మోడీ మాటలకు అర్థాలే వేరులే..

0
159
  • కార్పొరేట్ల చేతిలో రిమోట్‌లా దేశం..
  • దిగజారుతున్న ఆర్థిక ప్రగతి..మత రాజకీయాలే బీజేపీ ఎజెండా
  • కార్పొరేట్ల చేతిలో రిమోట్‌లా దేశం..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అమలుచేస్తోంది. కార్పొరేట్లకు అనుకూలంగా సాగు చట్టాలు తేవటం..సంపన్నులకు మేలు జరిగేలా పార్లమెంట్‌లో మందబలంతో.. చట్టాలకు ఆమోదముద్రవేయించుకోవటం లాంటి ఎన్నో అంశాలపై దుందుడుకుగా వ్యహరించింది. కరోనా విజృంభిస్తున్నా..మరణాలు సంభవిస్తున్నా.. ఐదు రాష్ట్రాల ఎన్నికలవైపే ప్రధాని మోడీ దృష్టిపెట్టారు. తదనంతరం జరిగిన నష్టం..ఘోరం అనంతరం. దేశం ఆర్థికంగా దివాలా తీస్తున్నదని నోబెల్‌ గ్రహీతలైన అమర్తసేన్‌, అభిజిత్‌ బెనర్జీ లాంటి మేధావులు చెప్పినా..బీజేపీ ప్రభుత్వం లెక్కచేయలేదు. దేశవ్యాప్తంగా ఆందోళనలు,నిరసనల హౌరు పుట్టించారు. ఏడాదినుంచి అన్నదాతలు ఉద్యమిస్తే..వారి ప్రాణాలు తీయటానికి బీజేపీ నేతలు వెనకాడలేదు. చివరికి ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రైతులపై బలవంతంగా రుద్దిన సాగు చట్టాలను వెనక్కి తీసుకోక తప్పలేదు.మరోవైపు మత భావాలను రెచ్చగొడుతూ ప్రజలను చీలుస్తున్నది.

ఉన్నతవిద్య ప్రయివేటీకరణ…
మోడీ సర్కార్‌ విద్యను ప్రయివేటీకరించడంతో పాటు కాషాయికరణ కలిగిస్తున్నది. జాతీయ ఉద్యమంలో ఏనాడు పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులతోని చరిత్రను వక్రీకరించే పనిలో ఉంది. నూతన విద్య విధానం చేసిన సిఫారసులుతో ప్రయివేట్‌ ఆధిపత్యర చేసే దిశగా ఉన్నాయని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్‌తో ఊడిన ఉద్యోగాలు 2.84 కోట్లు
మోడీ తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం దేశాన్ని పీకల్లోతు కష్టాల్లోకి ముంచేసింది. లాక్‌డౌన్‌ కాలంలో దేశంలో 2.84 కోట్ల (284.8 లక్షల) మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ బికాష్‌ రంజన్‌ భట్టాచార్య అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. లాక్‌డౌన్‌ కాలంలో (25 మార్చి 2020 నుంచి 1 జులై 2020 వరకు) 201.5 లక్షల పురుషులు, 83.3 లక్షల మంది మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. తయారీ రంగంలో 87.9 లక్షల పురుషులు, 23.3 లక్షల మహిళలు ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు.

విద్యుత్‌ కొరత వెనుక..
దేశంలో ఎన్నడూ లేనంతగా విద్యుత్‌ కొరత అక్టోబర్‌ నెలలో చోటు చేసుకుంది. గత ఐదేండ్లలో ఎప్పుడూ అక్టోబర్‌లో ఇలాంటి పరిస్థితి నెలకొనలేదు. థర్మల్‌ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకున్నాయనే పేర విద్యుత్‌ కొరత ప్రచారం జరిగింది. దీనివెనుక అదానీ,అంబానీల హస్తం ఉన్నట్టు విద్యుత్‌రంగ నిపుణులు అంటున్నారు. సర్వం కార్పోరేట్ల కోసమే !

