మురికికూపంలా మోడీ దత్తతగ్రామం

0
220

 సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన కింద యూపీలోని జయపూర్‌ ఎంపిక
ఐదేండ్ల ముందు మీడియాలో ఆహా..ఓహౌ..మరి ఇపుడు..?
ప్రధానిపై స్థానికుల్లో ఆగ్రహం

లక్నో : సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ అంటూ ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఉంటారు. దేశప్రజల సంగతేమో కానీ.. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామం కింద ఎంపిక చేసుకున్న జయపూర్‌లో అడుగుపెడితే స్థానికుల ఆవేదన అంతా ఇంతా కాదు. ఆ గ్రామాన్ని మోడీ దత్తత తీసుకున్నారని చెప్పగానే.. మీడియా, రాజకీయనేతలు పరుగులు తీశారు. ఇపుడు ఎవరూ తమ గ్రామం వైపు కన్నెత్తిచూడటంలేదని గ్రామస్థులు అంటున్నారు.
తొలిదఫాగా నాలుగు గ్రామాల దత్తత ప్రధాని మోడీ మొదట సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ యోజన కింద జయపూర్‌ను దత్తత తీసుకున్నారు. మొదటి దశలోనే నాలుగు గ్రామాలను ఎంపిక చేసుకున్నారు.జయపూర్‌, నాగేపూర్‌, కాఖరియా, డోమ్రి.ఈ ఏడాది మరో రెండు కొత్త గ్రామాలను జోడించారు.అవి పూరి బరియార్‌పూర్‌ (సేవాపురి), పరంపూర్‌ (అరాజిలిన్‌).వారణాసి నగరం నుంచి సుమారు ఒక గంట ప్రయాణం తర్వాత.. జయపూర్‌ చేరుకోవడానికి ముందు కచరియా, చందాపూర్‌ అనే రెండు పొరుగు గ్రామాలు ఉన్నాయి. జయపూర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ పెద్ద టవర్‌ కనిపిస్తున్నది. 100 మీటర్ల వద్ద సౌర దీపాలు ఏర్పాటు చేశారు. మోడీ దులారా గ్రామంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆయన చూపు ఈ ఆధునిక సౌకర్యాలపై పడేలా చేశారు. పరిశుభ్రత సందేశాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్న మోడీ చిత్రాలు, పోస్టర్‌లతో కూడిన పెద్ద బోర్డులను అమ ర్చారు. కానీ వాస్తవపరిస్థితులు అందుకుభిన్నంగా ఉన్నాయి.

జయపూర్‌ మహిళల గోస..
కారుపై ”ప్రెస్‌” అని రాసి ఉండటం చూసి, జయపూర్‌లోని కొందరు మహిళలు మమ్మల్ని ఆపారు. మీడియా నుంచి వచ్చారా..?అని ప్రశ్నించారు.అందుకు సమాధానం చెప్పేలోపే..స్థానికురాలైన మీనా గుప్తా మాటా ్లడటం ప్రారంభించారు. ”ఇంతకు ముందు చాలా మంది మీడియా వ్యక్తులు వచ్చారు. జయపూర్‌ను మొదట ప్రతిరోజూ టీవీలో చూపేవారు. ఇప్పుడు వార్తాపత్రికలు, టీవీల నుంచి జయపూర్‌ అదృశ్యమైంది. ఒక్కసారి మా ఇంటికి రండి.చుట్టూ పరిసరాలు చూడండి , అప్పుడు నిజమేంటో తెలుస్తున్నది. ఇప్పటికీ మేం మునుపటిలాగే ఉన్నాం”అని వివరించారు.మీనా గుప్తా ఒక మధ్య వయస్కు రాలు.అతని కుమారుడు సుజిత్‌, కోడలు కాంచన్‌ ఇద్దరూ వికలాంగులు.ఆమె మీడియా మిత్రులను తన ఇంటికి తీసుకెళ్లింది. గుడిసెలో ఒక మంచం, ఒక ఇతర సామాగ్రి కనిపించాయి. అయితే ఇల్లంతా బురదతో నిండి ఉన్నది..

గుడిసెలోకి వరద నీరు
”పీఎం మోడీ జయపూర్‌ను దత్తత తీసుకున్నప్పుడు, మా అందరి పరిస్థితి పెరిగినట్టు అనిపించింది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రతిరోజూ ఇంటికి వచ్చి విచారించేవారు. సంవత్సరాలు గడిచాయి. ఇప్పుడు అధికారుల వాహనాలు లేవు. ప్రభుత్వ ప్రతినిధులు రావటంలేదు. మా ఊరిని అభివృద్ధి చేస్తామన్న అధికారుల్ని, నాయకుల్ని గుడ్డిగా నమ్మాం. జయపూర్‌ పురోగతి కచ్చితంగా ఉంటుందని ఆశించాం. కానీ ఇపుడు తలచుకుంటుంటే.. ఇది ఊరా..వల్లకాడా..తెలియటంలేదు” అని మీనా గుప్తా వాపోయారు.

