హైదరాబాద్: దమ్మాయిగూడ(Dammaiguda) బాలిక మిస్సింగ్ కేసు (Missing girl case)విషాదాంతంగా ముగిసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ఓ బాలిక గురువారం తప్పిపోయింది. అంబేడ్కర్‌నగర్‌లోని ఎన్‌టీఆర్‌నగర్ కాలనీకి చెందిన జడల నరేశ్ చిన్న కూతురు ఇందు(10) నాలుగో తరగతి చదువుతోంది. నిన్న ఉదయం కుమార్తెను పాఠశాలలో దించి వెళ్లిపోయాడు. 10 గంటల సమయంలో ఇందు క్లాస్‌టీచర్ హాజరు సమయంలో ఇందు పలకకపోవడంతో ఆమెకోసం ఆరా తీశాడు. పాఠశాలలో బ్యాగ్ వదిలిపెట్టి సమీపంలో ఉన్న పార్కుకు ఆడుకోడానికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిందని తోటి విద్యార్థులు తెలిపారు. పాప ఎక్కడా కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయుడు సమాచారం అందించారు. పరిసరాల్లో గాలించినా బాలిక కనిపించకపోవడంతో తండ్రి నరేశ్ జవహర్‌నగర్ పోలీసులకు సమాచారం అందించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయడంతో శుక్రవారం దమ్మాయిగూడ చెరువులో పాప మృతదేహం లభ్యమైంది. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే క్రమంలో పోలీస్ వాహనానికి తల్లిదండ్రులు అడ్డుపడ్డారు. పోలీస్ వాహనం ఎక్కి వాహనాన్ని ముందుకు వెళ్లనీయకుండా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో దమ్మాయిగూడ చెరువు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి మృతిపై పోలీసులు అనుమానాస్పద మృతి క్రింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.