120 లక్షల కోట్ల అప్పు
దేశం ప్రస్తుత అప్పు రూ.120 లక్షల కోట్లు ఉంది. 2021-22 బడ్జెల్‌ లెక్కల ప్రకారం దేశం ప్రస్తుత రూ.1,20,91,193 కోట్లు ఉంది. అందులో దేశీయ అప్పు రూ.1,04,03,954 కోట్లు కాగా, విదేశీ అప్పు రూ.6,72,101 కోట్లుగా ఉంది. ప్రభుత్వ పద్దు అప్పు రూ.10,15,108 కోట్లుగా ఉంది.

వివాహ వయస్సు తగ్గింపునకు బిల్లు
మోడీ సర్కార్‌ పరిష్కరించని బిల్లులు ఉన్నా వాటి జోలికి వెళ్లటంలేదు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఏడేండ్లకుపైగా పెండింగ్‌ ఉన్నా..లైట్‌ తీసుకుంటున్నది. తమకు అవసరమైన బిల్లుల్ని ఆమోదించుకుంటూనే..ప్రతిపక్షాలను, దేశప్రజల్ని గందరగోళ పర్చేలా వివాహ వయస్సు తగ్గింపు బిల్లును తెరపైకి తెచ్చింది. వాస్తవానికి 15 ఏండ్ల నుంచి 49 ఏండ్ల బాలికలు, స్త్రీలలో 56 శాతానికి పైగా రక్తహీనతతో నీరసించిపోతున్నారని ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌) వెల్లడించింది. ఈ వాస్తవాలను పక్కన బెట్టి వివాహ వయస్సును 18 నుంచి 21 ఏండ్లకు పెంచటానికి మోడీ సర్కార్‌ సిద్ధమైంది. దీన్ని ప్రతిపక్షాలు అడ్డుకోగా..స్థాయి సంఘానికి పంపింది.

బేటీ బచావో..బేటీ పడావో..
పాఠశాల విద్య కూడా అందని మహిళలు దేశంలో 59 శాతం మంది ఉన్నారని సర్కార్‌ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అంతే కాదు 40 శాతానికి పైగా బాలబాలికల్లో వ్యాధి నిరోధకాలు,విటమిన్ల కొరత వెంటాడుతున్నది. బాల,బాలికలను చదువుకునేలా తీర్చిదిద్దుతామన్నది. బేటీ బచావో…బేటీ పడావో అనే పథకాన్ని తెరపైకి తెచ్చింది. కానీ ఆ పథకం అమలు కోసం కేటాయించిన 80 శాతం నిధులు మోడీ ప్రచారానికే సరిపోయాయని పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ తమ నివేదికలో ప్రస్తావించింది.

మహిళలపై ఆగని దాడులు..
ప్రతి ఏటా మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని నేషనల్‌ క్రైమ్‌బ్యూరో ఆఫ్‌ రికార్డ్స్‌(ఎన్సీఆర్బీ) ధ్రువీకరిస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేరగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారనటానికి ఎన్నో సాక్ష్యాలు. మరెన్నో ఆధారాలు. 2020 చివరి నాటికి దేశంలో మహిళలపై దాడులకు సంబంధించిన 17,89,601 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం తెలిపింది.

ముస్లింలు, ఎస్సీఎస్టీలపై ఆగని వేధింపులు..దాడులు
దేశంలో కాషాయమూకలు బరితెగిస్తున్న ఘటనలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌,బీజేపీ, సంఫ్‌ుపరివార్‌ నేతలు రెచ్చగొట్టి..ముస్లింలు, ఎస్సీ,ఎస్టీలపై తెగబడేలా ఉసిగొల్పుతున్నారు. గుజరాత్‌లో మాంసం విక్రయాలు మొదలుకుని ,క్రిస్మస్‌ రోజున కాషాయ మూకలు ఎన్నో దారుణాలు ఒడిగట్టారు. 2020లో 53,886 ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు అయినట్టు కేంద్రమంత్రి రాందాస్‌ అథవలే తెలిపారు. కాషాయశ్రేణులు పెట్రేగిపోతున్నతీరుతో.. బలహీన వర్గాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా దెబ్బ సదువు దూరం..
దేశంలో లాక్‌డౌన్‌ కాలంలో 80 శాతం పిల్లలకు విద్య అందలేదని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. దేశంలో 36 శాతం కుటుంబాలకు ఇంటర్నెట్‌ సదుపాయం లేదని, ఇంటర్నెట్‌ ఉన్న కుటుంబాల్లో పిల్లలకు ఆన్‌లైన్‌ విద్య అంతంతే. లాక్‌డౌన్‌లో 90 శాతం కుటుంబాల్లో ఆదాయాలు పడిపోయాయి. దీంతో పూట గడవటమే గగమైతే..బిడ్డలకు సెల్‌ఫోన్‌ రీచార్జి చేయటానికి పైసల్లేక సదువు ఆపేశారు.