కాల్వల్లేక పారుతున్న మురుగు
జయపూర్‌లోని పటేల్‌ బస్తీలో వర్షం పడితే కాదు.. మామూలు పరిస్థితుల్లోనూ అవస్థలే. బురదగా మారిపోతున్నది. ఇటీవల కురిసిన భారీవర్షాలతో పటేల్‌ బస్తీ పడుతున్న ఇబ్బందులెన్నో. జయపూర్‌లో సరైన డ్రెయిన్‌ వ్యవస్థలేక మురుగునీటి కష్టాలు తప్పటంలేదని ప్రదీప్‌ కుమార్‌చెప్పాడు. ”మేం నరకంలో జీవిస్తున్నాం. చిన్న మనుషులం.. సార్‌! మాకు అడిగే హక్కు లేదు. డబ్బు ఉన్నవారికి మాత్రమే ప్రభుత్వసేవలు దక్కుతున్నాయి’ అని వాపోయాడు.

నిరూపయోగంగా సోలార్‌ స్పిన్నింగ్‌ వీల్‌
ప్రభుత్వం ఏర్పాటు చేసిన సోలార్‌ చర్ఖా నిరూపయోగంగా పడివున్నది. వస్త్రాల తయారీతో ఉపాధి చేసుకుందామనుకున్న మహిళలకు ఏం చేయాలో తోచటంలేదు. ఒక గ్రూపు కింద ఏర్పాటుచేసుకున్న స్పిన్నింగ్‌ వీల్‌ కోసం వేలాది రూపాయల బ్యాంకురుణం ఇప్పించారు. చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే రుణాలకోసం బ్యాంకర్లు బలవంతం చేస్తున్నారని ప్రమీల అనే మహిళ వాపోయింది.

అధ్వాన్నస్థితిలో సోలార్‌ చర్ఖా.. ట్రైనింగ్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌
పేద మహిళలను స్వావలంబన కోసం జయపూర్‌లో రెండు చేనేత కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక కేంద్రాన్ని ఖాదీ గ్రామ పరిశ్రమల శాఖ నిర్వహిస్తుంది. మరొకటి గ్రామంలో నిచ్చాడం వద్ద స్థాపించిన గోశాలలో నడుస్తుంది. ఇక్కడ, ముద్ర రుణ పథకం కింద, భారతీ గ్రీన్‌ ఖాదీ సంస్థ ద్వారా, నూట యాభై మంది మహిళలకు సోలార్‌ చర్ఖా పంపిణీచేశారు. మహిళా సాధికారత ప్రచారం కింద యోగి సర్కార్‌ మహిళలను స్వయం ఆధారితంగా మార్చాలని కోరుకుంటున్నట్టు ప్రారంభంలో ప్రచారం చేసుకున్నది. కానీ ఇపుడు స్వావలంబన కలగామారిందని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

జీతాలు కూడా రావటంలేదు…
జయపూర్‌లో ప్రారంభించిన గోసంరక్షణకు ఆదర్శ్‌ భారతి కౌశల అని పేరు పెట్టారు. మేఖూర్‌ సింగ్‌ భూమిని ముప్పై సంవత్సరాల పాటు లీజుకు తీసుకున్నారు. సంవత్సరానికి ముప్పై వేల రూపాయల చొప్పున.. గ్రామంలోని కొందరు వ్యక్తులు గోశాలలో తమ పశువులను కట్టి ఉంచుతారు. కౌశల పక్కన సోలార్‌ చర్ఖా ట్రైనింగ్‌, ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ఉన్నది. ఒక గదిలో 24, మరొక గదిలో 15 సోలార్‌ చర్ఖాలు ఉన్నాయి. శిక్షణ సమయంలో జయపూర్‌ మహిళలు తయారు చేసిన నూలు గోడౌన్‌లో కుళ్లిపోతున్నది. ”ఆవుల పెంపకం, నూలు తిప్పడానికి యంత్రాలను ఏర్పాటు చేసిన వ్యక్తులు చాలాకాలంగా కనిపించకుండా పోయారు. జీతం కూడా రావటంలేదు” అని అక్కడి గార్డ్‌ మూల్‌చంద్‌ తన బాధను చెప్పుకున్నాడు. మరోవైపు కరెంట్‌ బిల్లులు బకాయి ఉన్నాయంటూ విద్యుత్‌ సరఫరా నిలిపేశారు.అలానే జయపూర్‌లో స్వచ్ఛ భారత్‌ కింద.. గ్రామాభివృద్ధికి ఏర్పాటుచేసిన మరుగుదొడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. ఇక నాగేపూర్‌ ప్రాథమిక పాఠశాలల రూపురేఖల్లేకుండా మారిపోయాయి. నిత్యం మురుగునీరు ప్రవహిస్తుండటంతో.. ప్రధాని మోడీ పేరిట ఏర్పాటు చేసిన బెంచీలు కూడా అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. ప్రధాని దత్తత తీసుకున్న గ్రామం పరిస్థితి ఇలా ఉంటే… మిగతా ప్రాంతాల సంగతేంటనీ స్థానికుడైన ప్రదీప్‌ అంటున్నాడు. ఇక చాలు.. మోడీ వెంట పరుగెత్తవద్దు..బంగారు కలలు కనటం మానండి… అంటూ ఆవేదన వ్యక్తంచేశారు.

Courtesy Nava Telangana

Leave a Reply