
ప్రస్తుతం సాగుతున్న రైతాంగ పోరాటం కేవలం వ్యవసాయాన్ని కార్పొరేటీకరించవద్దన్న డిమాండ్‌కో, కనీస మద్దతు ధర గ్యారంటీ కోసమో పరిమితం కాలేదు. అంతకు మించి నయా ఉదారవాదం ముందుకు తెచ్చిన ఆధిపత్య వాదానికి వ్యతిరేకంగా అది విస్తరించింది. ఈ పోరాటం వెనుక ఏవేవో ”కుట్రలు” వున్నాయంటూ నరేంద్ర మోడీ వినిపిస్తున్న ‘కహానీ’లు మరింత వేగం పుంజుకుంటున్నకొద్దీ ఈ ఉద్యమం మరింత సమగ్రతను, స్పష్టతను, ప్రతిఘటనను పెంచుకుంటూ సాగుతోంది. ఈ సందర్భంగా ”జాతి” భావనపై జరుగుతున్న చర్చను నేను వివరిస్తాను.
17వ శతాబ్దంలో యూరప్‌లో బూర్జువా వర్గం ఆవిర్భవించిన తర్వాత ”జాతి” భావన స్పష్టతను సంతరించుకుంది. 19వ శతాబ్దం రెండవ భాగంలో ఫైనాన్సు పెట్టుబడి పైచేయి సాధించాక ఈ భావన ఒక ప్రత్యేక ప్రాధాన్యతను పొందింది. రుడాల్ఫ్ హిల్ఫÛర్‌డింగ్ చెప్పినట్టు ఫైనాన్సు పెట్టుబడి సిద్ధాంతం ”జాతి” భావనను ఒక గొప్ప ఆదర్శంగా ముందుకు తెచ్చింది. అదే సమయంలో ”జాతి” అంటే మరో అర్ధంలో ఫైనాన్సు పెట్టుబడి అని, జాతి ప్రయోజనాలు అంటే ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాలు తప్ప వేరేమీ కావని చెప్పింది. వివిధ సామ్రాజ్యవాద దేశాలు తమలో తాము పోటీ పడిన సమయంలో ఆయా దేశాలలోని ఫైనాన్సు పెట్టుబడుల మధ్య పోటీని కాస్తా ఆయా జాతుల ప్రయోజనాల మధ్య పోటీగా చిత్రీకరించింది.
ఈ విధంగా జాతి అంటే ఫైనాన్సు పెట్టు బడి అనే సిద్ధాంతం పర్యవసానంగా ఆ జాతికి ప్రజలకు మధ్య సంబంధాన్ని తెగ్గొట్టింది. ప్రజల కంటే జాతి ఎంతో మిన్న అని, అందుచేత జాతి కోసం ప్రజలు త్యాగాలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యం కల్పించడం, పౌష్టికాహారం గ్యారంటీ చేయడం వంటి అల్పమైన దైనందిన విషయాలను ముందుకు తెచ్చి జాతి యొక్క ఔన్నత్యాన్ని, ఘనతను కించపర చకూడదని, జాతి ప్రయోజనాలు ఎంతో ఉన్నతమైనవని ఈ సిద్ధాంతం చెప్పింది.
మూడవ ప్రపంచ దేశాలలో సామ్రాజ్యవాద వలస పాలనకు వ్యతిరేకంగా విముక్తి కోసం సాగిన పోరాటాలలో తలెత్తిన ”జాతి” భావన ఇందుకు పూర్తిగా భిన్నం. ఇక్కడ సామ్రాజ్యవాదం జాతి వ్యతిరేకమైనదిగా పరిగణించబడింది. అది ప్రజలను అణచివేస్తుంది కనుక జాతి వ్యతిరేకమైంది. అంటే ఇక్కడ జాతి అంటే ప్రజలు. యూరప్‌లో ఫైనాన్సు పెట్టుబడి ముందుకు తెచ్చిన అర్ధానికి ఇది పూర్తి విరుద్ధం. 1931లో కరాచీలో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభలో ఆమోదించిన తీర్మానంలో గాని, ఇతర దేశాల లోని అదే తరహా పత్రాల్లో గాని ప్రజల జీవన పరిస్థితులను మెరుగు పరచ డమెలా అన్నదానిపైనే ప్రధానంగా చర్చ చేశారు.
యూరప్‌లో సామ్రాజ్య వాదుల మధ్య తలెత్తిన పోటీలో ఆయా దేశాల లోని ఫైనాన్సు పెట్టుబడి తన అధీనంలో ఉండే మీడియా ద్వారా ముందుకు తెచ్చిన ”జాతి” భావన ఒకటైతే, సామ్రాజ్యవాదుల ఆధిపత్యానికి నలిగిపోతున్న కార్మికులు, రైతులు, చిన్న ఉత్పత్తిదారులు, చిన్న పెట్టుబడిదారులు సామ్రా జ్యవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగించిన వర్గ పోరాటంలో (ఇందులో పెద్ద పెట్టుబడిదారులు సైతం పాల్గొన్నారు) ముందుకు తెచ్చిన జాతి భావన ఇంకొకటి. ఇది మొదటిదానికి పూర్తి వ్యతిరేకం.
ప్రస్తుతం సాగుతున్న నయా ఉదారవాదం ఒక విధంగా ప్రతీఘాత విప్లవం వంటిది. ఇది మూడవ ప్రపంచ దేశాలలో యూరోపియన్ తరహా ”జాతి” భావనను ముందుకు తేవడమే గాక దానికి ఒక దైవత్వ లక్షణాన్ని కూడా ఆపాదించింది. ప్రజల కన్నా జాతి ఎంతో గొప్పదని చెప్పింది. కార్పొరేట్-ఫైనాన్సు పెట్టుబడి ప్రయోజనాలే జాతి ప్రయోజనాలని చెప్పింది. భారత దేశంలో కూడా ఇదే జరిగింది. గతంలో సామ్రాజ్యవాదుల మధ్య ఉండిన పోటీ ఇప్పుడు సద్దుమణిగింది కాని ఆనాడు ముందుకు తెచ్చిన జాతి భావన నేడు కూడా ఫైనాన్సు పెట్టుబడికి ఉపయోగపడుతోంది.
కార్పొరేట్లు- ఫైనాన్సు పెట్టుబడి చేతుల్లో గనుక పెత్తనం పెడితే తద్వారా దేశంలో యావన్మందికీ ఉపయోగపడేలా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని నయా ఉదారవాద విధానపు తొలి రోజుల్లో ప్రచారం చేసి చాలామందిని నమ్మించారు. కాని క్రమేణా నయా ఉదారవాద విధానాలు సంక్షోభానికి దారితీయ సాగాయి. ఈ పరిస్థితుల్లో పాత పద్ధతిలో నమ్మించడం సాధ్యప డడం లేదు. అందుచేత కొత్తగా ఒక అమూర్తమైన, ఊహాజని తమైన ”హిందూ జాతి” అనే భావనను ముందుకు తెచ్చారు. ఈ భావన కూడా ప్రజలకు అతీతమైన భావనగానే ఉంది. ఈ హిందూ జాతి భావన కోసం మళ్ళీ త్యాగాలు చేయాలని ప్రజలకు ఉద్బోధిస్తున్నారు. వారి దృష్టిలో ఈ హిందూ జాతి భావన ముందు దేశంలోని ప్రజల దైనందిన జీవన పరిస్థితులు, వారి సమస్యలు చాలా అల్పమైనవి.
గత ఆరేళ్ళుగా ఈ వాదనలనే హిందూత్వ వాదులు ముందుకు బలంగా తెస్తున్నారు. కార్పొరేట్ మీడియా వాటినే చాలా పకడ్బందీగా ప్రచారంలో పెట్టింది. నయా ఉదారవాద విధానాల సంక్షోభం తలెత్తిన కాలం లోనే కార్పొరేట్ వర్గాలు, హిందూత్వ శక్తులు ఒక కూటమిగా వ్యవహరించడం మొదలైంది. కార్పొరేట్-ఫైనాన్సు పెట్టుబడి కూటమిని ఈ దేశంలో సంపద సృష్టికర్తలుగా ప్రధాని నరేంద్రమోడీ అభివర్ణించారు. దానిని బట్టే ఆయన దృష్టిలో దేశం అంటే ఎవరో స్సష్టంగా తెలిసిపోతోంది. దేశం పురోగమించాలంటే ఈ సంపద సృష్టి కర్తలను సంతోషంగా ఉంచాలి. దేశ ప్రయోజ నాలంటే ఈ కూటమి ప్రయోజనాలే. ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించే హిందూ రాష్ట్ర భావన అంటే వాస్త వానికి ఈ కార్పొరేట్-ఫైనాన్సు కూటమి నియం తృత్వమే. అందులో కూడా ఓ అయిదారుగురు పూర్తిగా తమ స్వంత ప్రయోజ నాలను నెరవేర్చుకోడానికి ఈ అధికారాన్ని చెలాయిస్తారు.
