కదలికలులేని బిడ్డను.. కన్నతల్లే కడతేర్చింది

0
64

కదలికలు లేవని.. ఇక ఎప్పటికీ రావని.. ఆమె భవిష్యత్తు భారమవుతుందని భావించిన కన్నతల్లే పసికందును కడతేర్చింది. ఏడాదిన్నర వయసున్న చిన్నారిని నీటి తొట్టెలో వేసి ప్రాణాలు తీసింది. మనసును కలచివేసే ఈ ఘటన జనగామలో సోమవారం చోటుచేసుకుంది. వెస్ట్‌జోన్‌ డీసీపీ పి. సీతారాం వివరాలు వెల్లడించారు.

జనగామ టౌన్‌ : జనగామలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన నడిగోటి భాస్కర్‌, స్వప్న దంపతులకు ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం కుమారుడు నవనీత్‌ కాగా రెండోసంతానం తేజస్విని. ఏడాది వయసున్న తేజస్వినికి కదలికలు లేకపోవడం, మాటలు రాకపోవడంతో అచేతనంగా ఉంటోంది. దంపతులిద్దరూ ఆసుపత్రులచుట్టూ తిరిగారు. పాపకు భవిష్యత్తులోనూ కదలికలు రావని వైద్యులు తేల్చిచెప్పారు. ఇదే సమయంలో కుమారుడు నవనీత్‌కు గుండెలో రంధ్రం ఉండడంతో రూ.8 లక్షలు ఖర్చుచేసి బైపాస్‌ సర్జరీ చేయించారు. పుట్టిన ఇద్దరు పిల్లలూ అనారోగ్యం బారిన పడడంతో భాస్కర్‌, స్వప్న తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తేజస్విని భవిష్యత్తు భారమవుతుందని భావించిన స్వప్న సోమవారం ఉదయం 11 గంటలకు భర్త లేని సమయంలో ఇంటి ముందున్న నీటి తొట్టిలో పడవేయడంతో పాప మృతిచెందింది.

పాప హత్య విషయం తనపైకి రాకుండా ఉండేందుకు స్వప్న ఆగంతకుడు ఈ పని చేశాడని నమ్మబలికే ప్రయత్నం చేసింది. గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తన పుస్తెలతాడును లాక్కునేందుకు యత్నించాడని, తాను వదలకపోయేసరికి పాప తేజస్వినిని ఎత్తుకెళ్లి ఇంటి ముందు నీటి తొట్టిలో పడవేశాడని చెప్పింది. జనగామ ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐ ఎలబోయిన శ్రీనివాస్‌ స్వప్న, ఆమె భర్త భాస్కర్‌ను విచారించారు. ఈ సందర్భంగా స్వప్న విస్తుగొలిపే నిజాన్ని తెలిపింది. తన కుమార్తె తేజస్విని కదలేని స్థితిలో ఉందని, పెంచడం భారంగా అనిపించిందని వెల్లడించింది. బంధువుల సూటిపోటి మాటలు తట్టుకోలేకే తాను పాప ప్రాణాలు తీశానని చెప్పింది. పోలీసులు స్వప్న నేరాంగీకార వాంగ్మూలాన్ని వీడియో రికార్డ్‌ ద్వారా నమోదుచేశారు. స్వప్నను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ సీతారాం చెప్పారు. తేజస్వి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Leave a Reply