కట్టు కథలు, కర్కశాల నిజ రూపం బహిర్గతం

0
239
తెలకపల్లి రవి

హత్రాస్‌లో దళిత అమ్మాయిపై అమానుష అత్యాచారం కప్పిపుచ్చడం కోసం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సాగించిన ఘోర ప్రచారాలు పటాపంచలైనారు. రాత్రికి రాత్రి బలవంతంగా శవ దహనం చేసి, అత్యాచారమే జరగలేదని అబద్ధాలు ప్రచారంలో పెట్టిన తీరు సిబిఐ తాజా అభియోగాలతో తేలిపోయింది. సోషల్‌ మీడియా కుసంస్కారులు, క్లిష్ట సమయంలో పరివార్‌ ప్రచారాలలో కొట్టుకు పోయే గోడ మీద పిల్లులు, పత్రికల లోనూ తెలివిగా తిప్పితిప్పి తప్పులు కప్పిపుచ్చి రాసే కలంసేవకులు చెంపలేసుకుంటారా మరి ?

ప్రధాని నరేంద్ర మోడీ మూడు వందలకు పైగా స్థానాలతో రెండవసారి అధికారం లోకి వచ్చాక బిజెపి కి ఇక తిరుగు వుండదనే ప్రచారం మోత మోగింది. కాంగ్రెస్‌ ఊహాతీతంగా బలహీనమైపోవడం, ప్రాంతీయ పార్టీలలో చాలా భాగం మోడీకి లోబడిపోవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. జాతీయ మీడియా, సోషల్‌ మీడియా మాత్రమే గాక తెలుగు మీడియా లోనూ ప్రధానమైన చాలా పత్రికలు ఇందుకు వంత పాడాయి. ప్రాంతీయంగా వైసిపి, టిడిపి మధ్య విభజన తప్ప బిజెపి భజన విషయంలో వాటికి పెద్ద తేడా లేకపోవడం ఇందుకు కారణమైంది. తమ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీలూ వాటిని బలపర్చే మీడియా, సోషల్‌ మీడియాలు కూడా జాతీయ కోణం గాలికి వదిలి బిజెపి కి అవతలివారు దూరమైనారని చూపించడానికే పాకులాడాయి. ఈ క్రమంలో వారి మత ప్రచారాలను కూడా భుజాన మోశాయి. రెండవసారి వచ్చాక వరుసగా అనేక విషయాలలో రాజకీయంగా నైతికంగా ఉద్యమాల పరంగా కూడా బిజెపి ఎదురు దెబ్బలు తింటూ వచ్చినా ఆ అంశాలకు చోటు ఇవ్వకుండా మోడీకి సానుకూల చిత్రణనే కొనసాగించాయి.

ఇప్పుడు రైతుల ఆందోళనతో చేతులు జోడించి చర్చలకు ఆహ్వానిస్తున్నానంటూ నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తుంటే ఈ ఏకపక్ష ప్రచార ప్రహసనం ఆపక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజధానిని చుట్టుముట్టిన రైతుల పోరాటం ముందుకు తెచ్చిన సంఘర్షణ వాస్తవంలో మోడీ సర్కారు కాషాయ కార్పొరేట్‌ కషాయం నషాళానికి అంటిన పరిణామమే తప్ప యాదృచ్ఛికం కాదు. విశేషమేమంటే సరిగ్గా ఈ సమయంలోనే బిజెపి కి వంత పాడిన మీడియా సోషల్‌ మీడియా వర్గాలు సంఘ పరివార్‌ ప్రచారాల బండారం కూడా బహిర్గతమైంది. ఈ కాలంలోనే ఉద్వేగాలు పెంచడం కోసం ముందుకు తెచ్చిన భారత్‌-చైనా ఉద్రిక్తతల అంశం కూడా అనుకున్న ప్రభావం చూపలేకపోయింది. ఈ దెబ్బల తర్వాత బిజెపి నాయకత్వం, సంఘ పరివార్‌ కొత్తగా ఏ ఎత్తుగడలు చేపడతారనేది ఒకటైతే…ఇన్ని విధాల శృంగభంగం కలిగిన వైనాన్ని దాచిపెడుతున్న తీరు మరింత విడ్డూరమైంది.

