చరిత్ర ఏ మోదీని ఎంచుకుంటుంది?

0
26
ఎ. కృష్ణారావు

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు మరో ఆరు నెలల్లో జరగాల్సి ఉండగా ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. ముజ ఫర్‌నగర్‌లో రెండు రోజుల క్రితం లక్షలాది రైతులతో మహాపంచాయత్ నిర్వహించిన రైతు సంఘాల నేతలు ఈ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. హిందూ, ముస్లింలు సంఘటితంగా బిజెపిని ఓడించేందుకు కలిసి పనిచేయాలని రైతుసంఘాల నేతలు ఇచ్చిన పిలుపు యుపిలో భావి రాజకీయ పరిణామాలకు సూచికగా కనిపిస్తోంది. భారతీయ కిసాన్ సంఘం నేత రాకేశ్ తికాయత్ అల్లాహో అక్బర్, హరహర మహదేవ్, జో బోలే సో నిహాల్ అని మూడు మతాలకు చెందిన నినాదాలను ఇచ్చి రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచారు. లవ్‌జిహాద్, హిందూత్వ, రామమందిర నిర్మాణం మొదలైన వాటి ఆధారంగా హిందూ ఓట్లను సంఘటితం చేసే బిజెపి ప్రయత్నాలను అడ్డుకునేందుకే ప్రత్యర్థులు ఈ వ్యూహాన్ని అవలంబించినట్లుంది. నిజానికి 2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన మతకల్లోలాల కారణంగానే బిజెపికి అనుకూలంగా జాట్ ఓట్లు సంఘటితమయ్యాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కూడా జాట్లు బిజెపి వైపే అధికంగా మొగ్గు చూపారు. కాని 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పరిణామం పునరావృతమవుతుందని చెప్పలేం. యోగి ఆదిత్యనాథ్ హయాంలో బలహీనపడ్డ రాష్ట్రీయ లోక్‌దళ్ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సాగుచట్టాల తర్వాత బలం పుంజుకోవడం ప్రారంభించింది. రాకేశ్ తికాయత్ నేతృత్వంలో పశ్చిమ యుపి రైతులు ఢిల్లీ పొలిమేరల్లో నెలల తరబడి సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, వివిధప్రాంతాల్లో నిర్వహిస్తున్న మహాపంచాయత్‌లకు పెద్దఎత్తున రైతులు హాజరుకావడం ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో యుపిలో సమాజ్‌వాది పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్ కూటమి కలిసికట్టుగా బిజెపి ఆధిపత్యానికి గండి కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఏ ఉద్యమమైనా రాజకీయాలను ప్రభావితం చేయలేకపోతే అధికారంలో ఉన్నవారిని కదిలించలేదు. సాగుచట్టాలపై రైతుల నిరసన ఎట్టకేలకు రాజకీయాలను ప్రభావితం చేసే తరుణం ఆసన్నమైంది. హర్యానాలోని కర్నాల్‌లో కూడా రైతుల నిరసన ప్రదర్శనలు తీవ్రతరమయ్యాయి. అంబాలా నుంచి న్యూఢిల్లీ వరకు జాతీయరహదారి 44 పూర్తిగా స్తంభించిపోయింది. ఐదు జిల్లాల్లో పోలీసులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అక్కడ కొద్ది నెలలుగా రైతులు అనేక చోట్ల బారికేడ్లను ఛేదిస్తూ, ముఖ్యమంత్రి ఖట్టర్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. అనేకచోట్ల పోలీసులు బాష్పవాయువు ప్రయోగిస్తూ లాఠీఛార్జీలు చేయవలిసి వచ్చింది. గత శనివారం కర్నాల్‌లో బిజెపి రాష్ట్రస్థాయి సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ముందుకువెళ్లిన జనంపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో ఒక వ్యక్తి మరణించగా పదిమందికి పైగా గాయపడ్డారు. ‘ఇక్కడి నుంచి ఎవరు ముందుకు వెళ్లినా వారి తలలు పగలగొట్టండి..’ అని కర్నాల్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆయుష్ సిన్హా పోలీసులను ఆదేశించిన దృశ్యం అంతటా వైరల్ కావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసుల లాఠీఛార్జీకి నిరసనగా హర్యానాతో పాటు పొరుగురాష్ట్రాల నుంచి పెద్దఎత్తున రైతులు కర్నాల్‌కు చేరుకుని లక్షలాది మందితో మంగళవారం మహా పంచాయత్ నిర్వహించారు.

ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో మహాపంచాయత్‌లు నిర్వహించి బిజెపిని ఎన్నికల్లో ఓడించేందుకు కలిసికట్టుగా ప్రచారం చేయాలని ఉత్తరాది రాష్ట్రాల రైతులు సమాయత్తమవుతున్న తరుణంలో, నరేంద్రమోదీ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి అక్టోబర్ 7కు 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, ఈనెల 17న మోదీ జన్మదినం నుంచీ ఉత్సవాలు జరుపుకోవాలని భారతీయ జనతాపార్టీ, కేంద్రప్రభుత్వం నిర్ణయించాయి. 2001 అక్టోబర్ 7న ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటినుంచీ ఒక్క రోజు కూడా మోదీ అధికారానికి దూరంగా లేరని, తొలుత ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా రెండు దశాబ్దాలు పదవిలో ఉన్నవారు దేశచరిత్రలో మరొకరు లేరని బిజెపి వర్గాలు ఆర్భాటంగా చెప్పుకుంటున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన ఏ విధంగా దేశాన్ని సమూలంగా పరివర్తనం చేశారో జనంలోకి తీసుకువెళ్లాలని కొత్తగా సమాచారశాఖను చేపట్టిన అనురాగ్ ఠాకూర్ ఆ శాఖ అధికారులను కోరినట్లు సమాచారం. మోదీ హయాంలో ఏక వ్యక్తి కేంద్రీకృత సంస్థలుగా పార్టీ, ప్రభుత్వాలు ఏవిధంగా మారాయో చెప్పేందుకు ఇది నిదర్శనం. ఒక వ్యక్తికి భజన చేసేందుకు పార్టీ నేతలు కానీ మంత్రులు కానీ సిద్ధంగా లేకపోతే వారికి భారతీయ జనతా పార్టీలో మనుగడ లేని పరిస్థితి ఏర్పడింది. పార్టీ అధ్యక్షుడి నుంచి మంత్రులు, పార్టీ నేతల వరకు మోదీని ప్రశంసిస్తూ ప్రచారం చేయడమే వారి పనితీరుకు గీటురాయిగా మారింది. ఇందిరాగాంధీ వ్యక్తి నియంతృత్వాన్ని, కాంగ్రెస్‌లో కుటుంబపాలనను తీవ్రంగా వ్యతిరేకించిన భారతీయ జనతాపార్టీ ఏక వ్యక్తి కేంద్రీకృత పార్టీగా మారడమేనా ఈ 20 ఏళ్లలో సాధించిన పరిణామం?

నిజానికి గుజరాత్‌లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన వెంటనే వ్యక్తి కేంద్రీకృతపాలన నిర్వహించడాన్ని మోదీ తీవ్రతరం చేశారు. ఆయనను వ్యతిరేకించిన వారెవరికీ పుట్టగతులు లేకుండా పోయాయి. ఉదాహరణకు గుజరాత్ రాజకీయాల్లో తనకు ప్రత్యర్థి అయిన సీనియర్ నేత సంజయ్ జోషీకి, ఆయన అనుయాయులకు తీవ్ర సమస్యలు ఎదురయ్యాయి. సంజయ్ జోషీ జాతీయస్థాయిలో ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆయనపై ఒక అసభ్య వీడియో పుట్టుకొచ్చింది. దాన్ని బూచిగా చూపించి ఆయనను పార్టీనుంచి బయటకు పంపమని జాతీయ నాయకత్వంపై ఒత్తిడితెచ్చారు. ముంబైలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో సంజయ్ జోషీని బయటకు పంపేంత వరకూ తాను సమావేశానికి హాజరు కానని మోదీ పట్టుబట్టి సాధించుకున్నారు. చివరకు అది నకిలీ వీడియో అని తెలిసినా సంజయ్ జోషీని క్రియాశీల రాజకీయాల్లోకి ఆహ్వానించే సాహసం ఎవరూ చేయలేకపోయారు. గుజరాత్‌లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలమూ ఆయనే తిరుగులేని నాయకుడు. జాతీయ స్థాయి నేతలు ఎవరు ఎన్నికల ప్రచారానికి వచ్చినా వారికి అంత ప్రాచుర్యం లభించేది కాదు. వారి కటౌట్లు ఉండేవి కావు. అసలు నేనుండగా మీరంతా ప్రచారానికి రావడం దేనికి? అని మోదీ చికాకు పడేవారు. ఒక దశలో ఆయనే ప్రధానమంత్రి పదవికి అభ్యర్థి కానున్నారని తెలిసి జాతీయస్థాయి నేతలంతా గుజరాత్‌కు పొలోమని వెళ్లి ఆయన దర్శనం చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఢిల్లీలో ప్రధానిగా అడుగుపెట్టిన నాటి నుంచీ క్రమంగా పూర్వ నేతలందరికీ ప్రాధాన్యం తగ్గించి తనకు తిరుగులేకుండా చేసుకోవడమే లక్ష్యంగా ఏ విధంగా పనిచేశారో జగద్విదితమే. గుజరాత్ అల్లర్ల తర్వాత గోవాలో అటల్ బిహారీ వాజపేయిని ఉత్సవ విగ్రహంగా మార్చి మోదీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కారణమైన లాల్ కృష్ణ ఆడ్వాణీ, ఆయన అనుయాయులందరూ ఇవాళ ఎక్కడున్నారు? ఏడు సంవత్సరాలుగా ఒక విలేఖరుల సమావేశమైనా నిర్వహించకుండా తన ‘మనకీ బాత్’ మాత్రమే చెప్పి తప్పించుకుపోయే ప్రధానమంత్రి నుంచి ఏ ప్రశ్నలకైనా జవాబులు ఆశించడం సాధ్యమా?

