కడుపుశోకం మిగిల్చిన నిర్లక్ష్యం!

0
19
  • జాలి లేదు.. జాలీలూ లేవు!
  • న్యూబోయిన్‌పల్లి వద్ద నాలాలో పడి బాలుడి దుర్మరణం
  • రోదిస్తున్న బాలుడి తల్లి చంద్రకళ

హైదరాబాద్‌, కంటోన్మెంట్‌: గుత్తేదారు నిర్లక్ష్యం పసివాడి ప్రాణాన్ని బలితీసింది. కన్నవారికి కడుపుశోకం మిగిల్చింది. హైదరాబాద్‌ న్యూబోయిన్‌పల్లి ఆనంద్‌నగర్‌లో ఓ బాలుడు శనివారం ప్రమాదవశాత్తూ కాలుజారి నాలాలో పడి మృతి చెందాడు. కళ్లెదుట బురదలో కూరుకుపోతున్న కన్నబిడ్డను కాపాడుకునేందుకు తండ్రి ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. పిల్లల అల్లరితో బాధలు మరచిపోయే పేదింట చీకటి అలుముకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వొంగూరు మండలం జాజలకు చెందిన ఆంజనేయులు ప్రైవేటు బస్సు డ్రైవర్‌. బతుకుదెరువుకు పదేళ్ల క్రితం కుటుంబంతో కలిసి నగరానికి వచ్చారు. భార్య చంద్రకళ స్థానికంగా ఇళ్లలో వంటపని చేస్తుంటారు. ఇద్దరు కుమారులు చరణ్‌జీత్‌, ఆనంద్‌సాయి(7) ఉన్నారు. ఆనంద్‌నగర్‌లో వారు అద్దెకు ఉంటున్న ఇల్లు పక్కనే హస్మత్‌పేట్‌ నాలా ఉంటుంది. నెలరోజులుగా నాలా ప్రహరీ నిర్మాణానికి పనులు జరుపుతున్నారు. ఈ క్రమంలో రక్షణగా గుత్తేదారు సంస్థ ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. నాలుగు రోజుల క్రితం కుటుంబం.. బంధువుల ఇంట అంత్యక్రియలకు సొంతూరు వెళ్లి వచ్చింది. శనివారం ఉదయమే తల్లి పనిలోకి వెళ్లింది. తండ్రి ఇంట్లోనే ఉన్నాడు. చరణ్‌జీత్‌ పక్కింటి పిల్లలతో ఉన్నాడు. ఉదయం 9.50 గంటల సమయంలో ఆనంద్‌సాయి.. ఇంటికి, నాలాకు మధ్యనున్న కొద్దిపాటి స్థలంలో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా అక్కడి మట్టి కుంగిపోవడంతో.. రెప్పపాటులో కిందకు జారిపోయి నాలాలోని మురుగులో పడిపోయాడు. ఇది గమనించిన పక్కింటి బాలుడు తన తండ్రికి చెప్పాడు. ఈత రాకపోవడంతో అతను బాలుడి తండ్రికి చెప్పాడు. మునిగిపోతున్న కొడుకును కాపాడుకునేందుకు తండ్రి వెంటనే అందులోకి దూకాడు. ఆచూకీ కోసం శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం పోలీసులు, అగ్నిమాపక దళం, కంటోన్మెంట్‌ బోర్డు, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, గత ఈతగాళ్లు రంగంలోకి దిగారు.

బురదలో చిక్కి విలవిల్లాడి..
నిర్మాణం కోసం జరిపిన తవ్వకాలతో సదరు ప్రాంతంలో లోతు 7-8 అడుగులకు చేరింది. నెలరోజులుగా నీరు నిల్వ ఉండటంతో భారీగా బురద చేరింది. దీంతో బాలుడు నాలాలోకి పడిపోగానే బురదలో కూరుకుపోయాడు. నాలా నీటిలో కొట్టుకుపోయి ఉండవచ్చనే ఉద్దేశంతో తొలుత చుట్టుపక్కల వెతికారు. ఉదయం 11.30 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌ శివ బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. బాలుడు నీట మునిగిన స్థలానికి 4-5 అడుగుల దూరంలో బురదలో కూరుకుపోయినట్టు గుర్తించారు. 15-20 నిమిషాల వ్యవధిలో మృతదేహాన్ని వెలికితీశారు. నిర్జీవంగా పడిఉన్న బిడ్డను చూడగానే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలారు. బురదలో కూరుకుపోవడంతోనే సమయానికి గుర్తించలేకపోయారని అధికారులు అంచనా వేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. గుత్తేదారుపై చర్యలు తీసుకుంటామని కంటోన్మెంట్‌ చీఫ్‌ ప్లానర్‌ రాములు తెలిపారు.