పార్లమెంట్‌లో బీజేపీ మందబలం..
తాము ఎన్నుకున్న ప్రజలు కోరుకున్నవిధంగా చట్టాలు తీసుకోస్తారని ఆశల కాలం గతించింది. వరుసగా ఐదోసారి షెడ్యూల్‌ కంటే ముందే 11 బిల్లుల్ని మోడీ ప్రభుత్వం మందబలంతో ఉభయసభల్లోనూ ఆమోదించుకున్నది.

ఇక లోక్‌సభలో 14 బిల్లులైతే..కేవలం పది నిమిషాల్లోనే సభా ఆమోదం పొందటం గమనార్హం. సీబీఐ,ఈడీల పదవీకాలం రెండేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచటం, సాగుచట్టం రద్దు, ఓటర్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం బిల్లులు ఆమోదం పొందాయి. ఇక రాజ్యసభలో 12 మంది ప్రతిపక్ష ఎంపీలను..గత ప్రవర్తనఅంటూ..ఇప్పటి సమావేశాలనుంచి వారిని బహిష్కరించటం ఉభయసభల్ని కుదిపేసింది. కనీసం ప్రతిపక్షసభ్యులు అడిగే ప్రశ్నలను చర్చకు అనుమతించలేదు. పైగా శీతాకాల సమావేశాల్లో ప్రధాని మోడీ సమావేశాలకు ఒక్కసారో,,రెండుసార్లో హాజరవ్వటం విశేషం. తాము అడిగే ప్రశ్నలు సమాధానాలు చెప్పాల్సివస్తుందని మోడీ గైర్హాజరయ్యారని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి.

కేంద్రంపై గళమెత్తితే..రాజద్రోహం కేసులే..
బీజేపీని, మోడీని విమర్శిస్తే..రాజద్రోహం కేసులు బనాయించటం సర్వసాధారణంగా మారింది.30 ఏండ్ల లోపు వయసు ఉన్న 2501 మంది యువకుల్ని అరెస్టుచేసినట్టు కేంద్రహౌంశాఖ సహాయమంత్రి నిత్యానందరారు లోక్‌సభలోనే వెల్లడించారు. అత్యధిక మంది ఉత్తరప్రదేశ్‌లోనే అరెస్టు చేయటం విశేషం.

కదం తొక్కిన పౌర సమాజం
ప్రజా సమస్యలపై పౌర సమాజం కదం తొక్కింది. మోడీ సర్కార్‌ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యువత, కళాకారులు గొంతెత్తారు. నిత్యావసరాలు మొదలుకుని, ఇంధన ధరలపెంపు..ఇలా పలు అంశాలపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు,నిరసలు హౌరెత్తించాయి.

భారత్‌ బంద్‌ సక్సెస్‌…
సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) పిలుపు ఇచ్చిన భారత్‌ బంద్‌ విజయవంతం కావటంతో..బీజేపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టాయి. ఊహించని విధంగా ప్రజలు వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేయడంతో భారతావని పూర్తిగా స్తంభించింది. మార్కెట్లు, మండీలు, దుకాణాలు మూసివేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులు దిగ్బంధించారు. రైల్‌రోకోలతో రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. రాస్తారోకోలతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