ఒక మంచి నాయకుడు పార్టీకి లభించడం, ఆ నాయకుడి వ్యక్తిగత ఆకర్షణ కూడా పార్టీకి తోడ్పడడం, తన నాయకత్వ లక్షణాల ద్వారా అందర్నీ కలుపుకుపోవడం ఆహ్వానించదగ్గ పరిణామమే. ఒక నాయకుడు తయారు కావడానికి ఎంతో కాలం పడుతుంది. అందుకు సామాజిక, రాజకీయ పరిస్థితులతో పాటు చుట్టూ ఉన్నవారు కూడా ఎంతో దోహదం చేస్తారు. కాని నాయకుడిగా ఎదిగిన ఆ వ్యక్తి అందర్నీ తొక్కేస్తారని, ప్రశ్నించే స్వరాలను నిర్మూలిస్తారని, తన నాయకత్వ లక్షణాల ద్వారా కాక తన నియంతృత్వ లక్షణాల ద్వారా అందరి నోళ్లూ మూసేస్తారని తెలిసినప్పుడు అతడి ఎదుగుదలకు కారణమైన వారందరూ పశ్చాత్తాపపడే పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి సాగుచట్టాలపై ఇంత సుదీర్ఘకాలం రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం సరైంది కాదని, మొండిపట్టు వీడితే సమస్యను పరిష్కరించవచ్చునని బిజెపిలోనే చాలామందికి తెలుసు. కాని వారెవరూ పైకి చెప్పేందుకు సాహసించలేరు. పార్లమెంట్‌ను రోజుల తరబడి స్తంభింపచేయడం ఆరోగ్యకర పరిణామం కాదని, ప్రతిపక్షాల పట్ల రాజనీతితో వ్యవహరించడం అవసరమని, చట్టాలను పార్లమెంటరీ సంప్రదాయాలకు అనుగుణంగా ఆమోదించడం మంచిదని అనుకునేవారు కూడా బిజెపిలో ఉన్నారు. కానీ వారు మాట్లాడరు. ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైందని, పెట్రోల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకున్నాయని, ఆర్థిక విధానాలు కొంతమంది అస్మదీయ కార్పొరేట్‌సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని, ఈ విషయంలో ప్రజలకు తాము జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని కూడా పార్టీలో భావించేవారున్నారు. కానీ మౌనంగా ఉండడమే శ్రేయస్కరమని వారనుకుంటున్నారు. ఒక పారదర్శకమైన, ఆరోగ్యకరమైన, ప్రజాస్వామ్యయుతమైన పాలన నిర్వహించే అవకాశం ఉండగా, భారీ మెజారిటీ ఉండి కూడా నిరంకుశంగా, ప్రత్యర్థులను భయపెట్టి, వారి చర్యలపై నిఘా వేసి, వ్యవస్థల్ని నీరుకార్చి ఉక్కుపాదంతో పాలించాల్సిన అవసరం ఏమున్నదని అనుకునేవారూ లేకపోలేదు. అలాంటి వారి ఆలోచనలు ఏనాడూ పెదాలపైకి రావు. మోదీ 20 ఏళ్ల అధికార చరిత్రలో నాటి గుజరాత్ అల్లర్ల నుంచీ ఇవాళ రైతుల నిరసన ప్రదర్శనల వరకూ చెప్పడానికి ఎన్నో దౌర్భాగ్య ఘటనలు ఉన్నాయి. చరిత్రలో కొందరు జననీరాజనాల మధ్య జైత్రయాత్రలు చేస్తారు. మరికొందరు రక్తసిక్త శరీరాలపై నడుచుకుంటూ వెళ్లి దండయాత్రలు చేస్తారు. మోదీ విజయ రహస్యగాథను చరిత్రకారులు ఏవిధంగా అంచనా వేస్తారో చూడాల్సి ఉన్నది.

Courtesy Andhrajytohi

Leave a Reply