‘అయోధ్య’ తీర్పును సవాల్ చేస్తాం

0
218
  • ముస్లిం పర్సనల్‌ లాబోర్డు నిర్ణయం
  • ఐదెకరాల భూమినీ తిరస్కరించాలని తీర్మానం
  • పిటిషన్‌ వల్ల ఉపయోగం ఉండదు: ప్రధాన కక్షిదారు
  • సమావేశానికి గైర్హాజరయిన సున్నీ వక్ఫ్‌బోర్డు చీఫ్‌
  • ముస్లింలు సుప్రీం తీర్పును గౌరవించాలి: వీహెచ్‌పీ

అయోధ్య వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష పిటిషన్‌ వేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లాబోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. అంతేకాదు.. సుప్రీం తీర్పు ప్రకారం మసీదు నిర్మాణానికి కేటాయించే ఐదెకరాలను తిరస్కరించాలని కూడా ఆదివారం జరిగిన భేటీలో బోర్డు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 9 లోగా పిటిషన్‌ వేస్తామని.. సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ తమ తరఫున వాదిస్తారని బోర్డు కార్యదర్శి జఫర్యాబ్‌ జిలానీ మీడియాకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు అర్థమయ్యేలా లేదు కాబట్టి సమీక్షకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మసీదు ఉన్న స్థలం అల్లాకే చెందుతుంది. షరియా చట్టం ప్రకారం ఆ భూమిని వేరెవరికీ ఇవ్వకూడదుఅని ఆయన స్పష్టం చేశారు. బాబ్రీమసీదుకు బదులుగా అయోధ్యలో వేరొక చోట భూమి ఇస్తామంటే తీసుకోకూడదని భేటీలో బోర్డు విస్పష్టంగా నిర్ణయం తీసుకుందని.. మసీదుకు ప్రత్నామ్నాయం ఉండబోదని అభిప్రాయపడిందని ఆయన వివరించారు. మేం వేసే సమీక్ష పిటిషన్‌ను కోర్టు 100 శాతం కొట్టేస్తుందని మాకు తెలుసు. అయినప్పటికీ అది మా హక్కు. కాబట్టి రివ్యూ పిటిషన్‌ వేయబోతున్నాంఅని ఈ భేటీలో పాల్గొన్న జమియత్‌ ఉలేమా ఏ హింద్‌ అధ్యక్షుడు మౌలానా అర్షద్‌ మదానీ తెలిపారు. సుప్రీం తీర్పుపై తాము సమీక్ష పిటిషన్‌ వేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. మరోవైపు.. అయోధ్య కేసులో ప్రధాన కక్షిదారైన ఇక్బాల్‌ అన్సారీ మాత్రం సమీక్ష పిటిషన్‌పై అనాసక్తిగా ఉన్నారు.సమీక్షల కోసం వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండదు. ఫలితం మళ్లీ అలాగే వస్తుంది. పైగా, అలాంటి పని చేయడం వల్ల సామరస్య వాతావరణానికి విఘాతం కలుగుతుంది అని ఆయన తేల్చిచెప్పారు. సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జాఫర్‌ ఫారూఖీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యేందుకు నిరాకరించారు. మజ్లిస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ తదితురులు ఏఐఎంపీఎల్‌బీ సమావేశంలో పాల్గొన్నారు. కాగా.. సుప్రీం తీర్పును ఏఐఎంపీఎల్‌బీ గౌరవించాలని కేంద్ర మంత్రి షానవాజ్‌హుస్సేన్‌ పిలుపునిచ్చారు.

భక్తులకు రామ్‌నామ్‌ బ్యాంకు బోనస్‌…అయోధ్య తీర్పు రామాలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో.. అలహాబాద్‌లోని రామ్‌నామ్‌బ్యాంకు తన ఖాతాదారులకు బోనస్‌ ప్రకటించింది. పేరుకే ఇది బ్యాంకుగానీ.. దీనికి ఏటీఎంలు, చెక్కుబుక్కులు ఏవీ ఉండవు. రామనామం రాయడమే ఈ బ్యాంకులో డిపాజిట్‌ కింద లెక్క. సుప్రీంతీర్పుతో తా జాగా ఈ బ్యాంకు ఒక ప్రకటన చేసింది. భక్తులు రాసి న ఒక్కో నామాన్నీ రెండుసార్లు రాసినట్టు పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. అంతేకాదు, నవంబరు 9-10 నాటికి కనీసం 1.25 లక్షల సార్లు రామనామం రాసినవారికి అవార్డు ప్రకటించింది. 2020లో జరిగే మాఘ మేళాలో వారికి శాలువా కప్పి, శ్రీఫలం ఇస్తామని పేర్కొంది. ఇక రామ ‘కోటి’ రాసిన 12 మం దికి ఆ కార్యక్రమంలో ఉచిత వసతి కల్పిస్తామంది.

ఆలయానికి ఆ భూమి చాలదు…అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూమి సరిపోదు. గుడి నిర్మాణానికే ఇంకా స్థలం కావాలి. టౌన్‌షి్‌ప నిర్మాణానికైతే మరింత స్థలం అవసరమవుతుంది. అన్నదాన సత్రం, పూజారులు ఉండటానికి అవసరమైన నివాసాలు, యాత్రికుల కోసం వసతిగృహాలకు సంబంధించి ప్రణాళికలు రచించాం. వాటితోపాటు హోటళ్లు, ఆస్పత్రులను కూడా నిర్మించాల్సి ఉంది. గర్భగుడిలో రామ్‌ లల్లా విగ్రహం 7 అడుగుల ఎత్తున ఉంటుంది.

                                                                               – ప్రధాన శిల్పి చంద్రకాంత్‌ సోంపురా

బగ్దాదీకి, ఒవైసీకి తేడా లేదు…హతమైన ఐసిస్‌ నాయకుడు అబూబకర్‌ అల్‌ బగ్దాదీకి, ఒవైసీకి తేడా లేదు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు బగ్దాదీ.. ఆయుధాలను ఉపయోగించినట్లే.. ఒవైసీ కూడా తన ప్రసంగాలతో ముస్లింలను ఉగ్రవాదం, రక్తపాతం వైపు వెళ్లేలా రెచ్చగొడుతున్నారు. ఒవైసీపై, అలాగే ముస్లిం పర్సనల్‌ లా బోర్డుపైనా నిషేధం విధించాలి. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ.51 వేలు విరాళం ఇస్తా. మందిర నిర్మాణానికి షియా వక్ఫ్‌బోర్డు మద్దతు తెలుపుతోంది. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు అత్యుత్తమమైనది.

                                                                                – వసీమ్‌ రిజ్వీ, షియా వక్ఫ్‌బోర్డు చైర్మన్‌

Courtesy Andhrajyothy…

Leave a Reply