆందోళన రణరంగమైంది! బీజేపీ, రైతుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు రైతులు మరణిస్తే.. ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా వివాదాస్పదంగా మారారు. నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆయన తన ఎస్‌యూవీ కారును ఉరికించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారని చెబుతున్నారు. అయితే, అసలు తన కుమారుడు ఘటనా స్థలంలోనే లేరని కేంద్ర మంత్రి చెబుతున్నారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖీరీ జిల్లాలోని మంత్రి స్వగ్రామమైన తికునియాలో ఆదివారం జరిగింది. రైతుల పైకి మంత్రి కుమారుడు తన కారును ఉరికించడంతో ముగ్గురు చనిపోయారని భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) అంటుంటే..నలుగురు మృతి చెందారని సంయుక్త్‌ కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) తెలిపింది.    లవ్‌ ప్రీత్‌ సింగ్‌ (20), దల్జీత్‌ సింగ్‌ (35), నచత్తర్‌ సింగ్‌ (60), గుర్వీందర్‌ సింగ్‌ (19) అనే రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. రైతు నేత రాకేశ్‌ తికాయత్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష నేతలంతా అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనతో ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల ఎదుట నిరసనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

అసలేం జరిగింది?
తికునియాలో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య హాజరయ్యారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన ఎదుట నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేయాలని అక్కడి రైతులు ముందే ప్రణాళిక వేసుకున్నారు. ఈ క్రమంలో మౌర్యకు స్వాగతం పలికేందుకు మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా తన కారులో బయలుదేరారు. ఈ సమయంలో ఆశి్‌షను వెళ్లనీయకుండా కారు ఎదుట రైతులు బృందంగా నల్లజెండాలను పట్టుకుని నిల్చుని నిరసనలు తెలిపారు. అయితే ఆయన తన కారును ఆపకుండా రైతులపై నుంచి ఉరికించారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందడంతో అన్నదాతల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఆశిష్‌ కారు సహా మూడు కార్లకు వారు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మూడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఆందోళనలు తీవ్రస్థాయికి చేరకొని హింసకు దారితీయడంతో కనీసం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు రైతులు, జర్నలిస్టులు గాయపడ్డారు. అయితే రైతులపైకి రెండు వాహనాలు దూసుకెళ్లాయని మరికొందరు చెబుతున్నారు. అయితే, ఇక్కడ ఉత్తరప్రదేశ్‌ అధికారులు భిన్న కథనాలను వినిపిస్తున్నారు. హింసాత్మక ఆందోళనల్లో మరణించిన ఎనిమిదిమంది రైతులని రైతు సంఘాలు చెబుతున్నాయి. కానీ, వారిలో నలుగురు బీజేపీ కార్యకర్తలని అధికారులు అంటున్నారు. ఆశిష్‌ కాన్వాయ్‌పై రైతులు రాళ్ల దాడి చేశారని, ఈ సందర్భంగా కారును తలకిందులు చేశారని వివరిస్తున్నారు. అనంతరం, కారులోని డ్రైవర్‌ సహా ముగ్గురు బీజేపీ కార్యకర్తలను బయటకు లాగి మరీ కొట్టి చంపారని అధికారులు తెలిపారు. అంతేనా, మంత్రి కాన్వాయ్‌పై రైతులు రాళ్ల దాడి చేశారని, దాంతో, కాన్వాయ్‌లోని ఓ కారు తిరగబడిందని, దాని కింద పడి ఇద్దరు రైతులు మరణించారని అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తేవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు.

అమిత్‌ షానే చేయించారన్న జయంత్‌ చౌదరి
తికునియా ఘటనను సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. వాహనాన్ని రైతుల బృందంపైకి ఉరికించి చంపిన ఘటన తర్వాత కూడా మౌనంగా ఉంటున్న వారు చచ్చినవారితో సమానం అని రాహుల్‌ గాంధీ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ ఘటన నేపథ్యంలో బీజేపీపై లెఫ్ట్‌ పార్టీలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. నలుగురు రైతుల ప్రాణాలను తీయడం ద్వారా బీజేపీ నేరానికి పాల్పడిందని సీపీఎం నేత బృందా కరాత్‌ ఆరోపించారు. రైతులు తమ కోసం పోరాటం చేయడం లేదని.. దేశం కోసం, ఆహార భద్రత కోసం పోరాడుతున్నారని పేర్కొన్నారు. రైతుల ఆందోళనను తొక్కిపెట్టాలనే కుట్రతోనే కేంద్ర హోం మంత్రి అమిత్‌షానే ఈ పని చేయించారని రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధ్యక్షుడు జయంత్‌ చౌదరీ తీవ్ర ఆరోపణలు చేశారు.

రాళ్ల దాడికి పాల్పడటంతోనే: అజయ్‌ మిశ్రా
ఈ ఘటనపై కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రా స్పందించారు. ఘటనాస్థలిలో తన కుమారుడు ఆశిష్‌ మిశ్రా లేడని, ఇందుకు తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరసనకారులు కారుపై రాళ్ల దాడికి పాల్పడటంతోనే అదుపు తప్పి వాహనం తిరగబడిందని.. దాని కింద పడి ఇద్దరు రైతులు మృతిచెందారని చెప్పారు. అయితే ఆ వాహనంలో తన కుమారుడు లేడని స్పష్టం చేశారు. వేల మంది హాజరైన డిప్యూటీ సీఎం మౌర్య కార్యక్రమంలో తాను, తన కుమారుడు ఉన్నామని వెల్లడించారు. మూకదాడిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, డ్రైవర్‌ మృతిచెందినట్లు చెప్పారు.

కర్రలతో సిద్ధంగా ఉండండి: ఖట్టర్‌
రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులను ఉద్దేశించి హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరందరూ (బీజేపీ కార్యకర్తలు) 500- 1000 మంది గ్రూపులుగా ఏర్పడండి. కర్రలు తీసుకుని సిద్ధంగా ఉండండి. జైలుకెళ్లినా ఇబ్బంది లేదు. జైల్లో మీరు 6 నెలలకు మించి ఉండరు. తర్వాత మీరు పెద్ద నాయకులవుతారు’’ అన్నారు. ఆదివారం చండీగఢ్‌లో జరిగిన బీజేపీ కిసాన్‌ మోర్చా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళన దక్షిణ హరియాణాలో పెద్దగా లేదని, రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాలకే పరిమితమైందన్నారు. రైతుల ఆందోళనను ఉద్దేశిస్తూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘‘రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం దేశద్రోహమే. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అంగీకారం కూడా ఖట్టర్‌కు ఉన్నట్లు తెలుస్తోంది’’ అని కాంగ్రెస్‌ నేత సుర్జేవాలా ట్వీట్‌ చేశారు.

Courtesy Andhrajyothi

Leave a Reply