కేంద్రీకృత పాలనా వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నది కూడా ఈ ఎజెండాలో అంతర్భాగమే. ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో గణనీయంగా వనరులు ఉంటాయి. నిర్ణయాధికారాలు ఉంటాయి. చిన్న, స్థానిక బూర్జువా వర్గం, గృహ పరిశ్రమలు, రాష్ట్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా కార్పొరేట్- ఫైనాన్సు పెట్టు బడి తోబాటు ఎంతో కొంత మేరకు అభివృద్ధి చెందే వీలుం టుంది. అదే వనరులు, వాటితోబాటు నిర్ణయాధికారాలు ఒకే దగ్గర కేంద్రీ కృతం అయితే వివిధ ప్రాంతాల్లో వివిధ తరగతులు అభి వృద్ధి చెందే అవకాశాలు మూసుకుపోతాయి. ముందు ప్రస్తావించి నట్టు అయిదారుగురు బడా కార్పొరేట్లు తమ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోడానికి పూర్తి అవకాశం వస్తుంది. వీరినే కేంద్రం బలపరుస్తుంది. ఎందు కంటే వీళ్ళే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటు న్నారు. 1930 దశకంలో షింకో జైబాట్సు ఆధ్వర్యంలో జపాన్‌లో ఇలానే జరిగింది. ఇప్పుడు మోడీ చేతుల్లో చాలా విస్తృతంగా కేంద్రీకృతం కావడం ఈ అయిదా రుగురు గుత్తాధి పతుల ఆధిపత్యానికి ప్రతి రూపమే. ఈ ఆధిపత్యం సంపూర్ణంగా చెలా యించ డానికి వీలుగా ఇప్పుడు రైతాంగాన్ని అందుకోసం బలి చేస్తున్నారు.
ఇక్కడ కేంద్రీకరణ అనేది రాష్ట్రాల అధికారాలను కేంద్రం చేజిక్కించుకోవడంతోటే ఆగిపోదు. కేంద్ర ప్రభుత్వంలో సైతం నిర్ణయాధికారాలన్నీ ఒక ”నాయకుడి” చేతుల్లో చిక్కుతాయి. ఆ నాయకుడే సర్వశక్తిమంతుడౌతాడు. ప్రజలకు ఏది కావాలో, ఏది మంచో ఏది చెడో అతడికే తెలుసు. అతగాడెప్పుడూ తప్పు చేయడు. కార్పొరేట్-హిందూత్వ వాదుల జాతీయతావాదం ఈ నాయకుడినే ఒక దేవుడిగా మార్చేస్తుంది. అతడే జాతికి ప్రతిరూపం అవుతాడు. అందుకే ఎవరైనా ఆ నాయకుడి మీద కార్టూన్లు వేసినా, జోకులు వేసినా జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్‌ఐఎ) అలా చేయడాన్ని దేశద్రోహంగా పరిగణిస్తుంది. అరెస్టులకు పాల్పడుతుంది.
ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల పోరాటం కార్పొరేట్-ఫైనాన్సు పెట్టుబడి శక్తుల ”జాతి” భావనను సవాలు చేస్తోంది. జాతి అంటే ఆ దేశం లోని శ్రమజీవులేనన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెచ్చింది. ఆ మూడు చట్టాలూ రైతులకు మేలు చేస్తాయని మోడీ చెప్పిన వాదనను పోరాటం తిరస్కరించింది. తద్వారా నాయకుడికి ఏది మంచో బాగా తెలసునన్న కార్పొరేట్-హిందూత్వ శక్తుల కీలక వాదనను దెబ్బతీసింది. రైతులు ఏం చెప్తున్నారో వినిపించుకోకుండా, వారితో అర్ధవంతమైన సంప్రదింపులు చేపట్టకుండా ఉన్నందుకు చాలామంది కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. జాతి ఐక్యత అంటే దానికి ప్రతిరూపం నాయకుడే అని, అతడి నిర్ణయాలను ప్రశ్నించడమంటే అతడి విజ్ఞతను ప్రశ్నించడమేనని భావించే తెలివిమాలిన హిందూత్వ శక్తులకు పరస్పర సంప్రదింపుల ద్వారా జాతీయ ఐక్యతను నిర్మించుకోవడం అంటే ఎలా బోధపడుతుంది?
అంబానీకి చెందిన జియో ను బారుకాట్ చేయాలని, మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను, దానితోబాటు అంబానీ, అదానీల దిష్టిబొమ్మలనూ దగ్ధం చేయాలని రైతులు పిలుపిచ్చారు. జాతి అంటే ఆ అయిదారుగురు మాత్రమేనని, వారే సంపద సృష్టికర్తలని మోడీ ముందుకు తెస్తున్న వాదనను తిరస్కరించడానికి ఈ పిలుపు ఒక సంకేతం. రైతులు జియో ను బారుకాట్ చేయాలని పిలుపివ్వడానికి ముందురోజనే అంబానీ జియో-5 ప్రారంభించాడు. దీనిని ప్రతీ టివి చానెల్ లోనూ గొప్ప జాతి విజయంగా చిత్రిస్తూ ప్రసారం చేశారు కూడా. రైతులిచ్చిన ఈ జియో బారుకాట్ పిలుపు కేవలం ఓ ఎత్తుగడ మాత్రమే కాదు. దేశమంటే కొద్దిమంది కార్పొరేట్లే నన్న భావజాలానికే వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు.
అయితే రైతులు కేవలం హిందూత్వ వాదుల జాతి భావనను వ్యతిరేకించడానికే పరిమితం కాలేదు. దానికి పూర్తిగా వ్యతిరేక దిశలో ఉన్న ప్రత్యామ్నాయ భావనను ముందుకు తెస్తున్నారు. జాతీయోద్యమ కాలం నాటి జాతీయ భావనను పునరుద్ధరిస్తున్నారు. భారత్ మాతా కీ జై అన్న నినాదం జాతి భావనకు దైవత్వం ఆపాదిస్తుంది. అంటే అది ప్రజలతో సంబంధం లేకుండా, వారికి అందనంత దూరంగా దానిని ఉంచుతుంది. ఆ భావన కోసం ప్రజలు త్యాగాలు చేయాలే తప్ప వారేమీ ఆశించకూడదని చెప్తుంది. ఇప్పుడు రైతులు ఇస్తున్న నినాదం జై భారత్, జై కిసాన్. ఇది జాతి అనే భావనను రైతులతో, శ్రామిక ప్రజలతో మమేకం చేస్తుంది (దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుజులోరు- గురజాడ). ఒక్క హిందీ భాష లోనే కాకుండా పంజాబీ, తదితర దేశ భాషలన్నింటిలోనూ రైతులు నినాదాలి స్తున్నారు. అంటే ఒకే, కేంద్రీకృత ”జాతి” భావనను తిరస్కరించి వివిధ భాషలు మాట్లాడే వివిధ జాతుల మధ్య ఏర్పడే ఐక్యత లోంచి దేశం ఏర్పడిందన్న అవగాహనను వ్యక్తం చేస్తున్నారు.
రైతులు ఈ ఉద్యమంలో ఇస్తున్న నినాదాలు, ఉపయోగిస్తున్న చిహ్నాలు స్పష్టంగా, గట్టిగా ఈ ఉద్యమ స్వభావాన్ని వెల్లడి చేస్తున్నాయి. కార్పొరేట్-హిందూత్వ శక్తులు ముందుకు తెచ్చిన దేశభక్తి భావనను పూర్తిగా తిరస్కరించి జాతీయోద్యమ కాలం నాటి నిజమైన దేశభక్తి భావనను ముందుకు తెస్తున్నాయి. స్వేచ్ఛాయుత భారత దేశానికి ఈ అసలైన దేశభక్తి భావనే పునాది.
Courtesy Prajashakti