అచ్ఛే దిన్‌ కాదు.. చచ్చే దిన్‌…!!

0
230
* మహిళలపై హద్దుమీరిన అఘాయిత్యాలు

* దళితులు, ఆదివాసీలపైనా పెరిగిన దాడులు

న్యూఢిల్లీ : ఆరేళ్ల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడీ తన పాలనలో దేశ ప్రజలకు మంచి రోజులు (అచ్చే దిన్‌) వస్తాయంటూ ఊదరగొట్టారు. అయితే అచ్చే దిన్‌ మాటేమో కానీ, ప్రభుత్వ విధానాలు, ఉదాసీనతతో తమకు చచ్చే (రోజులు) దిన్‌ వస్తున్నాయని ప్రజలు వాపో తున్నారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరాల జాప్యంతో జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) విడుదల చేసిన తాజా గణాంకాలు పరిశీలిస్తే ఈ ఆవేదన అక్షర సత్యమనిపించక మానదు. 2017 నాటి నేర గణాంకాలను మంగళవారం ఇక్కడ విడుదల చేసింది. 2014లో నరేంద్రమోడీ సర్కారు అధికార పగ్గాలుచేపట్టే ముందు రోజు వరకూ 2013 నాటి గణాంకాలతో పోలిస్తే మహిళలు, దళితులు, ఆదివాసీలపై నేరాల సంఖ్య 16 శాతానికి పైగా పెరిగినట్లు తెలుస్తోంది.

ప్రతి ఒకటిన్నర నిముషానికీ ఒక మహిళ పై దాడి
2017లో మహిళలపై జరిగిన దాడుల విషయంలో నమోదయిన కేసుల సంఖ్య 3.59 లక్షలు. అంటే సంవ త్సరం మొత్తం ప్రతి రోజూ ప్రతి ఒక్కటిన్నర నిముషానికీ ఒక మహిళపై దాడి జరుగుతోందని తెలుస్తోంది. 2013 లో నమోదయిన ఈ నేరాల సంఖ్య 3.09 లక్షలు మాత్రమే. మహిళలు ఇంటి నాలుగు గోడల మధ్య వుంటూ కుటుంబం ఆలనాపాలనా చూసుకోవాలంటూ పాలకపక్షం, దాని సైద్ధాంతిక మాతృక రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఫ్‌ు (ఆరెస్సెస్‌) అనుసరిస్తున్న తిరోగమన దృక్పథం మహిళలపై నేరాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లే మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించాలంటూ సంఫ్‌ుపరివార్‌ శక్తులు డిమాండ్‌ చేసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు అధికార బిజెపికి చెందిన ఒక ఎంపి హిందూ మహిళలు అధికసంఖ్యలో పిల్లల్ని కనాలంటూ ‘హుకుం’ కూడా జారీ చేసేశారు. మధ్య యుగం నాటి విలువలకు సంబంధించిన విస్తృత ప్రచారం, అహంకారపూరిత వైఖరి, ఇతర మతాలకు చెందిన వారి పట్ల విద్వేషం వంటి అంశాలు మహిళల భద్రతపై ఆందోళన పెరుగుదలకు దారి తీస్తున్నాయి. ఇటువంటి ఆలోచనా ధోరణి న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తోంది. వరకట్నాన్ని డిమాండ్‌ చేస్తూ భర్త, అత్తింటి వారు పెట్టే ఆరళ్లకు వ్యతిరేకంగా కఠిన శిక్షలను ప్రతిపాదిస్తున్న ఐపిసి 498ఎ సెక్షన్‌ను నిర్వీర్యం చేస్తూ సుప్రీంకోర్టు 2017లో వెలువరించిన తీర్పు ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. భర్త, అత్తమామల వరకట్న వేధింపులతో అర్ధంతరంగా ఉసురు తీసుకుంటున్న యువ, నవ వధువుల సంఖ్య ప్రపంచం మొత్తంలో భారత్‌లోనే అత్యధికం. వరకట్న వేధింపులకు 2017లో దేశం మొత్తమ్మీద 7,838 మంది యువతులు బలయ్యారన్న వాస్తవాన్ని ఎన్‌సిఆర్‌బి తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి కేసుల్లో దోషులకు విధించే కఠిన శిక్షల రేటు పెరగకపోవటం ఈ అంశంలో కలవరపరుస్తున్న మరో కోణం. 2013లో మహిళలపై నేరాలకు పాల్పడినవారికి విధించిన శిక్షల రేటు 21.3 శాతం కాగా, 2017లో ఇది స్వల్పంగా పెరిగి 24.6 శాతానికి చేరుకుంది. మహిళల భద్రత గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ వారిపై నేరాలకు పాల్పడే వారికి శిక్షలు విధించే అంశం వేగం పుంజుకోవటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇటువంటి కేసుల్లో ప్రతి నలుగురు నిందితుల్లో కేవలం ఒకరికి మాత్రమే కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నాయి. పోలీసింగ్‌ను మెరుగుపర్చటంతో పాటు ప్రభుత్వం మెరుగుపర్చాల్సిన అంశాలలో ఇది కూడా ఒకటని పరిశీలకులు చెబుతున్నారు. శిక్షలు విధించే వేగం తక్కువ స్థాయిలో వుంటుండటంతో నేరస్తులకు భయం లేకుండా పోతోందన్నది అక్షర సత్యం.

