నాటోపై ఎందుకీ రగడ!

0
188

రష్యా – ఉక్రెయిన్‌ వివాదంలో కేంద్ర బిందువైన సైనిక కూటమి

ఉక్రెయిన్‌-రష్యా మధ్య వివాదంలో నాటో కూటమి కేంద్ర బిందువుగా మారింది. ఈ కూటమి నుంచి తమ దేశానికి ప్రమాదం ఉందని రష్యా శంకిస్తోంది. ఒకప్పుడు (సోవియట్‌ యూనియన్‌ సమయంలో) తాను సారథ్యం వహించిన వార్సా ఒప్పంద కూటమిలోని దేశాలూ నాటో కూటమిలో చేరిపోవడాన్ని రష్యా సహించలేకపోతోంది. పొరుగునే ఉన్న ఉక్రెయిన్‌ కూడా నాటో పంచన చేరడానికి యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నాటో కూటమి ఏమిటి? ఎందుకు ఆవిర్భవించింది? రష్యా దానిని తీవ్రంగా ఎందుకు వ్యతిరేకిస్తోంది అన్నది చర్చనీయాంశమయ్యింది.

నాటో.. నార్త్‌ అట్లాంటిక్‌ ట్రీటీ ఆర్గనైజేషన్‌. దీనినే ఉత్తర అట్లాంటిక్‌ కూటమి అని కూడా వ్యవహరిస్తుంటారు. ఇది ఒక సైనిక కూటమి. 1949లో అమెరికా, కెనడా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సహా 12 దేశాలతో ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో రష్యా విస్తరణను అడ్డుకోవాలన్న లక్ష్యంతో నాటో రూపుదాల్చింది. కూటమిలోని సభ్య దేశాలపై ఇతర దేశాలు ఏవైనా యుద్ధానికి దిగితే ఒకరికొకరు అండగా నిలవడంతో పాటు సైనిక సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. సభ్యుల్లో ఎవరిపై దాడి జరిగినా తమపై జరిగినట్లుగానే భావించి సైనికపరంగా ప్రతిస్పందించాలని కూటమి ఒప్పందంలోని అధికరణం 5 చెబుతోంది.

అమెరికా నేతృత్వంలోని నాటో కూటమికి పోటీగా అప్పటి సోవియట్‌ రష్యా 1955లో తూర్పు ఐరోపాలోని కమ్యూనిస్టు దేశాలతో సైనిక కూటమిని ఏర్పాటు చేసింది..అదే వార్సా ఒప్పందం. 1991లో సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత వార్సా ఒడంబడిక నుంచి వెలుపలకు వచ్చిన దేశాలు నాటోలో సభ్యత్వం పొందాయి. దీంతో నాటో కూటమి సభ్య దేశాల సంఖ్య ప్రస్తుతం 30కి పెరిగింది. 1997 తర్వాత నాటో విస్తరణ వేగం పుంజుకుంది. సోవియట్‌ యూనియన్‌ ప్రభావంలో ఉన్న చెక్‌ రిపబ్లిక్‌, హంగరి, పోలండ్‌ కూడా ఆ కూటమిలో చేరాయి. నాటో నూతన సభ్య దేశాల్లో అత్యధికం ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌లో భాగస్వాములు కావడం విశేషం.

ఉక్రెయిన్‌, నాటోలతో రష్యా వివాదం ఏమిటంటే..
సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత 1991 ఆగస్టులో ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. రష్యా, ఐరోపా సమాజం(ఈయూ)తోనూ ఆ దేశానికి సరిహద్దులున్నాయి. నాటో కూటమిలో సభ్యత్వం లేనప్పటికీ భాగస్వామ్య దేశంగా కొనసాగుతోంది. ఆ కూటమిలో సభ్యత్వం పొందేందుకు 2008 నుంచి ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వబోమనే హామీ ఇవ్వాల్సిందిగా పశ్చిమ దేశాలను రష్యా డిమాండ్‌ చేస్తోంది. అమెరికా, మరికొన్ని దేశాలు దీన్ని తిరస్కరిస్తున్నాయి. ఉక్రెయిన్‌ సార్వభౌమత్వం కలిగిన దేశమని, ఏ సైనిక కూటమిలో చేరాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ దానికి ఉంటుందని వాదిస్తున్నాయి. ఉక్రెయిన్‌ మాత్రం నాటోలో చేరేందుకే మొగ్గు చూపుతోంది. నాటో కూటమి ఒప్పందంలోని అధికరణం 5 ప్రకారం…సభ్య దేశాలపై ఇతరులు దాడి చేస్తే ఉమ్మడిగా ప్రతిస్పందించాలన్న నిబంధనను కూటమితో సన్నిహిత సంబంధాలున్న ఉక్రెయిన్‌ వంటి దేశాలకూ వర్తించేలా చేయాలన్న ప్రతిపాదన ఉంది. దీనిని చర్చించి ఆమోదించే అధికారం నాటో గవర్నింగ్‌ కౌన్సిల్‌కు ఉంది.

