కోట్లు కుమ్మరిస్తేనే ఓట్లు!

0
180
రాష్ట్రంలో భారీగా పెరిగిన ఎన్నికల ఖర్చులు
  • ఖర్చుల్లో బెంచ్​ మార్క్​ సెట్​ చేసిన హుజూరాబాద్​, మునుగోడు
  • బై పోల్స్​లో ఒక్కో ఓటరుకు రూ. 10 వేల దాకా పంపకాలు!
  • ఛోటా మోటా లీడర్ల కొనుగోళ్లకు అదనం
  • నేతల ప్రజాదరణ కన్నా పైసల చుట్టే తిరుగుతున్న ఎన్నికలు
  • ఖర్చును చూసి అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీల్లో ఎక్కువ టెన్షన్​

రూ. వంద కోట్లన్నా లేకుంటే కష్టమే!
2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం రూ.100 కోట్లు ఉండాల్సిందేనని ఓ సిట్టింగ్​ ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. లేకుంటే పోటీలో ఉన్నా ఓటర్లు, ఛోటా మోటా లీడర్ల డిమాండ్లను తట్టుకోవటం కష్టమని ఆయన అన్నారు. నిరుడు జరిగిన హుజూరాబాద్‌‌ ఉప ఎన్నిక కోసం చేసిన ఖర్చు దేశంలోనే రికార్డుగా పేరు తెచ్చుకుంది. పాల ప్యాకెట్లు పంచినట్లు ఆ నియోజకవర్గంలో ఓటుకు రూ. 6 వేల చొప్పున నోట్లను కవర్​లో పెట్టి ఇంటింటికీ పంచిన సంఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రభుత్వ, ప్రతిపక్షాలు గత రికార్డులను బ్రేక్ చేసే స్థాయిలో ఖర్చుపెట్టాయి. భవిష్యత్ ఎన్నికలకు కొత్త బెంచ్‌‌ మార్కును సెట్ చేశాయి. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రిజర్వుడు స్థానాలు మినహాయిస్తే అన్నిచోట్ల భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆశావహులు భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే వ్యక్తిగత పరపతి, ప్రజాదరణ గీటురాయిగా ఉండే రోజులు పోయాయని, పార్టీల నుంచి టికెట్​ తెచ్చుకోవడం కూడా అంత ఈజీ కాదని చెప్తున్నారు.

మునుగోడులో రూ. 500 కోట్లు దాటిన ఖర్చు!
2.41 లక్షల ఓట్లున్న మునుగోడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ఖర్చే ఇంచుమించుగా రూ. 200 కోట్లు దాటిపోయింది. నేరుగా ఓటర్లకు పంపిణీకి తోడు లీడర్ల కొనుగోళ్లు, ప్రచార ఖర్చులన్నీ మరో రూ. వంద కోట్లు దాటిపోయినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నెల రోజులు ప్రతి ఊరిలో మందు, విందుతో జాతర కొనసాగింది. ఆత్మీయ సమ్మేళనాల పేరిట విహార యాత్రలు, ప్రత్యేక వాహనాల్లో ఓటర్లను తరలించి కులాల వారీగా మీటింగ్​లకు భారీగా ఖర్చు చేశారు. కొన్ని పార్టీలైతే  ఇంటింటికీ  మటన్, చికెన్, లిక్కర్ పంచిపెట్టాయి. మందు, విందు కోసమే ఒక్కో కుటుంబానికి రూ.30 వేలు ఖర్చు చేసినట్లు ఓ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక్క నెల రోజుల్లో రూ. 300 కోట్ల లిక్కర్​ సేల్ అయింది. ఈ లెక్కన బై పోల్​లో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ పెట్టిన ఖర్చు రూ.500 కోట్లు దాటిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్నికల ఖర్చులు అసాధారణంగా పెరిగిపోయాయి. మొన్న హుజూరాబాద్, నిన్న మునుగోడు బైపోల్స్​లో ‘నువ్వా నేనా’ అన్నట్లుగా పార్టీలు పోటీపడి.. ఒక్కో ఓటుకు రూ. 10 వేలు పంచి పెట్టిన తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఆ ఖర్చును తలుచుకుంటేనే దడ పుడుతున్నదని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయాలనుకునేవాళ్లు అంటున్నారు. మునుగోడులో అధికార పార్టీ ఒక్కో ఓటుకు రూ. 5 వేలు ఇస్తే.. ప్రత్యర్థి రూ.4 వేలు ఇచ్చినట్లు ఓటర్లే బహిరంగంగా చెప్తున్న వీడియోలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆశించినన్ని డబ్బులు తమకు అందలేదని.. కొందరు ఓటర్లు లీడర్లను నిలదీసిన సంఘటనలూ ఉన్నాయి. తమ బలం చాటుకునేందుకు పార్టీలు ఇతర పార్టీల లీడర్లకు, ఛోటా మోటా నాయకులకు అడిగినంత ముట్టజెప్పి కండువాలు కప్పారనే ప్రచారం జరిగింది. అందుకే గ్రామాల్లో ఓటర్లు కూడా.. ‘‘లీడర్లకేనా డబ్బులు.. ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకేం లేదా..?’’ అన్నట్లుగా పట్టుబడుతున్నారు. డబ్బులిస్తేనే ఓటు గ్యారంటీ ఉంటుందని, లేకుంటే తమకు రావటం డౌటేనని, ప్రత్యర్థి కంటే ఎక్కువ పంచిపెట్టాల్సి ఉంటుందని లీడర్లు  అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు కుమ్మరించాల్సి ఉంటుందోనని వారు లెక్కలు వేసుకుంటున్నారు. కొందరైతే ఇప్పట్నుంచే డబ్బులు సర్దుబాటు చేసుకునే పనిలో పడ్డారు.

కోట్లు కుమ్మరిస్తేనే ఓట్లు!
ఎన్నికల ఖర్చులను చూసి అధికార పార్టీ వాళ్ల కన్నా ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఎక్కువగా టెన్షన్​ పడుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.40 లక్షలకు మించి ఖర్చు చేయొద్దు. కానీ, ప్రతి నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు రూ.100 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నరు. ఈసీ అధికారులు ఖర్చును కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవటం లేదనే విమర్శులొస్తున్నాయి. నోట్ల పంపి ణీకి సంబంధించి వందల కొద్దీ ఫిర్యాదులు వచ్చినా.. ఎవరైనా ఆధారాలు ఇస్తేనే చర్యలు తీసుకుంటమని ఈసీ దాటవేస్తున్నది. వాస్త వానికి ఆధారాలు సంపాదించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని నిపుణులు చెప్తున్నారు.  ప్రతి ఎన్నికకు ముందు ఫ్లైయింగ్ స్క్వాడ్‌‌‌‌ లు పెట్టామని ఈసీ ప్రకటిస్తున్నప్పటికీ.. కోడ్​ను ఉల్లంఘించి పార్టీలు చేస్తున్న ప్రలోభాలకు సంబంధించిన వ్యవహారాలను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నదనే ఆరోపణలు ఉన్నాయి.

Leave a Reply