ముక్కు ద్వారా కొవిడ్‌-19 టీకా

0
234
తయారీకి వాషింగ్టన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాధి (కొవిడ్‌-19) కి ముక్కు ద్వారా ఇచ్చే సింగిల్‌ డోస్‌ టీకా తయారీ కోసం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌, సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలను మినహాయించి మిగిలిన దేశాల్లో ఈ టీకా విక్రయించే హక్కులు భారత్‌ బయోటెక్‌ కు ఉంటాయి. ‘ఛింప్‌-అడెనోవైరస్‌’ ఆధారిత ఈ టీకాపై సెయింట్‌ లూయిస్‌ యూనివర్సిటీలోని వాక్సిన్‌ అండ్‌ ట్రీట్‌మెంట్‌ ఎవల్యూషన్‌ యూనిట్లో మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత పరీక్షలను భారత్‌ బయోటెక్‌ మనదేశంలో నిర్వహిస్తుంది. అన్ని పరీక్షలు పూర్తయ్యాక హైదరాబాద్‌ సమీపంలోని జీనోమ్‌ వ్యాలీలో గల భారత్‌ బయోటెక్‌ యూనిట్లో టీకా తయారీ చేపడతారు.

కొవిడ్‌-19 వ్యాధికి, ఎబోలా, టీబీ వంటి ఇతర అంటువ్యాధులకు టీకాల తయారీ ప్రయోగాలను అడెనోవైరస్లు ఆధారంగా నిర్వహిస్తున్నారు. ఇతర పద్ధతులతో పోల్చితే ముక్కు ద్వారా టీకా ఇవ్వటం ఎంతో సులువు, సౌకర్యం కూడా. సిరంజిలు వాడాల్సిన పనిలేదు. ప్రజలకు భద్రమైన, సులువైన వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఒప్పందంలో తాము భాగస్వామి అయినట్లు భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. వంద కోట్ల డోసుల టీకా తయారు చేయడానికి సన్నద్ధం అవుతున్నట్లు ఆయన వెల్లడించారు. వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో బయోలాజిక్‌ థెరప్యూటిక్స్‌ డైరెక్టర్‌ అయిన డాక్టర్‌ డేవిడ్‌ టి.కరేల్‌ స్పందిస్తూ, ముక్కు ద్వారా టీకా ఇవ్వటం వల్ల ముక్కు, గొంతు భాగాల్లో ఉండే కణాలు కరోనా వైరస్‌ను ఎదుర్కొనే శక్తిని సమకూర్చుకుంటాయని, తద్వారా వ్యాధి సోకకుండా నిరోధించినట్లు అవుతుందని వివరించారు. ఇప్పటికే తాను రూపొందించిన ‘కొవాగ్జిన్‌’పై మనదేశంలో రెండో దశ క్లినికల్‌ పరీక్షలను భారత్‌ బయోటెక్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Leave a Reply