స్కీమ్​ల టార్గెట్ మునుగోడు

0
51
ముందు ఉప ఎన్నికను లైట్‌‌ తీసుకున్న టీఆర్ఎస్
  • దళితబంధు, ఇండ్లు, గొర్రెలు, చేపల పంపిణీకి రంగం సిద్ధం
  • పది రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు
  • ముందు ఉప ఎన్నికను లైట్‌‌ తీసుకున్న టీఆర్​ఎస్
  • ఇప్పుడు -పథకాలు, నియామకాలతోనే గట్టెక్కాలని ఎత్తుగడ
  • మునుగోడులోనే అమలు చేస్తే విమర్శలు వస్తాయని రాష్ట్రమంతా ఇచ్చేందుకు ఏర్పాట్లు

హైదరాబాద్‌‌ : సంక్షేమ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లతో మునుగోడు ఉప ఎన్నికలో గట్టెక్కాలని టీఆర్‌‌ఎస్‌‌ ఎత్తుగడలు వేస్తున్నది. బై పోల్​కు ముందు ప్రజలపై వరాల జల్లు కురిపించేందుకు సిద్ధమైంది. సొంత జాగాల్లో ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షల నగదు సాయం చేసేందుకు, దళితబంధు, గొర్రెలు, చేపల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నది. యువతలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తగ్గించుకునేందుకు.. పది రోజుల్లోనే 28 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. మొదట మునుగోడు ఉప ఎన్నికను లైట్‌‌గా తీసుకున్న టీఆర్​ఎస్​ పార్టీ .. కేసీఆర్‌‌ చరిష్మా, పార్టీ శ్రేణులతోనే గెలుస్తామని చెప్పుకుంది. గ్రౌండ్‌‌లో పరిస్థితి వేరుగా ఉండటంతో ఇప్పుడు స్కీమ్​లు, ఉద్యోగ నోటిఫికేషన్లతోనే బయటపడాలని చూస్తున్నది. ఒక్క మునుగోడులోనే వీటిని అమలు చేస్తే రాష్ట్రమంతటా వ్యతరేకత వస్తుందని భావించి అన్ని నియోజకవర్గాల్లోనూ అమలుకు సిద్ధమవుతున్నది. వివక్ష లేదనిపించుకునేందుకు పథకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రకటించి, ముందైతే మునుగోడులో అమలు పరిచి తక్షణ లాభం పొందే యోచనలో ఉంది. చేపల పంపిణీని సోమవారమే మొదలు పెట్టనుంది. డిసెంబర్‌‌లోగా నియోజకవర్గానికి 500 మందికి దళిత బంధు, 3 వేల మందికి ఇండ్ల సాయం ఇచ్చేందుకు అవసరమైన నిధులు సమకూర్చే పనిలో ఉంది.

3 వేల ఇండ్లకు రూ. 3 లక్షల చొప్పున సాయం
సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షలు ఇచ్చే స్కీంను దసరా నుంచి ప్రభుత్వం ప్రారంభించనుంది. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల ఇండ్ల నిర్మాణానికి సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డిసెంబర్ వరకు కనీసం వెయ్యి చొప్పున ఇండ్ల నిర్మాణానికి సాయం  చేసే చాన్స్​ ఉంది. అంటే.. రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల ఇండ్లకు రూ. 3 లక్షల చొప్పున రూ.3,750 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 75 వేల చొప్పున విడుదల చేస్తారు. ఈ లెక్కన మొదట రూ. 892.5 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని  హౌసింగ్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌  కోరనుంది. లబ్ధిదారుల ఎంపిక పూర్తికాగానే ఆ వివరాలు నివేదించి వారి బ్యాంకు ఖాతాల్లో నిధులు జమచేయనుంది.

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా దళితబంధు స్కీంను సీఎం కేసీఆర్​ ప్రకటించారు. హుజూరాబాద్‌తో పాటు మరో నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో, 118 నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున కలిపి 40 వేల మందికి రూ. 10 లక్షల చొప్పున సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 31,088 యూనిట్లే గ్రౌండింగ్‌ అయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఈ డిసెంబర్‌లోపు 500 యూనిట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలను కేసీఆర్​ ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గానికి 1,500 మందికి ఈ స్కీం కింద రూ.17,700 కోట్లు కేటాయించారు. నిధుల లేమి, ఇతర కారణాలతో స్కీంను ప్రస్తుతానికి 500 మందికి కుదించారు. 2021– 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా రూ. 550 కోట్లు పైగా నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు నియోజకవర్గానికి 500 మంది చొప్పున అంటే 59,000 మందికి దళితబంధు ఇవ్వాల్సి ఉన్నది. ఇందుకు దాదాపు రూ. 6 వేల కోట్లు అవసరం. ఈ ఆర్థిక సవంత్సరానికి రూ. 17,700 కోట్లకు బీఆర్వో ఇచ్చి ఐదు నెలలు అవుతున్నా ఒక్క పైసా ఇవ్వలేదు.

అప్పట్లో హుజూరాబాద్​లోనే గొర్రెలు ఇవ్వడంతో..!
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక టైంలో ఆ ఒక్క నియోజకవర్గంలో మాత్రమే గొర్రెలు ఇవ్వడంతో విమర్శలు వచ్చాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నిక వేళ రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీ స్కీమ్​ అమలు చేయబోతున్నది. పశుసంవర్ధక శాఖ క్షేత్రస్థాయి అధికారులు లబ్ధిదారుల నుంచి 25 శాతం వాటా నిధుల సేకరణ షురూ చేశారు. ఒక్కో యూనిట్‌కు కేటాయించిన రూ.1.75 లక్షల్లో  లబ్ధిదారు వాటాగా రూ.43,750 గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు జిల్లాల్లో  దాదాపు 10 వేల మంది తమ వాటా నిధులను చెల్లించారు. ఈ–లాబ్‌ పోర్టల్‌లో లబ్ధిదారుల వివరాలను నమోదు చేసి రిజిస్టర్‌ చేస్తున్నారు. లబ్ధిదారు వాటాను డీడీల రూపంలో కాకుండా ఈ– లాబ్‌ పోర్టల్‌లో రిజిస్టర్‌ అయిన వర్చువల్‌ అకౌంట్‌లో ఆర్‌టీజీఎస్‌,  నెఫ్ట్‌ ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గొర్రెల కొనుగోళ్లు, పంపిణీ విధానంపై మార్గదర్శకాలు రూపొందించేందుకు  పశుసంవర్ధక శాఖ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి.

ఇయ్యాల్టి నుంచి చేపల పంపిణీ
మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీని సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌‌ యాదవ్ ఘన్‌‌పూర్‌‌ రిజర్వాయర్‌‌లో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా స్టార్ట్​ చేస్తారు. ఈ ఏడాది ప్రభుత్వం 26,778 నీటి వనరుల్లో రూ. 68  కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనుంది. చేప పిల్లల సప్లయ్‌‌తో పాటు వాటిని ఏ నీటి వనరుల్లో ఎన్ని విడుదల చేశారు.. ఏ రకం విడుదల చేశారు అనే వివరాలు, ఫొటోలను ఏ రోజుకు ఆ రోజు నమోదు చేసేలా ‘మత్స్యమిత్ర’ యాప్‌‌ తీసుకొచ్చింది.

Leave a Reply