కాశ్మీర్‌ టు కరోనా
కొత్త ప్రభుత్వం రాగానే ముందుగా చర్చ లేకుండా నిగూఢంగా కాశ్మీర్‌ 370 రద్దు, విభజన రాష్ట్ర ప్రతిపత్తి రద్దు అంశాలు రుద్దారు. దానిపై అనేక కట్టుకథలు ప్రచారంలో పెట్టారు. అన్ని పార్టీల నాయకులనూ నిర్బంధించారు. జాతీయ స్రవంతి లోకి తీసుకొచ్చామని, ఇక అక్కడ పెట్టుబడులు ప్రవాహం తథ్యమని చెప్పారు. సమాచార సంబంధాలను నిలిపేయడమే గాక సెన్సార్‌ కూడా పెట్టారు. సంపాదకులే కాల్చివేయబడ్డారు. కాశ్మీర్‌ ప్రతిపత్తిపై కేంద్ర శాసనాల చెల్లుబాటును సవాలు చేసే పిటిషన్లను సుప్రీం కోర్టు వేగంగా చర్చకు స్వీకరించకపోయినా ఈ నిర్బంధ చర్యలను, నిరంకుశ ఆంక్షలను ప్రశ్నించక తప్పలేదు. ఇంటర్‌నెట్‌ పునరుద్ధరణ వంటివీ కొంతవరకైనా ఒప్పుకోవాల్సి వచ్చింది. నాయకులనూ విడుదల చేయవలసి వచ్చింది. అక్కడి మాజీ పాలక ప్రాంతీయ పక్షాలూ, సిపిఎం వంటివి కలిసి ‘గుప్కార్‌ డిక్లరేషన్‌’ పేరిట సమిష్టి పోరాటాన్ని ప్రారంభిస్తే ప్రభుత్వ దుష్ప్రచారాలు నిలవలేదు. తీవ్రవాద చర్యలు కూడా పెరగడం కేంద్ర వైఫల్యం స్పష్టమైంది.

2020 ప్రారంభం నుంచి కరోనా చుట్టుముట్టింది. మొదటి దశలోనే తగు చర్యలు తీసుకోకపోగా మోడీ ప్రభుత్వం తక్కువ అంచనా వేసింది. ఏవో తాడూ బొంగరం లేని చిట్కాలు ప్రచారంలో పెట్టింది. దానిపై మోడీ ప్రసంగాలు, ప్రచారాలు తంతుగా మారాయి. చప్పట్లు కొట్టడం, దీపాలు పెట్టడం, సరైన సన్నాహాలు లేని లాక్‌డౌన్లు ఘోర దుస్థితికి దారితీశాయి. వలస వేదనలు, శ్రమజీవుల దురవస్థ, ఆర్థిక దిగజారుడు వంటివి ఇప్పుడు ఏకరువు పెట్టనవసరం లేదు. రాష్ట్రాల ఆదాయం పడిపోగా సహాయం చేయడానికి కేంద్రం ముందుకు రాలేదు. మూడు నాలుగు ప్రసంగాలు, వీడియో సమావేశాల తర్వాత మోడీ విన్యాసాలు ఆగిపోయాయి. మృతుల సంఖ్య లక్షన్నరకు చేరింది. ఇప్పటికీ రెండవ విడతపై ఆందోళన వుంది. వ్యాక్సిన్‌ తయారీ దిగుమతి సందేహాస్పదంగా తయారైనాయి. ఆఖరుకు దాన్ని కూడా జిహెచ్‌ఎంసి ఎన్నికలతో ముడిపెట్టి ఆ సమయంలో దిగిపోవడం అందరూ గమనించారు. ఇప్పటికీ కరోనా వ్యాక్సిన్‌ ఎంత వస్తుంది? ఏ విధంగా సరఫరా అవుతుంది? అందుబాటు ఏమిటి అర్ధం కాని స్థితి.

 తబ్లీగీ జమాత్‌, చైనా వైరస్‌
కరోనా వ్యాప్తి కంటే అది ఎందువల్ల వచ్చిందనేదాని పైనా మోడీ సర్కారు సంఘ పరివార్‌ సాయంతో చాలా ప్రచారాలు చేసింది. ఆ సమయంలోనే చైనాతో సరిహద్దు వివాదం ముందుకు తేవడం ఒకటైతే వైరస్‌ కూడా అక్కడి నుంచి వచ్చిందన్నట్టు సోషల్‌ మీడియాలో సాగించిన ప్రచారాలు మరొకటి. అప్రతిష్టపాలై ఓటమి చవిచూసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తోడుగా ఈ తతంగం నడిచింది. దేశ రక్షణ సరిహద్దుల భద్రత ఒకటైతే దాన్ని దేశీయ రాజకీయాలతో కలగాపులగం చేయడం కపటం మాత్రమే. తీరా ఇప్పటి వరకూ ఈ ప్రచారాలేవీ నిలవకపోగా చైనాతో చర్చలు నడుస్తూనే వున్నాయి.

