కార్పొరేట్లకు అండ..!

0
290

-పర్యావరణ చట్టానికి మోడీ సర్కార్‌ తూట్లు
-‘కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత’ నిర్వచనాన్ని మారుస్తూ ముసాయిదా బిల్లు
– బడాబాబులకు అనుకూలంగా నిర్మాణరంగ నిబంధనలు
– రియల్‌ ఎస్టేట్‌ లాబీకి తలొగ్గిన బీజేపీ ప్రభుత్వం : రాజకీయ విశ్లేషకులు

న్యూఢిల్లీ : దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఏలుతున్న బడా కార్పొరేట్ల డిమాండ్లకు మోడీ సర్కార్‌ తలొగ్గిందా? కార్పొరేట్ల లాబీకి అనుకూలించే విధంగా ‘నూతన పర్యావరణ చట్టం’ ముసాయిదా బిల్లును కేంద్రం సిద్ధం చేసిందా? కచ్చితంగా నెరవేర్చాల్సిన ‘కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత’ (సీఈఆర్‌) మార్గదర్శకాల్ని కేంద్రం మారుస్తున్నదా?…అంటే ఢిల్లీ రాజకీయ వర్గాలు అవుననే చెబుతున్నాయి. నిర్మాణరంగంలో ఏదైనా భారీ ప్రాజెక్ట్‌ను చేపట్టినప్పుడు పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ప్రజలకు, పర్యావరణనానికి నష్టం జరగకుండా ప్రాజెక్ట్‌ను కట్టాలి. అది ఆ నిర్మాణరంగ సంస్థ (కార్పొరేట్‌ కంపెనీ) కనీస బాధ్యత.

ప్రాజెక్ట్‌ వల్ల…ఒకవేళ ప్రజలకు ఏదైనా నష్టం జరిగితే.. ఆమేరకు పరిహారం చెల్లించాలి. పర్యావరణానికి నష్టం జరిగితే.. ఆమేరకు ‘బాధ్యత’గా కొన్ని నిబంధనలు పాటించాలి. అయితే మోడీ సర్కార్‌ ఈ విధివిధానాల్లో కీలక మార్పులు చేస్తూ ‘నూతన పర్యావరణ చట్టం’ ముసాయిదా బిల్లు రూపొందించనట్టు తెలుసు ్తన్నది. అత్యంత కీలకమైన ‘కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత’ (సీఈఆర్‌) నిర్వచనాన్ని, అందులోని మార్గదర్శకాల్ని మారుస్తూ ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. వీటిపై పర్యావరణ శాఖలోని ఉన్నతాధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ లెక్కచేయలేదని తెలిసింది. పర్యావరణ శాఖ వెబ్‌సైట్‌లో ముసాయిదా బిల్లు అంశాల నోటిఫికేషన్‌ను విడుదలచేయటం, లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించటం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి జాతీయ ఆంగ్ల మీడియాలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇందులో పేర్కొన్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

కాగితాలకే పరిమితం..
‘ఎన్విరాన్మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ నోటిఫికేషన్‌-2020’ పేరుతో కేంద్రం ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. దీంట్లో పేర్కొన్న వాటిపై పర్యావరణ నిపుణులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్‌ను అనుమతించే ముందు నిర్మాణరంగ సంస్థ ‘ఎన్విరాన్‌మెంట్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌’ను పర్యావరణశాఖకు అందజేయాలి. సంబంధిత అనుమతులు తీసు కోవాలి. ముసాయిదా బిల్లులో చేసిన మార్పుల ప్రకారం, ఇకపై అదంతా కాగితాలకే పరిమితం కానుంది. నిబంధనల్లో అనేకచోట్ల సందిగ్ధతకు అవకాశం ఇచ్చారు. ఇది కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా మారనున్నది. ఒక ప్రాజెక్ట్‌లో పర్యావరణ, సామాజిక బాధ్యత కింద తప్పనిసరిగా చేయాల్సిన వ్యయం నుంచి కార్పొరేట్లను తప్పించారు. సీఈఆర్‌ గైడ్‌లైన్స్‌ మార్చాలని ఎంతోకాలంగా కోరుతున్న రియల్‌ ఎస్టేట్‌ లాబీకి కేంద్రం తలొగ్గింది.
లెక్కలు చూపాల్సిన అవసరం లేదు

ఇప్పటివరకూ చెప్పుకుంటూ వస్తున్న పర్యావరణ ఉల్లంఘనల నిర్వచనాలు మారబోతున్నాయి. ఉదాహరణకు, ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లో…’పర్యావరణ నిర్వహణ ప్లాన్‌’ (ఈఎంపీ) ఖర్చులు, కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యత (సీఈఆర్‌) ఖర్చులు వేరు వేరుగా చూపాలి. ఇందులో చెప్పిన విధంగా నిర్మాణసంస్థ వ్యయం చేసిందా? లేదా? అన్నది జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారి తర్వాత నిర్థారణ చేస్తారు . ముసాయిదా బిల్లు ప్రకారం, ఈఎంపీ, సీఈఆర్‌…కలగలపి చూపొచ్చు. పర్యావరణం, ప్రజా ఆరోగ్యం దెబ్బతింటే (సీఈఆర్‌) దానికి బాధ్యతగా ఏం చేశారు? అన్నది తెలుసుకునే అవకాశం పోతుంది. నిర్మాణరంగ సంస్థలు లాభార్జన కోసం ‘ఈఎంపీ’ కింద చేసిన ఖర్చుల్ని….సీఈఆర్‌ ఖర్చులుగా చూపే అవకాశముంది.

ఒక ప్రాజెక్ట్‌ చేపట్టినప్పుడు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, వర్షం నీరు, ఇంకుడు గుంతలు, భూసారాన్ని కాపాడటం, సామాజిక సంక్షేమ నిబంధనలు…ఇవన్నీ కార్పొరేట్‌ పర్యావరణ బాధ్యతగా నిర్మాణరంగ సంస్థ నెరవేర్చాలి. వాటిపై చేసిన వ్యయాన్ని పక్కాగా చూపాలి. దీనికి జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారి ఓకే చేయాలి. ఈ నిబంధనల్ని నీరుగారుస్తూ నూతన పర్యావరణ చట్టం, ముసాయిదా బిల్లును కేంద్రం సిద్ధం చేసింది. తద్వారా ప్రాజెక్ట్‌ వివరాల్ని ఇకపై ఇష్టమొచ్చినట్టు రూపొందించి కార్పొరేట్‌ సంస్థలు అనుమతులు పొందే అవకాశం ఏర్పడుతున్నది. తద్వారా పర్యావరణం, ప్రజా ఆరోగ్యంపై రాజీపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply