ఆశలు రేపిన ఆరు కోతులు

0
248

ఆక్స్‌ఫర్డ్‌ టీకాతో కరోనా వైరస్‌ను నిలువరించిన వానరాలు

కరోనా నివారణ టీకా వేటలో మరో శుభ శకునం కనిపించింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలోని ‘ది జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌’ అభివృద్ధి చేస్తున్న టీకాను తీసుకొన్న ఆరు రీసెస్‌(ఆసియా జాతి) కోతులు వైరస్‌ను నిలువరించాయి. దీంతో ఈ టీకా నమ్మకమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటికే మనుషులపై ఈ టీకా ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడానికి మరికొన్ని నెలలు పట్టవచ్చు. దీనికి సంబంధించి జంతువులపై ప్రయోగం మార్చిలోనే మొదలైంది. అమెరికాలోని మాన్టానలోని రాకీమౌంటెన్‌లో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ ప్రయోగశాలలో దీనిని నిర్వహించినట్లు ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పేర్కొంది. తొలుత టీకా ఇవ్వని ఆరు కోతులను కరోనా వైరస్‌ బారినపడేలా చేశారు. అవి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాయి. మరో ఆరు కోతులకు ఈ టీకాను ఇచ్చారు. ఆ తర్వాత వాటిని కూడా వైరస్‌ బారినపడేలా చేశారు. 28 రోజుల తర్వాత కూడా రెండో బ్యాచ్‌ ఆరు కోతుల్లో ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు. ఈ కోతుల డీఎన్‌ఏ,  మనుషుల డీఎన్‌ఏకు 93 శాతం పోలిక ఉంటుంది.

టీకాలో డబ్బును చూడొద్దు
మహమ్మారి విజృంభించి ప్రజల ప్రాణాలు తీస్తున్న సమయంలో వారి రక్షణ కోసం అభివృద్ధి చేస్తున్న ఈ టీకాలో వ్యాపారకోణాన్ని చూడటంలేదని ‘జెన్నర్‌ ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అడ్రియన్‌ హిల్‌ పేర్కొన్నారు. కరోనా కల్లోలం సృష్టిస్తున్న ప్రస్తుత సమయంలో దీనిపై ప్రత్యేకమైన లైసెన్సులు జారీ చేస్తారని తాను అనుకోవడంలేదన్నారు. మనుషులపై చేసే ప్రయోగాల్లో డమ్మీ టీకాలు తీసుకొన్నవారు వైరస్‌ బారినపడి… అభివృద్ధి చేసిన టీకాను తీసుకొన్నవారు సురక్షితంగా బయటపడితే విజయం సాధించినట్లేనని తెలిపారు.

భారత్‌లో ఉత్పత్తికి ఏర్పాట్లు
భారత్‌లోని ‘సీరం ఇన్‌స్టిట్యూట్‌’లో ఈ వ్యాక్సిన్‌ తయారీకి ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది 6కోట్ల డోసులను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంస్థ ప్రకటించింది. hAdOx1 nCoV19 గా పిలుస్తున్న ఈ టీకా ప్రయోగాలు ముగిసేలోపు సమయాన్ని ఆదా చేయడానికి ఉత్పత్తిని సైతం ప్రారంభిస్తామని సంస్థ సీఈవో అధర్‌ పూనావాలా పేర్కొన్నారు. ‘‘వారు అత్యంత ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు. ఆ నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నాం’’ అని ఆయన రాయిటర్స్‌కు తెలిపారు.

Courtesy Eenadu

Leave a Reply