మాకు తీరని శోకం మిగిలింది
– చంద్రకళ, బాలుడి తల్లి
గతేడాదే ప్రహరీ కూలింది. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు చాలా భయమేసేది. దీంతో జాగ్రత్తగా ఉండేవాళ్లం. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకుండానే ప్రస్తుతం పనులు కొనసాగిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంతోనే మా బాబు చనిపోయాడు. మాకు తీరని అన్యాయం జరిగింది.

నాకు ఈత రాకపోవడంతో…
– సంతోష్‌కుమార్‌, చిన్నారి పక్కింట్లో నివాసముండే న్యాయవాది
ఆనంద్‌సాయి నాలాలో పడిపోయినట్లు మా అబ్బాయి వచ్చి చెప్పాడు. బయటకు వచ్చి చూసేసరికి నీటిలో మునిగిపోతున్నాడు. నాకు ఈత రాకపోవడంతో విషయాన్ని ఆంజనేయులుకు చెప్ఫా అతను వెంటనే నాలాలోకి దూకినా అప్పటికే బాబు గల్లంతయ్యాడు. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి చెప్పినప్పటికీ.. వారు దాటవేశారు.

హైదరాబాద్‌: ఏళ్లు గడుస్తున్నా నాలాల తలరాత మారట్లేదు. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఏటా ప్రమాదాలు జరగడం.. ఆ వెంటనే కట్టుదిట్టం చేస్తామని బల్దియా ప్రకటనలు చేయడం రివాజుగా మారింది. 2017లో కురిసిన భారీ వర్షాల అనంతరం చేపట్టిన నాలా అభివృద్ధి పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2019-20 నుంచి రూ.359 కోట్ల విలువైన 896 పనులు జరిగాయి. పూర్తయినవి 20 శాతమే. సుమేధ మరణానంతరం మంత్రి కేటీఆర్‌.. మరమ్మతుల కోసం రూ.297.67 కోట్ల విలువైన 472 పనులను ఆమోదించారు. పూర్తయినవి 20 శాతమే.

బలవుతున్నారిలా..

  • నవంబరు 4, 2020న సరూర్‌నగర్‌ కోదండరామ్‌నగర్‌ వద్ద ఓ వృద్ధురాలు, మరో ప్రాంతంలో ఇంకో వ్యక్తి నాలాలో పడి మృతిచెందారు. ● సెప్టెంబరు 25, 2019న నాగోల్‌ నాలాలో పడి గుర్తుతెలియని వ్యక్తి చనిపోయారు. ● సెప్టెంబరు 26, 2019న చైతన్యపురిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అర్చకులు నాలాలో పడి గల్లంతవగా, ఒకరు కొంత దూరం వెళ్లాక ఒడ్డుకు చేరుకున్నారు. మరో వ్యక్తి చనిపోయారు. ● జూన్‌ 10, 2018న ఓ గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు సత్యరాఘవేంద్రనగర్‌ కాలనీ ఓపెన్‌ నాలాలో పడి చనిపోయారు. ● సెప్టెంబరు 9, 2018న 24 ఏళ్ల హరీష్‌ సరూర్‌నగర్‌ నాలాలో పడి మృతిచెందారు.● అక్టోబరు 16, 2018న బోరబండ సాయిబాబా ఆలయం వద్ద ఓ వ్యక్తి నాలాలో పడి చనిపోయారు.

పనులు ఇలా..
పనుల సంఖ్య.. 896
వాటి వ్యయం.. 359.16 కోట్లు
పూర్తయిన పనులు 296
వ్యయం రూ.66.84 కోట్లు
పురోగతిలో ఉన్నవి 181
వ్యయం రూ.80.69 కోట్లు
ప్రారంభం కావాల్సినవి 261
వ్యయం రూ.109.88 కోట్లు
రద్దు/నిలిపేసిన పనులు 21
వ్యయం రూ.9.72 కోట్లు
టెండరు దశలో 137
వ్యయం.. రూ.92.01 కోట్లు
బాలుడి మృతదేహాన్ని వెలికి తీసిన సిబ్బంది మొత్తం నాలాల పొడవు
1,400 కి.మీ.
అందులో పైకప్పు లేనివి
830 కి.మీ.
మృతుడు ఆనంద్‌సాయి

Courtesy Eenadu

Leave a Reply