దారుణాల బలిపీఠం

0
119
  • అప్పుల ఉచ్చుతో అసలుకే ఎసరు
  • ఆశ చూపించి రుణాలు.. వసూళ్ల పేరుతో ఆగడాలు
  • ప్రాణాలు తోడేస్తున్న వడ్డీ వ్యాపారం
  • బాధితుల బలవన్మరణాలతో కలకలం
  • విజయవాడలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకున్న నిజామాబాద్‌ వ్యాపారి సురేష్‌ అప్పులిచ్చినవారు వారానికి 30 శాతం వరకూ వడ్డీ వసూలు చేశారని, రూ.40-50 లక్షలు కట్టినా ఇంకా చెల్లించాలంటూ బెదిరింపులకు దిగడం వల్లనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.

  • సూర్యాపేటలో సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ చిరు వ్యాపారిదీ ఇదే తీరు. స్టీల్‌ దుకాణం నిర్వహించే వెంకటేశ్వర్లు, మాధురి దంపతులు అప్పు తీసుకున్నారు. కరోనా కారణంగా వ్యాపారం సరిగా నడవకపోవడంతో తిరిగి చెల్లించడం ఆలస్యమైంది. తీసుకున్న రూ.7 లక్షల్లో రూ.2 లక్షలు చెల్లించినా.. ఇంకా రూ.36 లక్షలు చెల్లించాల్సిందేనని వడ్డీ వ్యాపారులు వేధించారు. దీంతో మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

  • ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన మోరంపూడి రవి హోటల్‌ నిర్వహణ కోసం ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారి వద్ద రూ.4 వేల అప్పు తీసుకున్నాడు. అసలు చెల్లించినా రెండు వారాలకు రూ.12 వేల వడ్డీ ఇవ్వాలని వ్యాపారి ఒత్తిడి చేయడంతో గతేడాది సెప్టెంబరు 16న కలుపుమందు తాగాడు. సెప్టెంబరు 20న ప్రాణాలొదిలాడు. దాంతో అతని భార్య, ఇద్దరు చిన్నపిల్లలు రోడ్డున పడ్డారు.

అప్పులిచ్చిన వారి వేధింపులు, బెదిరింపులకు తాళలేక ప్రాణాలు తీసుకున్న ఇలాంటి ఉదంతాలు అనేకం. రుణయాప్‌ల నిర్వాహకుల వల్ల రాష్ట్రంలో ముగ్గురు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణగ్రహీతలకు నిర్వాహకులు ఫోన్లోనే నరకం చూపించేవారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులకు చెప్పి పరువును బజారుకీడుస్తామని బెదిరించడమే కాకుండా.. దురుసుగా మాట్లాడేవారు. ప్రైవేటు ఫైనాన్స్‌ వ్యాపారులైతే ఏకంగా ఇంటి ముందే వాలిపోయి, వసూలు పేరుతో నానా యాగీ చేస్తారు. ఇంకా ఆలస్యమైతే గూండాలనూ రంగంలోకి దింపుతారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండటంలేదు. సివిల్‌ వివాదాలను న్యాయస్థానాల్లోనే చూసుకోవాలని వారు సూచిస్తుండటంతో ఎటూ పాలుపోక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నిజామాబాద్‌ వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటంతో వడ్డీ వ్యాపారుల ఆగడాలు చర్చనీయాంశమయ్యాయి.

వడ్డీ వ్యాపారి అవతారమెత్తిన ఏఎస్సై
వడ్డీ వ్యాపారం లాభదాయకంగా ఉండటంతో కరీంనగర్‌లో ఏఎస్సై మోహన్‌రెడ్డి వడ్డీ వ్యాపారి అవతారమెత్తారు. రూ.వందకు రూ.10కి పైగా వడ్డీ వసూలు చేస్తూ సాగించిన దురాగతాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. సకాలంలో తిరిగిచెల్లించని వారి ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేయించుకునేవాడు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అనేక మంది పోలీసు అధికారులు మోహన్‌రెడ్డి వద్ద పెట్టుబడి పెట్టారన్నది బహిరంగ రహస్యం.