నిజాముద్దీన్‌ బర్కత్‌, తబ్లీగీ జమాత్‌ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోకపోవడం నష్టం కలిగించిన మాట నిజమైనా దాన్ని అనుమతించడం, సాగనివ్వడం, కేంద్రం కనుసన్నల్లోనే జరిగింది. కాని కరోనా వ్యాప్తి మొత్తానికి అదే కారణమైనట్టు కథలు వదలి వెంటాడటం, లౌకిక శక్తుల పైనా దుష్ప్రచారం చేయడం మర్చిపోలేము. ఈ విషయం లోనూ సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఇలాంటి బాధ్యతా రహితమైన ప్రచారాలు ఎలా అనుమతించారని అఫిడవిట్‌ కోరింది. ఇప్పటికీ కేంద్రం సరైన సమాధానం ఇచ్చింది లేదు. తాజాగా తబ్లీగీ పేరిట అరెస్టు చేసిన 36 మంది విదేశీయులను న్యాయస్థానాలు విడుదల చేశాయి. వేర్వేరు చోట్ల వారిని పట్టుకుని ఈ కేసులో ఇరికించినందుకు మందలించాయి.

ఆర్ణబ్‌ భాగోతం
దీంతోపాటుగానే రిపబ్లిక్‌ టీవీ ఆర్ణబ్‌ గోస్వామి భాగోతం కూడా తేలిపోయింది. తబ్లీగీ ప్రచారాలతో పాటు వలస కార్మికుల పైనా ఆర్నాబ్‌ భారీ డిబేట్లతో గగ్గోలు పెట్టారు. మత విద్వేషాలు ఎగదోశారు. మహారాష్ట్రలో ఇద్దరు సాధువేషధారులను పిల్లల దొంగతనం వాతావరణంలో స్థానికులు హతమారిస్తే దానికి రాజకీయ రంగు పులిమారు. చైనా-ఇండియా సమస్య లోనూ సహేతుక చర్చల మార్గాన్ని గాక ఉద్వేగాలు రెచ్చగొట్గే ప్రచారాలు చేశారు. చివరకు ఈ విద్వేష ప్రచారకుడే టిఆర్‌పిల కుంభకోణంలోనూ చిక్కిపోయారు. మరో ఆత్మహత్య ప్రేరణ కేసులో అరెస్టయ్యారు. వెంటనే ఆయనను హోం మంత్రి అమిత్‌షాతో సహా భుజాన మోసినా అరెస్టు తప్పలేదు. తర్వాత సుప్రీం కోర్టు జోక్యంతో బెయిలుపై విడుదలైనా తనొక్కడిపై ప్రత్యేక శ్రద్ధ ఏమిటని సుప్రీం కూడా విమర్శకు గురైంది. ఆర్నాబ్‌ వంటి లోకల్‌ ఆర్నాబ్‌లు తెలుగు ప్రాంతం లోనూ వున్నారు. ఈ సైన్యం సహాయంతో సంఘ పరివార్‌ సాగించిన ప్రచార కాండ దేశానికి తెలిసిపోయింది.

హత్రాస్‌ హత్యాచారం…
ఈ సమయంలోనే ఫేస్‌బుక్‌, గూగుల్‌, వాట్సప్‌లు కూడా బిజెపి పట్ల పక్షపాతం చూపినట్టు అమెరికా ఎన్నికల ప్రచారంలో బయటకి వచ్చింది. పార్లమెంటరీ సంఘాలు అభిశంసించాయి. ఇది కేవలం బిజెపి నేతలకే గాక ఆ ప్రచారాల ప్రభావంతో ఆ సమయంలో దారితప్పిన బుద్ధిశాలులందరికీ కూడా గుణపాఠం. ట్రెండింగ్‌ పేరిట అప్పటి బాణీనే వినిపించిన వారందరికీ చెంపపెట్టు.

హత్రాస్‌లో దళిత అమ్మాయిపై అమానుష అత్యాచారం కప్పిపుచ్చడం కోసం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం సాగించిన ఘోర ప్రచారాలు పటాపంచలైనారు. రాత్రికి రాత్రి బలవంతంగా శవ దహనం చేసి, అత్యాచారమే జరగలేదని అబద్ధాలు ప్రచారంలో పెట్టిన తీరు సిబిఐ తాజా అభియోగాలతో తేలిపోయింది. సోషల్‌ మీడియా కుసంస్కారులు, క్లిష్ట సమయంలో పరివార్‌ ప్రచారాలలో కొట్టుకుపోయే గోడ మీద పిల్లులు, పత్రికల లోనూ తెలివిగా తిప్పితిప్పి తప్పులు కప్పిపుచ్చి రాసే కలంసేవకులు చెంపలేసుకుంటారా మరి? ఫాసిస్టు తరహా సంస్థల ప్రచార ఎత్తుగడలు, వదంతులు ఎలా వుంటాయో తెలుసుకుంటే ఇలాంటి గందరగోళాలకు ఆస్కారం వుండదు.

కేరళలో కేకలు, కకావికలు
ఏదైనా మోడీకి, బిజెపి కి వ్యతిరేకంగా మారుతుందంటే తప్పు ఫోటోలు పెట్టడం…కమ్యూనిస్టులకు, రాజకీయ వ్యతిరేకులకు లేనిపోనివి ఆపాదించడం వంటివి మరెన్ని ఉదాహరణలో! చాలా రాష్ట్రాలలో దెబ్బ తింటున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలదోసినా రాజస్థాన్‌లో అదీ సాధ్యం కాలేదు (ఇప్పటికి). అక్కడ స్థానిక ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయారు. బీహార్‌లో చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది. కేరళలో కరోనాను విజయవంతంగా నిరోధించిన పినరయి విజయన్‌ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి నానా దుష్ప్రచారాలకు పాల్పడ్డారు. ఎక్కడో ఏనుగును చంపేస్తే దేశమంతటా ట్వీట్లు పెట్టించారు. యుఎఇ రాయబార కార్యాలయం మాజీ ఉద్యోగిని అవినీతిపరుల సాయంతో బంగారం స్మగ్లింగ్‌ జరిగితే విమానాశ్రయాలు నడిపే కేంద్రాన్ని వదలి రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ఇరికించే పథకాలు పన్నారు. లీకులు ఇచ్చారు. శబరిమల నుంచి స్మగ్లింగ్‌ పురాణం వరకూ బిజెపి ఇన్ని విధాల విష ప్రచారాలు చేసినా కేరళ స్థానిక ఎన్నికలలో సిపిఎం విజయభేరి మోగించింది. జిహెచ్‌ఎంసిలో మత ప్రచారాలతో సీట్లు పెంచుకున్న బిజెపి త్రివేండ్రంలో వున్న స్థానాలు నిలబెట్టుకోలేకపోయింది. బిజెపిపై పోరాడటం కన్నా ఎల్‌డిఎఫ్‌ ను దెబ్బ తీయడమే ముఖ్యమన్నట్టు వ్యవహరించిన కాంగ్రెస్‌కూ ఘోర ఓటమి తప్పలేదు.

తెలుగునాట అదే పాట..
తెలుగునాట ప్రాంతీయ పార్టీలకు ఈ జాతీయ ప్రకంపనాలు పట్టవు, వారి మీడియా సేనలు ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప మతతత్వ రాజకీయాలను ఎదుర్కొనవు. ఆ పార్టీల అధినేతలు బిజెపి మెప్పుకోసం పాకులాటలో పోటీ పడుతుంటారు మరి! మన మీడియా స్వభావం దృష్ట్యా వీటిని గుదిగూర్చి చెప్పాల్సి వచ్చింది తప్ప మతతత్వ రాజకీయాల ముప్పును తక్కువ చేయడానికి కాదు. హైదరాబాదులో భాగ్యలక్ష్మి ఆలయం కాళీ మాత భూముల పేరిట, ఎ.పి లో ఆలయాల పరిరక్షణ పేరిట ఏకకాలంలో నడుపుతున్న బిజెపి మత రాజకీయాలు కళ్ల ముందు కనిపిస్తూనే వున్నాయి. రైతాంగ ఆందోళనతో ఇరకాటంలో పడ్డ కేంద్రం వివిధ కోణాలలో ఎదుర్కొంటున్న ఈ దురవస్థను కప్పి పుచ్చి మతం చిచ్చు పెట్టే పథకాలే ఇవన్నీ. అమరావతి వేదిక పైనా ఈ కాపట్యం కానవచ్చింది. ఎక్కడికక్కడ బిజెపి బండారం బహిర్గతమవుతున్న తీరును గమనిస్తే వీటినీ ఎలా తోసిపుచ్చాలో అర్ధమవుతుంది.

Courtesy Prajashakti

Leave a Reply