కరోనా విజృంభణ..పట్టించుకోని బీజేపీ సర్కార్‌
కరోనా రెండో దశ విజృంభిస్తున్నా..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఓ వైపు ఐదు రాష్ట్రాలు..రెండో వైపు సెకండ్‌వేవ్‌ కోరలు చాస్తున్నా.. మోడీ జనం కన్నా..ఎన్నికలు జరిగే సెగ్మెంట్లవైపే దృష్టిపెట్టారు. కరోనా టీకా ఏర్పాట్ల గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించినా..మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. దాని ఫలితమే..దేశంలోని ఆస్పత్రుల్లో వైద్యం కరువైంది. వెంటిలేటర్లు, ఆక్సిజన్ల కొరత వెరసి ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కోవిడ్‌ మృతుల సంఖ్య భారీగా చేరుకున్నది. తమ బంధువులను కడసారి వీడ్కోలు పలకటానికి వీల్లేనివిధంగా కోవిడ్‌ విరుచుపడింది. చివరికి శ్మశానవాటికల్లో శవాలకు క్యూలు.. ఎక్కడబడితే అక్కడ దహనసంస్కారాలు చోటుచేసుకున్నాయి. యూపీలో అయితే మృతదేహాలను ఖననం చేయలేక..గంగానదిలో పడేశారు. వర్షాలు కురిసినపుడు వందల సంఖ్యలో మృతదేహాలు నీటి కొట్టుకువచ్చాయి.

పీఎం కేర్‌ ఫండ్‌ ఎవరికోసం..
ప్రధాని సహాయనిధి ఉన్నా…మోడీ ప్రధాని కేర్‌ ఫండ్‌ను తెరపైకి తెచ్చారు. ఈ నిధికి భారీగానే నిధులు సమకూరాయి. ఎవరు నిధులిచ్చారు.?ఎంత ఖర్చుపెట్టారన్న దానిపై ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వటానికి నిరాకరించింది. ఆ డబ్బుతో కొనుగోలు చేసిన వెంటిలేటర్ల వెనుక బీజేపీ నేతల హస్తం ఉన్నట్టు బయటకు వచ్చింది. ఈ వెంటిలేటర్లు వినియోగించిన పలు ఆస్పత్రుల్లో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి..కోవిడ్‌ పేషెంట్లు కన్నుమూశారు. అయితే ఈ ప్రమాదాలపై విచారణ తూతూమంత్రంగానే కొనసాగింది.

చితికిన చిన్న తరహా పరిశ్రమలు..
దేశవ్యాప్తంగా సుమారు ఆరున్నర కోట్లకుపైగా ఉన్న సూక్ష్మ,చిన్న మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ) 12 కోట్లమంది ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్టు అధికారిక లెక్కలు ధ్రువీకరిస్తున్నాయి. ఇటీవల కరోనా దెబ్బకు సంక్షోభంలో కూరుకుపోయాయని కేంద్రం పార్లమెంట్‌లో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. మూలిగేనక్కపై తాటికాయపడ్డట్టు ఈ సంస్థలపై జీఎస్టీని 12 నుంచి 18 శాతానికి పెంచింది. దీన్ని ఐదు శాతానికి తగ్గించాలని చిన్న వ్యాపార సంస్థలు చేసిన అభ్యర్థులను అరణ్యరోదనగా మిగిలాయి.

ఉత్తమ పరిపాలనలో అగ్రభాగాన కేరళ
ఉత్తమ పరిపాలనలో కేరళ అగ్రభాగాన నిలిచింది. తమిళనాడు, తెలంగాణ రెండు, మూడు స్థానాల్లో నిలిశాయి. ఒడిశా, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ చివరి స్థానాల్లో నిలిశాయి. దేశంలోని రాష్ట్రాల అభివృద్ధి, పరిపాలనపై పబ్లిక్‌ అఫెర్స్‌ ఇండెక్స్‌ (పీఏఐ)-2021 నివేదికను పబ్లిక్‌ అఫెర్స్‌ సెంటర్‌ (పీఏసీ) విడుదల చేసింది. కరోనా కాలంలో సంక్షేమ పథకాల అమలు, ప్రజల బాగోగులు అన్ని వర్గాలకు సమానత (ఈక్విటీ)లో పెద్ద రాష్ట్రాల విభాగంలో గుజరాత్‌, కేరళ, రాజస్థాన్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ 10 (-0.086) స్థానాలోనూ, తెలంగాణ 6 (0.542)స్థానంలోనూ నిలిచాయి.

నల్లచట్టాలపై మోడీ వెనకడుగు..
ఏడాదిగా మడమతిప్పకుండా అన్నదాతలు..తాడో పేడో తేల్చుకుందామన్నట్టు పోరాటం చేశారు.సుమారు ఏడు వందలకుపైగా రైతులు చనిపోయినా..తగ్గేదేలేదన్నారు. లఖింపూర్‌ ఖేరీలో కేంద్రమంత్రి అజరు మిశ్రా టెనీ తనయుడు ఆశిష్‌ మిశ్రా కారుతో…రైతుల ప్రాణాలు తీశాడు. దీనిపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయ్యాక.. సిట్‌ దర్యాప్తు చేశాక..ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. కానీ కేంద్రమంత్రిని క్యాబినెట్‌నుంచి మోడీ తొలగించలేదు. అమిత్‌షాతో కలిసి ఎన్నికల ప్రచారాల్లో ప్రత్యక్షమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో.. త్వరలో జరగనున్న యూపీ,ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి మూడిందనుకున్న మోడీ..హఠాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యారు. దేశప్రజల్ని క్షమించమని కోరారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించారు. కానీ పార్లమెంట్‌లోనే ప్రకటిస్తే కానీ..ఇండ్లకు వెళ్లమని రైతులు భీష్మించారు. అలాగే కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ని తేల్చాలిందేనని పట్టుబట్టారు. చివరకు ఓ కమిటీ వేసింది. కానీ ఇటీవల కేంద్రమంత్రి తోమర్‌ మళ్లీ…సాగు చట్టాలను తేస్తామంటూ సంకేతాలిచ్చారంటే..బీజేపీ సర్కార్‌ మళ్లీ తొండాట ఆడే అవకాశాలు లేకపోలేదు.

పెట్రో బాదుడు..
కరోనా దెబ్బకు ఆదాయాలు కోల్పోయి..నానా కష్టాలు పడుతున్న జనం నెత్తిన పెట్రో,గ్యాస్‌ ధరల్ని అమాంతంగా పెంచేసింది. 2021-22లో 69 సార్లు పెట్రోల్‌, 67 సార్లు డీజిల్‌, నాలుగు సార్లు వంట గ్యాస్‌ ధరలు పెరిగాయి. ఈవిషయాన్ని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రావటంతో..తాత్కాలికంగా ధరలపెంపును ఆపారు. మళ్లీ ఎప్పుడైన పెట్రో,గ్యాస్‌ ధరలు పెరిగే అవకాశాలున్నాయి. మొత్తం మీద మూడేండ్లలో 234 సార్లు పెట్రోల్‌, 219 సార్లు డీజిల్‌, 21 సార్లు వంట గ్యాస్‌ ధరలు పెరిగాయంటే నమ్ముతారా..కానీ ఇది నిజం.అలాగే ఐదున్నరేండ్లలో రూ.14 లక్షల కోట్ల ఎక్సైజ్‌ డ్యూటీ వసూలు చేసింది. గల్లాపెట్టె నిండితే చాలనుకుంటున్నారేమో!

బ్యాంక్‌ బచావో…దేశ్‌ బచావో
దేశవ్యాప్తంగా సాధారణ బ్యాంకింగ్‌ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించే చర్యకు వ్యతిరేకంగా ఉద్యోగులు సమ్మెకు దిగారు. బ్యాంక్‌ బచావో…దేశ్‌ బచావో (బ్యాంకులను కాపాడండి…దేశాన్ని రక్షించండి) అంటూ బ్యాంకు ఉద్యోగులు నినదించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ ఆపాలని గళమెత్తారు. బ్యాంకింగ్‌ చట్ట సవరణ బిల్లును ప్రస్తుతానికి ఆపింది. రైతు ఉద్యమం లానే బ్యాంకు ఉద్యోగులు వచ్చే ఎన్నికల్లో ఎక్కడ కొంపముంచుతారోనన్న భయం బీజేపీని వెంటాడుతోంది.

Courtesy Nava Telangana

Leave a Reply