కంటితుడుపూ కాలేని మద్దతు ధరలు!

0
123

కన్నెగంటి రవి

దేశవ్యాప్తంగా వానాకాలంలో పండే పద్నాలుగు రకాల పంటలకు 2022–2023 సంవత్సరానికి జూన్ 8న కేంద్ర ప్రభుత్వం కనీస మద్ధతు ధరలు (ఎంఎస్‌పి) ప్రకటించింది. ‘వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చుల, ధరల నిర్ణాయక కమిషన్’ (సీఏసీపీ) సిఫారసులను అనుసరించి కేంద్రం ఈ ధరలను ప్రకటించింది.

2022–23 సంవత్సరానికి ఎం‌ఎస్‌పి ప్రకటించడానికి అంతకు ముందు మూడేళ్ళ (2018–2021) ఖర్చులను ప్రాతిపదికగా పెట్టుకుంటారు. దీని వల్ల, ప్రతి సీజనులోనూ పెరిగిపోతున్న పంట ఉత్పత్తి ఖర్చులు పూర్తిగా నమోదు కావు. ఫలితంగా రైతులకు నష్టం జరుగుతున్నది.

సమగ్ర ఉత్పత్తి ఖర్చులకు (సి2) 50 శాతాన్ని అదనంగా కలిపి కనీస మద్దతు ధరలను ప్రకటించాలని 200లో స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసింది. 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ స్వామినాథన్ కమిషన్ సిఫారసును అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ సిఫారసును అమలు చేయలేమని సుప్రీం కోర్టులో అఫిడవిట్ వేసింది. రైతు నేరుగా చెల్లించే ఖర్చులు (ఏ2), రైతు స్వంత కుటుంబ సభ్యుల శ్రమ విలువ (ఎఫ్‌ఎల్) కలిపిన మొత్తాన్ని (ఏ2+ఎఫ్‌ఎల్) ప్రస్తుతం మద్దతు ధరల ప్రకటనకు ప్రాతిపదికగా తీసుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం. దీనికి మాత్రమే 50శాతం లాభాన్ని కలిపి ధర ప్రకటిస్తున్నది.

రైతు స్వంత భూమికి కౌలు విలువను మద్దతు ధరల ప్రకటన సమయంలో పరిగణించటం లేదు. అలాగే రైతు పొలంలో పెట్టే స్థిర పెట్టుబడిని కానీ (ట్రాక్టరు కొనుగోలు, బోర్లు వేయడం, పొలంలో భవనం కట్టడం, నీళ్ళకోసం పైప్‌లైన్ వేయడం), ఈ పెట్టుబడిపై వడ్డీని కానీ పరిగణించటం లేదు. నిజానికి ఈ రెండు విలువలనూ కలిపితే మాత్రమే సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) అవుతుంది. దీనికే 50శాతం లాభాన్ని కలిపి ఇవ్వాలని స్వామినాథన్ కమిఇషన్ సిఫారసు చేసింది.

ఉదాహరణకు వరి సేద్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) రూ.1805. దీనికి స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం 50 శాతం లాభం కలిపితే కనీస మద్దతు ధర రూ.2702 అవుతుంది. కానీ ఏ2+ఎఫ్‌ఎల్‌ను ప్రాతిపదికగా పెట్టుకోవడం వల్ల ఉత్పత్తి ఖర్చును కేవలం రూ.1360గా తీసుకున్నారు. దీనికి 50 శాతం లాభం కలిపి రూ.2040ను మద్దతు ధరగా ప్రకటించారు.

ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో వాస్తవ ఖర్చులను కూడా సీఏసీపీ తక్కువగా నమోదు చేస్తున్నది. కొన్ని ఖర్చులను అసలు లెక్క వేయడమే లేదు. ముఖ్యంగా పంటల బీమా ప్రీమియం ఖర్చును లెక్క వేయడం లేదు. పంట నూర్పిడికి/ కోతకు అయ్యే కూలీ ఖర్చును కూడా లెక్క వేయడం లేదు. రెండేళ్ల క్రితం కాంట్రాక్టరుకు చెల్లింపు పేరుతో, కొంత మొత్తాన్ని నాటు/ లేదా కోత పేరుతో ఖర్చులలో ఇందుకోసం లెక్కవేసేవారు. కానీ ఈ ఏడు దాన్ని కూడా తొలగించారు. ధాన్యం లేదా ఇతర పంటలు ఆరబోయడానికి, క్లీనింగుకు అయ్యే ఖర్చులను, పొలం నుండి ఇంటికి, ఇంటి నుండి మార్కెట్టుకు రవాణా ఖర్చులను కూడా లెక్కించడం లేదు.

