ఆస్కార్‌ రేసులో నా పాట సూడు

0
212
  • ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో నాటు నాటు నామినేషన్‌
  • తుది జాబితాలో చోటు దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాంగ్‌
  • ఇప్పటికే గోల్డెన్‌ గ్లోబ్‌ సహా పలు అంతర్జాతీయ అవార్డులు
  • మార్చి 12న ఆస్కార్‌ అవార్డుల ప్రకటన.. సాధిస్తే చరిత్రే!
  • అవార్డు వస్తే.. ఆస్కార్‌ విజేతలుగా కీరవాణి, చంద్రబోస్‌
  • గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్లు..
  • సెవులు సిల్లు పడేలా కీసుపిట్ట కూసినట్టు
  • ఒల్లు సెమట పట్టేలా వీరంగం సేసినట్టు
  • తెలుగు పాట సూడు అంటూ..
  • ఆస్కార్‌ నోటా నాటు నాటు

ఈ అరుదైన ఘనతకు కారణమైన నా టీమ్‌కు అభినందనలు. ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు
– ఎంఎం కీరవాణి

నాటు నాటు పాట నా హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. గొప్ప, అరుదైన ఘనతను సాధించిన కీరవాణి, చంద్రబోస్‌గారికి నా అభినందనలు.
– జూనియర్‌ ఎన్టీఆర్‌

అద్భుతమైన వార్త. ‘నాటు నాటు’ ఆస్కార్‌కు నామినేట్‌ కావడం గొప్ప గౌరవం. మనకూ, దేశానికి గర్వకారణమైన క్షణాలు ఇవి. కీరవాణిగారు ఈ గౌరవానికి అర్హులు. చిత్ర బృందానికి నా అభినందనలు.
– రామ్‌చరణ్‌

తెలుగు సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. భారతీయ సినిమా అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఆశించినట్లుగానే దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు సాధించింది. సంగీత దర్శకుడు కీరవాణి స్వరపరిచిన ఈ పాట.. ఉత్తమ ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో నామినేట్‌ అయింది. కొన్ని రోజుల క్రితమే ఈ పాటకు ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ విభాగంలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. లాస్‌ఏంజెలె్‌సలో జరిగిన 28వ క్రిటిక్స్‌ చాయిస్‌ అవార్డ్స్‌లో కూడా రెండు విభాగాల్లో పురస్కారాలు సాధించింది. ఇలా వరుసగా అంతర్జాతీయ అవార్డులు సాధించి తెలుగు వారి సత్తా చాటిన ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్‌ కావడంతో భారతీయ సినిమా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మార్చి 12న ప్రకటించే ఆస్కార్‌ అవార్డుల్లో కూడా ‘నాటు నాటు’ పాట జెండా ఎగురవేయాలని తెలుగు సినిమా అభిమానులు కోరుకుంటున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం జాతీయంగానే కాదు.. అంతర్జాతీయంగానూ పలువురు ప్రముఖులు, విమర్శకుల మన్ననలందుకుంటోంది. అమెరికా థియేటర్లలో విదేశీయులు సైతం ‘నాటునాటు’ పాటకు స్టెప్పులు వేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ సినిమాను చూసి పలువురు హాలీవుడ్‌, యూరోపియన్‌ చిత్ర దర్శకులు, నటులు.. అలాగే సమీక్షకులు ట్విటర్‌లో ఈ సినిమా గురించి పోస్టులు పెడుతుండడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విస్తృతి పెరుగుతూ పోయింది! హాలీవుడ్‌ అలనాటి మేటి దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ వంటివారు సైతం ఈ సినిమా గురించి ప్రస్తావించారు. టైటానిక్‌, ‘అవతార్‌’ వంటి అద్భుతచిత్రాల దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ అయితే.. ఈ సినిమాను రెండు సార్లు చూసి ప్రశంసలు కురిపించడమే కాక, రాజమౌళిని అభినందించి.. ‘హాలీవుడ్‌లో సినిమా తీసే ఆలోచన ఉంటే చెప్పు, మాట్లాడుకుందాం’ అని భుజం తట్టడం విశేషం.