నాటోపై రష్యా ఆరోపణలు
తమ దేశ భూభాగాలను ఆక్రమించుకునేందుకు పశ్చిమ దేశాలు నాటో కూటమిని ఉపయోగించుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆరోపిస్తున్నారు. తూర్పు ఐరోపాలో నాటో కూటమి సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తూర్పు ఐరోపా దిశగా నాటోను విస్తరించబోమని అమెరికా తమకు గతంలో హామీ ఇచ్చిందని చాలా కాలంగా ఆయన చెబుతున్నారు. అయితే, ఆ వాదనలను నాటో తోసిపుచ్చుతోంది. తమ కూటమిలోని కొన్ని సభ్య దేశాలకే రష్యాతో సరిహద్దులున్నాయని, పైగా తమది రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కూటమి మాత్రమేనని చెబుతోంది.

క్రిమియా ఆక్రమణతో…
సోవియట్‌ యూనియన్‌ పతనం తర్వాత నాటో కూటమి, రష్యా కొంత దగ్గరయ్యాయి. పరస్పర సంప్రదింపులకు నాటో-రష్యా కౌన్సిల్‌(ఎన్‌ఆర్‌సీ)ను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. 1999లో కొసావో సంక్షోభంతో రెండిటి మధ్య దూరం పెరిగింది. 2014లో క్రిమియా ఆక్రమణకు పుతిన్‌ ఆదేశించడంతో ఎన్‌ఆర్‌సీ నుంచి రష్యాను నాటో బహిష్కరించింది. 2014 ఉక్రెయిన్‌ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అనుకూల నేత ఓడిపోయారు. అదే ఏడాది ఉక్రెయిన్‌కు చెందిన క్రిమియా దీవిని రష్యా ఆక్రమించింది. ఆ దాడి విషయంలో నాటో కూటమి జోక్యం చేసుకోనప్పటికీ మొట్ట మొదటి సారిగా తూర్పు ఐరోపాలోని తన సభ్య దేశాల్లో సేనలను మోహరించింది. అత్యాధునిక ఆయుధాలతో సన్నద్ధంగా ఉన్న నాటో బలగాలన్నిటినీ ఈ ప్రాంతం నుంచి బయటకు పంపించాలని రష్యా కోరుతోంది.

పుతిన్‌ పక్షం ఎవరు?
ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఈ పరిణామం పలు దేశాలు భాగస్వామ్యంతో భారీ యుద్ధానికి దారితీస్తుందా? అన్న భయాందోళనలు నింపుతోంది. ఉక్రెయిన్‌ వ్యవహారంలో ఏ దేశాలైనా తలదూరిస్తే పరిణామాలు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఉంటాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఏ దేశం ఏ పక్షాన నిలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది.

నాటో పక్షాన..
* బ్రిటన్‌
* జర్మనీ
* ఐరోపా సమాజం సభ్య దేశాలు
* నాటో సభ్యత్వంగల బల్గేరియా, ఎస్తోనియా, లాత్వియా, లిథువేనియా, రొమేనియా, స్లొవేకియా, స్లొవేనియా
* బెల్జియం
* చెక్‌ రిపబ్లిక్‌
* హంగెరి
* పోలండ్‌

రష్యా పక్షాన..
* చైనా
* పాకిస్థాన్‌
* సిరియా
* వెనెజువెలా
* రష్యా గుర్తింపు పొందిన దోనెట్స్క్‌, లుహాన్స్క్‌

తటస్థం..
* భారత్‌ సహా మరికొన్ని దేశాలు

Courtesy Eenadu

Leave a Reply