దళితులు, ఆదివాసీలపై దాడులు
ఎన్‌సిఆర్‌బి తాజా గణాంకాలలో దిగ్భ్రాంతి కలిగించే మరో అంశం దళితులు, ఆదివాసీలపై కొనసాగుతున్న దాడులు.. వాస్తవానికి మోడీ పాలనలో ఇది నానాటికీ పెరుగుతోంది. దళితులపై దాడులకు పాల్పడిన నేరాలకు సంబంధించి.2017లో దేశవ్యాప్తంగా వివిధ చట్టాల పరిధిలో 43,203 కేసులను పోలీసులు నమోదు చేశారు. 2014లో మోడీ పాలనా పగ్గాలను చేపట్టటానికి ముందు 2013లో నమోదయిన నేరాలసంఖ్య కంటే ఇది 10 శాతం ఎక్కువ. అదే విధంగా ఆదివాసీలపై జరిగిన నేరాల విషయంలో నమోదయిన కేసుల సంఖ్య 2013లో 6,793 కాగా, 2017లో ఇది మరికొంత పెరిగి 7,125కు చేరింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే 2014 తరువాతే దళితులు, ఆదివాసీలపై దాడుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ నేరాల అంశాన్నే బిజెపి, సంఫ్‌ు పరివార్‌లు విస్తృతంగా ప్రచారం చేసి నాటి ఎన్ని కల్లో విజయం సాధించాయన్నది నిర్వివాదాంశం. నాటి ఎన్నికల ప్రచారంలో దళితులు, ఆదివాసీల వంటి బడుగు వర్గాలపై అనుసరిస్తున్న అణచివేత చర్యలే ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే బిజెపి విజయం సాధించిన తరువాత అగ్రవర్ణాలకు చెందిన దాని మద్దతుదారుల్లో ఒక విధమైన ఉన్మాదం ఆవహించింది. ఫలితంగానే ఈ దాడులు పెరిగాయన్నది నిష్టుర సత్యం. ఎస్సీ, ఎస్టీ వేధిం పుల నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు పాలక బిజెపి సానుకూలంగా వుందన్న విషయాన్ని 2014 ఎన్నికల తరువాత చోటు చేసుకున్న అనేక ఘటనలు నిర్ధారిం చాయి. ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ 2018లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై దేశవ్యాప్తంగా వున్న ప్రగతిశీల శక్తులు విస్తృత స్థాయిలో నిరసన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ చట్టాన్ని పరిరక్షించుకునే విషయంలో కానీ, న్యాయపాలిక వెలువరించిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయటంలో కానీ బిజెపి సర్కారు ఘోరంగా విఫలమైంది. తీర్పు విషయంలో భారీయెత్తున నిరసనలు వ్యక్తమైన తరువాత మాత్రమే కేంద్రం ఆర్డినెన్స్‌ ద్వారా ఈ చట్టాన్ని కాపాడేందుకు ప్రయత్నించింది. వాస్తవానికి ఎన్‌సిఆర్‌బి వెల్లడించిన 2017 నాటి నేర గణాంకాల కన్నా నమోదు కాని నేరాల సంఖ్య ఎక్కువగా వుంటుందని చెప్పవచ్చు. ఎన్‌సిఆర్‌బి అంచనాలన్నీ వాస్తవదూరమైనవే.. పితృస్వామ్య, అగ్రకుల సైద్ధాంతిక పాలకులు అధికారంలో వుండి శాంతి భద్రతల యంత్రాంగాన్ని తమ కనుసన్నల్లో శాసించటమే ఇందుకు ప్రధాన కారణమన్నది సుస్పష్టం.

Courtesy Prajashakti.

Leave a Reply