అధికారిక ఎంట్రీ కాకున్నా..:
ఇంతకుముందు మన దేశం నుంచి ‘మదర్‌ ఇండియా (1957)’, ‘సలామ్‌ బాంబే(1988)’, ‘లగాన్‌ (2001)’ చిత్రాలను ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో అధికారిక ఎంట్రీలుగా పంపారు. అవి ఆస్కార్‌కు నామినేట్‌ అయ్యాయిగానీ.. అవార్డు రాలేదు. గత ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని అధికారికంగా మన దేశం నుంచి పంపిస్తారని రాజమౌళి బృందం ఆశించింది. అయితే ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మనదేశం నుంచి గుజరాతి’ చిత్రం ‘చెల్లో షో’ ను అధికారిక ఎంట్రీగా ఆస్కార్‌కు పంపడంతో.. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందం నిరుత్సాహ పడకుండా ‘ఫర్‌ యువర్‌ కన్సిడరేషన్‌’ క్యాంపెయిన్‌లో భాగంగా 14 విభాగాల్లో నామినేషన్లు పంపింది. అనంతరం అమెరికాలో మకాం వేసి, రకరకాల ప్రమోషన్స్‌తో ప్రపంచ ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగింది. భారత్‌ నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన ‘చెల్లో షో’ ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.

నాటు నాటు వర్సెస్‌..
ఒరిజనల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ బరిలో ఫైనల్‌కు చేరిన పాటలు మొత్తం ఐదు ఉన్నాయి. వాటిలో ఒకటి మన ‘నాటు నాటు’. మిగతావి.. ‘టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌’ (అప్లాజ్‌), ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ (టాప్‌గన్‌.. మావెరిక్‌), ‘లిఫ్ట్‌ మీ అప్‌’(బ్లాక్‌ పాంథర్‌), ‘దిస్‌ ఈజ్‌ ఎ లైఫ్‌’ (ఎవ్రీథింగ్‌ ఎవీవ్రేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌)’ పాటలు. వీటిల్లో టామ్‌ క్రూజ్‌ హీరోగా వచ్చిన ‘టాప్‌ గన్‌ మావెరిక్‌’ చిత్రంలో ‘లేడీ గాగా’ రాసి, స్వరపరిచిన ‘హోల్డ్‌ మై హ్యాండ్‌’ పాట.. మార్వెల్‌ సూపర్‌హీరో చిత్రం ‘బ్లాక్‌పాంథర్‌: వకాండా ఫరెవర్‌’లో రిహానా పాడిన ‘లిఫ్ట్‌ మీ అప్‌’ పాట ‘గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌’లో కూడా మన ‘నాటు నాటు’ పాటతో పోటీ పడ్డాయి. కానీ చివరికీ గెలుపు మన పాటదే అయింది.

‘అవతార్‌’ దర్శకుడికి దక్కని నామినేషన్‌
అద్భుత చిత్రాల సృష్టికర్త జేమ్స్‌ కామెరూన్‌ను ఇప్పుడు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన తాజా చిత్రం ‘అవతార్‌ .. ద వే ఆఫ్‌ వాటర్‌’ ఇటీవల విడుదలై వసూళ్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకు గాను ఉత్తమ దర్శకుడి విభాగంలో ఆయన ఆస్కార్‌కు నామినేట్‌ అవుతారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఆయన దర్శకత్వం వహించిన ‘అవతార్‌ ద వే ఆఫ్‌ వాటర్‌’ చిత్రం మాత్రం ఉత్తమ చిత్రం కేటగిరిలో నిలిచింది.

‘సినిమా దేవుడు’గా దర్శకుడు రాజమౌళి ఆరాధించే స్టీవెన్‌ స్పీల్‌ బర్గ్‌ మాత్రం ‘ద ఫేబుల్‌మాన్స్‌’ చిత్రానికిగాను ఉత్తమ దర్శకుడుగా నామినేట్‌ అయ్యారు.