2022–23 సంవత్సరానికి భారీగా మద్దతు ధరలను పెంచామని కేంద్రం చెప్పుకుంటున్నది. కానీ తరచి చూస్తే గత ఏడాదితో పోల్చినప్పుడు వరి ధాన్యం ధర 5.15శాతం, సజ్జ ధర 4.44శాతం, రాగి ధర 5.95శాతం, మొక్కజొన్న ధర 4.92శాతం, కంది ధర 4.76శాతం, పెసర ధర 6.6శాతం, మినుము ధర 4.76శాతం, వేరుశనగ ధర 5.41శాతం, పొద్దు తిరుగుడు ధర 6.40 శాతం, నైజర్ సీడ్ ధర 5.15 శాతం, పత్తి ధర 6.18 శాతం మాత్రమే పెరిగాయి. ఈ ధరలన్నీ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ సంవత్సరానికి అంచనా వేస్తున్న ద్రవ్యోల్బణం రేటు 6.7శాతం కంటే తక్కువే. అంటే అంకెల్లో పెరిగినట్లు కనపడినా, రూపాయి నిజ విలువలో ఏ మాత్రం పెరగలేదని అర్థం. 2021–22 ధరలతో పోల్చి చూస్తే 2022–23లో వ్యవసాయ ఉపకరణాల ధరల సూచీ ఎక్కువ ఉండబోతున్నది. మనుషుల కూలీ ఖర్చు 5.97శాతం, ఎద్దు నాగళ్ళ కిరాయిలు 9.7శాతం, యంత్రాల కిరాయిలు 6.6శాతం, విత్తనాల ధరలు 9.9శాతం, రసాయన ఎరువుల ధరలు 7.3శాతం, సేంద్రీయ ఎరువుల ధరలు 9.5శాతం, పురుగు విషాల ధరలు 5.7శాతం, నీటి తీరువా ఛార్జీలు 3.7శాతం, మొత్తంగా వ్యవసాయ ఉపకరణాల రేట్లు 6.8శాతం పెరగనున్నాయి. ఈ సంవత్సరం పెంచిన మద్దతు ధర వీటికి అనుగుణంగా కూడా లేదు.

సాపేక్షికంగా ప్రతి సీజనులోనూ కూలీ రేట్లు పెరుగుతున్నాయి. కొంత యాంత్రీకరణ జరిగినా, ఇంకా కూలీల అవసరం ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా పత్తి తీయడానికి, ఇతర పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుకు కూలీల అవసరం ఎక్కువే. పైగా ఈ కూలీ రేట్లు ప్రతి జిల్లాకూ, ప్రతి ప్రాంతానికీ మారతాయి. సీఏ‌సీపీ కూలీల ఖర్చు కింద సేకరిస్తున్న మొత్తాన్ని పోల్చి చూస్తే, ఆచరణలో రైతులు చెల్లిస్తున్న కూలీ మొత్తాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన జీవన ప్రమాణాలతో పోల్చినప్పుడు, కూలీలకు పెరిగిన కూలి రేట్లు ఎక్కువేమీ కాదు. కానీ పెరిగిన కూలి రేట్లను దృష్టిలో పెట్టుకుని కనీస మద్దతు ధరలను ప్రకటించకపోవటం వల్ల రైతులపై భారం పడుతున్నది.

రాష్ట్రంలో రసాయన ఎరువుల వినియోగం కూడా ఎక్కువే. పైగా పొలం వరకూ ఎరువుల రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. సేంద్రీయ ఎరువుకు సీఏ‌సీపీ దృష్టిలో అసలు విలువే లేదు. పురుగులు, తెగుళ్లు, కలుపు నివారణకు రైతులు విషపూరిత రసాయనాలను ఎక్కువగానే వాడుతున్నారు. వాటి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. కానీ సీఏ‌సీపీ ఈ పెరుగుతున్న ధరలను పట్టించుకోవడం లేదు.

