గొర్రెల పైసలు అందేదెన్నడు?

0
39
  • బ్యాంకు ఖాతాల ఫ్రీజింగ్‌ ఎత్తేసేదెప్పుడు?
  • మునుగోడు ఉపఎన్నిక సమయంలో నిధుల జమ
  • ఆ వెంటనే లబ్ధిదారుల ఖాతాలు నిలుపుదల
  • డబ్బుల కోసం గొల్లకుర్మల ఎదురుచూపులు
  • రైతుబంధు, ధాన్యం డబ్బులూ తీసుకోలేని వైనం

నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం మునుగోడు నియోజకవర్గంలోని లబ్ధిదారులకు శాపంలా మారింది. ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. నియోజకవర్గంలో 2.40 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 30,849 మంది గొల్లకుర్మలు ఉన్నారు. దీంతో పైలట్‌ ప్రాజెక్టు అంటూ.. గొర్రెలకు బదులు వారి ఖాతాల్లో రూ.1.74 లక్షల చొప్పున నగదు జమ చేస్తామని ప్రకటించింది. 3,339 మంది ఖాతాల్లో డబ్బు కూడా జమ చేసింది. అయితే ప్రభుత్వం ఎన్నికల నియమావళికి విరుద్ధంగా యాదవుల ఓట్లను కొల్లగొట్టడానికి ఈ పథకాన్ని ప్రకటించిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. స్పందించిన సర్కారు.. వారి ఖాతాలను స్తంభింపజేసింది. రూ.35.86 కోట్లకు పైగా నిధులను ఫ్రీజ్‌ చేసింది. దీంతో డీడీలు తీసిన యాదవ కుటుంబాలు గొర్రెల నిధుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మునుగోడు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 7,600 మంది లబ్ధిదారులు ఉండగా ఈ పథకానికి రూ.81.62 కోట్లకు పైగా నిధులను కేటాయించి 3,339 మందికి నిధులు విడుదల చేసింది. కానీ, ఖాతాలను ఫ్రీజ్‌ చేయడంతో గొల్లకుర్మల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత డిసెంబరు 1నమునుగోడులో నిర్వహించిన సమీక్షలో గొర్రెల యూనిట్ల నిధుల గురించి ప్రజాప్రతినిధులు, యాదవ సంఘాల నాయకులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఫ్రీజింగ్‌ తొలగించలేదు. 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలును కొనడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనికితోడు మార్కెట్‌లో ధరలూ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్న చర్చ జరుగుతోంది.

రైతుబంధు డబ్బులూ తీసుకోలేని పరిస్థితి..
మునుగోడు నియోజకవర్గంలోని గొల్లకుర్మల కుటుంబాలు విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన గొర్రెల డబ్బులు ఫ్రీజింగ్‌లో ఉండగా.. ఇటీవల విక్రయించిన ధాన్యం డబ్బులు, ప్రభుత్వం వేస్తున్న రైతుబంధు సొమ్ము సైతం నిలిచిపోతున్నాయి. గొర్రెల యూనిట్ల నిధులు ఉన్న ఖాతాలోనే ధాన్యం, రైతుబంధు డబ్బులు పడడంతో ఆ డబ్బులను కూడా డ్రా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రైతులకు యాసంగి సీజన్‌కు సంబంధించి పెట్టుబడులు కావాల్సిన నేపథ్యంలో ఖాతాల నుంచి సొమ్ములు తీసుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు, ధాన్యం డబ్బులనైనా ఇవ్వాలని బ్యాంకు మేనేజర్లను అడిగితే.. గొర్రెల డబ్బులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు ఫ్రీజింగ్‌ను ఎత్తివేసే సమస్య లేదని చెబుతున్నారు. త్వరలోనే ఫ్రీజింగ్‌ ఎత్తివేసి లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు అందజేస్తామని పశుసంవర్ధక శాఖ కీలక అధికారి తెలిపారు.

నిధులు వెంటనే ఇవ్వాలి
గొల్లకుర్మలకు గొర్రెల యూనిట్ల నగదును వెంటనే లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలి. ఎన్నికలు ముగిసి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. వెంటనే నిర్ణయం తీసుకోవాలి.
– ఎరసాని సైదులు, మునుగోడు

Leave a Reply