అలాగే డాక్యుమెంటరీ ఫీచర్‌ కేటగిరిలో మనదేశానికి చెందిన శౌనక్‌ సేన్‌ రూపొందించిన ‘ఆల్‌ దట్‌ బ్రీత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ‘ద ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ చిత్రాలు నామినేట్‌ అయ్యాయి.

అందరికీ థాంక్స్‌
నా చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు మా పెద్దన్న ఆస్కార్‌ నామినేషన్‌ పొందారు. ఇంతకంటే ఇంకేం కావాలి. ఇప్పుడు తారక్‌, చరణ్‌ను మించిపోయేలా నేను ‘నాటు నాటు’ పాటకు డాన్స్‌ చేస్తున్నాను. చంద్రబో్‌సగారికి కృతజ్ఞతలు… మీవల్లే ఆస్కార్‌ వేదికపై మన పాట వినిపిస్తోంది. ఈ పాట రూపకల్పనలో ఊగిసలాడుతున్న నాకు.. భైరవ నేపథ్య సంగీతం భరోసానిచ్చింది. ముందుకెళ్లవచ్చు అనే నమ్మకం కలిగింది. థాంక్యూ భైరి బాబూ. ప్రేమ్‌మాస్టర్‌… ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. నా పర్సనల్‌ ఆస్కార్‌ మీకే. ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌. వారి స్టైల్‌. సమన్వయం అద్భుతం. తమదైన శైలిలో వారు చేసిన డాన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించింది. అయితే షూటింగ్‌లో వారిని కష్టపెట్టినందుకు క్షమించమని అడుగుతున్నాను. అవకాశం దొరికితే మరోసారి వారిద్దరినీ ఆడేసుకోవడానికీ నేను వెనుకాడను. ఆస్కార్‌ వరకూ వెళతానని నేను ఎప్పుడూ అనుకోలేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం, ‘నాటు నాటు’ పాటకు ఉన్న అభిమానుల వల్లే ఈ ఘనత సాధ్యమైంది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలుపన్నది లేనట్లు పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇదంతా సాధ్యంకాదు. నిన్ను చూసి గర్విస్తున్నాను కార్తికేయ. సోషల్‌ మీడియాలో ‘నాటునాటు’ పాటకు విస్తృత ప్రచారం కల్పించిన ప్రదీప్‌, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు.
– రాజమౌళి

