ఆగ్రా ఆసుపత్రిలో 22 మంది మృతి?

0
17

మాక్‌ డ్రిల్‌ పేరుతో ఆక్సిజన్‌ నిలిపివేయడమే కారణం!
రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన ‘పరాస్‌’ యాజమాన్యం
అన్ని మరణాలు లేవన్న జిల్లా కలెక్టర్‌
దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం

ఆగ్రా, లఖ్‌నవూ: అనుమతులకు మించి కొవిడ్‌ బాధితులను చేర్చుకున్న ఓ ఆసుపత్రి.. ఆక్సిజన్‌ కొరత ఏర్పడడంతో కొందరిని బయటకు పంపించేందుకు ఓ పథకం రచించింది! మాక్‌ డ్రిల్‌ పేరుతో ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడింది. ఈ క్రమంలోనే పరిస్థితి విషమించి 22 మంది చనిపోయారని తెలుస్తోంది. ఏప్రిల్‌ 26న జరిగిన ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం ఉత్తర్‌ప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. ఆసుపత్రి వ్యవహారంపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఇదీ జరిగింది..
ఆగ్రాలోని పరాస్‌ ఆసుపత్రికి డా.అరింజయ్‌ జైన్‌ యజమాని. కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడంతో ఏప్రిల్‌ నెలలో ఆసుపత్రికి ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. తగిన ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. ‘మాక్‌ డ్రిల్‌’ తరహాలో ‘ఆక్సిజన్‌ డ్రిల్‌’ నిర్వహించింది. ఆక్సిజన్‌ సరఫరాను అర్ధాంతరంగా నిలిపివేసింది.
‘‘ఆక్సిజన్‌ అత్యవసరమైన వారెవరో గుర్తించాలనుకున్నాం. ఏప్రిల్‌ 26వ తేదీ ఉదయం 7 గంటలకు..ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసి మాక్‌ డ్రిల్‌ నిర్వహించాం. ప్రాణవాయువు అందక 22మంది విలవిలలాడిపోయారు. ఆక్సిజన్‌ లేకపోతే వారు బతకరని అర్థమైంది. ఐసీయూలో మిగిలిన 74మంది రోగుల కుటుంబాలకు.. సొంతంగా ఆక్సిజన్‌ సిలిండర్లు తెచ్చుకోవాలని సూచించాం’ అని డాక్టర్‌ అరింజయ్‌ జైన్‌ చెబుతున్న మాటలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ‘‘రోగులను డిశ్ఛార్జి చేద్దామనుకున్నా వారిని తీసుకెళ్లడానికి కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకురాలేదు. నగరంలో ఆక్సిజన్‌ లేదు. ముఖ్యమంత్రి కూడా ఆక్సిజన్‌ సరఫరా చేయలేరు. ఆసుపత్రిలో 96మంది రోగులు ఉన్నారు. వారిని తీసుకెళ్లిపోవాలని బంధువులను కోరాము. కానీ వారు నా మాట వినలేదు’’ అంటూ అరింజయ్‌ జైన్‌ చేసిన వ్యాఖ్యలూ ఆ వీడియోలో నమోదయ్యాయి.  అదే రోజున ఆ ఆసుపత్రిలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా నమోదైంది. మరుసటి రోజు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 22 మంది మృతి చెందారనే ప్రచారం వ్యాప్తిలోకి వచ్చింది. పరాస్‌ ఆసుపత్రిలో ఏప్రిల్‌ 26న తన తాత చనిపోయారని ఆగ్రాలోని జీవన్‌ మండి ప్రాంత నివాసి మయాంక్‌ చావ్లా వెల్లడించారు. అదే రోజు ఎందరో ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

45 మంది చికిత్సకే అనుమతి: కలెక్టర్‌
పరాస్‌ ఆసుపత్రిలో 45 మంది కొవిడ్‌ బాధితులకే చికిత్స అందించడానికి అనుమతి ఉందని ఆగ్రా కలెక్టర్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు. ఆ ఆసుపత్రికి ఆక్సిజన్‌ కొరత ఉందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ కారణంతో ఎవరూ చనిపోలేదన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ 96 మంది రోగులను చేర్చుకోవడంతోనే ఆసుపత్రిలో ఆక్సిజన్‌ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 26న నలుగురు, 27న ముగ్గురు రోగులు ఆ ఆసుపత్రిలో చనిపోయినట్లు కలెక్టర్‌ వెల్లడించారు. ఆసుపత్రి వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించారు.

Courtesy Eenadu

Leave a Reply