  • చైనా రుణయాప్‌లు రూ.173 కోట్ల పెట్టుబడి ద్వారా సంవత్సర కాలంలో ఆర్జించిన లాభం నుంచి రూ.429.29 కోట్లు విదేశాలకు తరలించగా.. రూ.941 కోట్ల వ్యయం చూపించారు. ఇదంతా పెట్టుబడిపై ఆర్జించిన లాభమేనని ఈడీ అధికారులు తేల్చారు. దీన్నిబట్టి వడ్డీ వ్యాపారుల దోపిడీ ఎలా ఉంటోందో అర్థం చేసుకోవచ్చు.

ఆస్తులు తనఖా పెట్టుకుని..
వ్యాపారం కోసం ఆస్తులు గ్యారంటీగా పెట్టుకొని ఫైనాన్స్‌ సంస్థలు రుణాలు ఇస్తుంటాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఇంటి, స్థలం పత్రాలు, బంగారం వంటివి తీసుకుని అప్పులిస్తారు. వ్యవసాయదారులకైతే భూమిని తనఖా పెట్టుకుంటారు. తెల్ల రేషన్‌కార్డులు దగ్గర పెట్టుకొని రుణం ఇచ్చే దళారులూ కోకొల్లలు. హైదరాబాద్‌ పాతబస్తీలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఇలాంటి రేషన్‌కార్డులు వందల్లో బయటపడ్డాయి.

  • ‘గిరిగిరి’ పేరుతో డైలీ ఫైనాన్స్‌ వ్యాపారులది ఇంకో తీరు. వీరి లక్ష్యం చిరు వ్యాపారులే. రోజుకు రూ.వెయ్యి కావాలంటే.. ఉదయం రూ.900 ఇస్తారు. అంటే రూ.వంద వడ్డీని ముందే తీసుకుంటారు. సాయంత్రం రూ.వెయ్యి వసూలు చేసుకుంటారు. ఒక్కరోజు ఆలస్యమైతే వడ్డీ రూ.200 అవుతుంది.

అవసరాలే పెట్టుబడిగా..
అభాగ్యుల అవసరాన్నే వ్యాపారులు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. ‘తక్కువ వడ్డీకి రుణం కావాలా?’ అంటూ వచ్చే సందేశాలే కాదు.. కాల్‌సెంటర్ల నుంచి వచ్చే ఫోన్లకు కొదవు లేదు. ఇలా అప్పు ఆశ చూపుతూ ఉచ్చులో బిగించి.. ప్రాణాలు తోడేస్తున్నారు. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అనేకమంది కుటుంబ పోషణకు అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులు ఎక్కువగా అప్పుల బారిన పడుతున్నారని, తమ వద్దకు వస్తున్న ఫిర్యాదుదారుల్లో వీరే ఎక్కువగా ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఆర్‌బీఐ అనుమతించిన సంస్థల నుంచే తీసుకోవాలి
-రాధాకృష్ణ తటవర్తి, వ్యవస్థాపకుడు, సీఈవో, ఆక్సీలోన్స్‌
అప్పు అవసరమనుకుంటే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఆర్‌బీఐ అనుమతించిన సంస్థల నుంచి మాత్రమే తీసుకోవాలి. ఈ సంస్థలు మాత్రమే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయి. తిరిగివసూలు విషయంలో కాస్త మెతక వైఖరి కనబరుస్తాయి. రుణాలు తీసుకునే విషయంలో ప్రజలు బాధ్యతతో వ్యవహరించాలని ఆర్‌బీఐ కూడా స్పష్టం చేసింది. బ్యాంకుల్లో ఒక్కసారి అప్పు తీసుకొని సకాలంలో చెల్లించకపోతే తర్వాత మళ్లీ పొందటం కష్టమవుతుంది. ఇటువంటివారు కూడా ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తున్నారు.

Courtesy Eenadu

Leave a Reply