ఈ పాట చెక్కిన శిల్పులు వీళ్లే!
GGH.jpgదర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళిని అందరూ ‘జక్కన్నా..’ అని పిలుచుకొంటుంటారు. సినిమాని ఓ శిల్పంలా జాగ్రత్తగా చెక్కుతాడు కాబట్టే ఆ పేరు. ‘నాటు… నాటు’ వెనుక మాత్రం.. ఆయనొక్కరే కాదు, చాలామంది శిల్పులు ఉన్నారు. ఎందుకంటే పాటనేది ఒక్కరి మదిలో మెదిలే ఆలోచనే కావొచ్చు. కానీ ఓ పాట తెరపై అందమైన దృశ్య కావ్యంగా ఆవిష్కరించాలంటే మాత్రం చాలామంది చేతులు కలపాలి. హీరోల బలాబలాలకు అనుగుణంగా సినిమాలో సన్నివేశాల్ని, పాటల్ని, పోరాట ఘట్టాల్ని డిజైన్‌ చేయడంలో దిట్ట అయిన రాజమౌళి.. ఈ పాటకు అవసరమైన నేపథ్యాన్ని సిద్ధం చేశారు. ఇందులో డాన్స్‌ చేసేది.. ఇద్దరు డాన్సింగ్‌ స్టార్లయిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కావడంతో వారి నాట్య ప్రతిభను శిఖరసమానంగా చూపేలా ఈ పాటని డిజైన్‌ చేశారు. అంతేకాదు.. ఈ ఒక్క పాటలోనే రామ్‌ (చరణ్‌), భీమ్‌ (ఎన్టీఆర్‌)ల మధ్య స్నేహాన్ని, భీమ్‌ కోసం రామ్‌ చేసే త్యాగాన్ని.. ఇలా అనేక పార్శ్వాలను ఇమిడ్చారు. తెలుగు వాడి సత్తా, ప్రతిభ ఆంగ్లేయుల ముందు ప్రదర్శించాల్సి వచ్చినప్పుడు ఈ పాట మొదలవుతుంది. గీత రచయిత చంద్రబో్‌సకు ఈ నేపథ్యాన్ని వివరించిన రాజమౌళి, కీరవాణి.. ‘‘చరణ్‌, ఎన్టీఆర్‌ల నాట్య ప్రతిభకు ఈ పాట తార్కాణంగా ఉండాలి. 1920 నాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా పదాలు ఉండాలి’’ అని చెప్పారంతే. అప్పటికి ట్యూను లేదు. అయితే.. ‘ఆంగ్లేయుల్ని కించపరిచేలా ఒక్క పదం కూడా ఉండకూడదు’ అనే మాట మాత్రం చెప్పారు కీరవాణి. అక్కడి నుంచి చంద్రబోస్‌ కసరత్తు ప్రారంభమైంది. ‘నాటు.. నాటు.. నాటు..’ అనే హుక్‌లైన్‌ అనుకున్న చంద్రబోస్‌.. కీరవాణికి అత్యంత ఇష్టమైన 6-8 బాణీలో డమ్మీ ట్యూనుతో పాట అల్లుకున్నారు. రెండు రోజుల్లోనే మూడు పల్లవులు రాశారు. దాదాపు 80ు పాట పూర్తయిపోయింది. కానీ.. మిగిలిన 20 శాతం ముగించడానికి దాదాపు 18 నెలల సమయం పట్టింది. చివరికి ఉక్రెయిన్‌లో పాట తెరకెక్కిస్తున్నప్పుడు కూడా చివరి లైన్లు మార్చాల్సివచ్చింది. పాట రాయడం పూర్తయ్యాక.. రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ కలిసి ఆలపించారు.

రికార్డు చేసేటప్పుడు.. ఈ పాట ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కోసమని రాహుల్‌ సిప్లిగంజ్‌కు తెలీదు. కేవలం కీరవాణి తనతో ట్రాక్‌ పాడించుకొంటున్నారని ఆయన భావించారు. తీరా.. ఈ పాట ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఆల్బమ్‌లో చేరింది. పాట రాయడం, పాడడం పూర్తయింది. మిగిలింది.. డాన్స్‌. ఇలాంటి పాటకు కొరియోగ్రఫీ చేయడం అంత సులభం కాదు. ఎందుకంటే చరణ్‌, ఎన్టీఆర్‌.. ఇద్దరూ అద్భుతమైన డాన్సర్లే. వాళ్ల స్పీడుని, బాడీ లాంగ్వేజ్‌నీ దృష్టిలో ఉంచుకొని, ఇద్దరికీ సరితూగేలా స్టెప్పులు డిజైన్‌ చేయాలి. ఈ నేపథ్యంలో.. ఈ పాట కోసం సుమారు 95 రకాల స్టెప్పుల్ని కంపోజ్‌ చేశారు ప్రేమ్‌ రక్షిత్‌. ఎన్టీఆర్‌, చరణ్‌ భుజాల మీద చేతులు వేసి చేసిన సిగ్నేచర్‌ స్టెప్పు కోసం 30 రకాల ఆప్షన్లు రెడీ చేశారు. అందులో రాజమౌళి ఒకదాన్ని ఎంచుకొన్నారు. అదే ఇప్పుడు తెరపై కనిపిస్తోంది. ఆ స్టెప్పు షూటింగ్‌కి ఏకంగా 17 టేకులు తీసుకున్నా.. చివరికి రెండో టేక్‌నే ఫైనల్‌ చేశారు. ఈ పాటని ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంటు భవనం ముందు తెరకెక్కించారు. అక్కడ చిత్రీకరణ జరుపుకొన్న తొలి చిత్రం ఇదే. ఈ పాట పోగ్రామింగ్‌ మొత్తాన్నీ కీరవాణి తనయుడు కాలభైరవ చూసుకొన్నారు.

Leave a Reply