ఇప్పుడు తెలంగాణలో ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది కనుక రైతులకు విద్యుత్ విలువ, నీళ్ళ విలువా తెలియడం లేదు. కానీ ప్రతి రైతూ సంవత్సరానికి 360 రూపాయల సర్వీస్ ఛార్జీ అయితే కడుతున్నారు. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మార్లకు రిపేర్లు వస్తే చేయించుకుంటున్నారు. కానీ ఈ ఖర్చులను పూర్తిగా సీఏ‌సీపీ తన ఖర్చుల అంచనాలో తీసుకోవడం లేదు. రేపు విద్యుత్ చట్టం కారణంగా మోటార్లకు మీటర్లు పెట్టి, రైతులు విద్యుత్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తే ఖర్చు పెరుగుతుంది. ఆ ఖర్చులను సీఏ‌సీపీ పరిగణనలోకి తీసుకోకపోతే, రైతులు మరింత నష్టపోతారు.

రెండేళ్ల క్రితం సీఏ‌సీపీ తన ఖర్చులలో అదనంగా కాంట్రాక్టరుకు చెల్లింపు పేరుతో ఒక పద్దు చూపించేది, కొన్ని పంటల నాట్లు, కొన్ని పంటల కోతలకు అది ఖర్చుగా లెక్కించేది. కానీ ఈ సంవత్సరం అది పూర్తిగా ఖర్చుల లెక్కింపు నుంచి తీసేసింది. రైతులు వీటికోసం పెడుతున్న ఖర్చులు లెక్కలోకి రావడం లేదు.

రైతులు పెట్టుబడి కోసం ఎక్కువగా ప్రైవేటు ఋణాలపై ఆధారపడుతున్నారు. 100కు నెలకు 3 – 4 రూపాయల వరకూ వడ్డీ చెల్లిస్తున్నారు. కానీ సీఏ‌సీపీ వీటిని పరిగణనలో పెట్టుకోదు. ఎకరానికి వరికి రూ.35–40 వేలు ఖర్చుపెడితే ఆరు నెలలకు కేవలం రూ.439 నిర్వహణ పెట్టుబడిపై వడ్డీగా లెక్క వేశారు. అదే భవనాల, పనిముట్ల విలువ తరుగుగా కేవలం రూ.73ను సీఏ‌సీపీ తీసుకున్నది. వరి పంటకు కౌలు ఎకరానికి సీజనుకు కనీసం రూ.10–12 వేలు ఉంది. కానీ సీఏ‌సీపీ తీసుకున్న విలువ రూ.2205 మాత్రమే.

ప్రపంచంలో ఎవరు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసినా, దాని కోసం వాడిన స్వంత వనరుల వడ్డీ విలువను ఉత్పత్తి చేసే సరుకుల, సేవల ధరలో భాగం చేస్తాడు. ఇది సాధారణ వ్యాపార సూత్రం. కానీ మన దేశంలో రైతు స్వంత భూమిలో పంటలు పండిస్తే ఆ భూమికి ఏ విలువా లేదు. ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో దానికి విలువ ఇచ్చి, పంట ధర నిర్ణయ సమయంలో అసలు పరిగణనలో పెట్టుకోరు. లక్షలు ఖర్చుపెట్టి వ్యవసాయానికి అవసరమైన అనేక వనరులను రైతులు సమకూరుస్తారు. వీటిని స్థిర పెట్టుబడులు అంటారు. ఈ పెట్టుబడులను ఋణంగా తెస్తారు. లేదా స్వంత వనరులను వాడతారు. కానీ సీఏ‌సీపీ ధరల నిర్ణయం సమయంలో వీటికి అసలు విలువ ఇవ్వదు.

ఇవన్నీ చూసినప్పుడు మనకు స్పష్టంగా కేంద్రం ప్రకటించే మద్దతు ధరలలో అన్యాయం, అశాస్త్రీయత అర్థమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం కూడా స్పష్టమవుతుంది. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించకుండా, ప్రతి ఏటా కేంద్రం ప్రకటించే ఎం‌ఎస్‌పీకి అర్థమే లేదు. రాజ్యాంగం ఏడవ షెడ్యూలు ప్రకారం ధరల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నా, కేవలం సిఫారసు లేఖ రాసి చేతులు దులుపుకుంటున్న మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ అన్యాయంలో భాగం ఉంది.

Leave a Reply