పీఎం కేర్స్కు నవరత్న కంపెనీల నుంచి భారీగా విరాళాలు

0
203

– 38 పీఎస్‌యూల నుంచి రూ.2,105కోట్లు అందజేత
– విరాళాల సేకరణపై సందేహాలు వ్యక్తం చేసిన ఆర్థిక నిపుణులు

న్యూఢిల్లీ : ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌…ఇవన్నీ కూడా మహారత్న, నవరత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థలు. ఇలాంటి 38 ప్రభుత్వ రంగ సంస్థలు ‘పీఎం కేర్స్‌’కు రూ.2105 కోట్ల రూపాయలు విరాళంగా అందజేశాయని సమాచారం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత'(సీఎస్‌ఆర్‌) కింద వ్యయం చేయాల్సిన నిధుల్ని ఆయా సంస్థలు విరాళంగా అందజేశాయని తేలింది. సీఎస్‌ఆర్‌ బడ్జెట్‌ కేటాయింపులు ఫైనలైజ్‌ కాకుండానే పీఎం కేర్స్‌కు ఆయా సంస్థల నుంచి వందల కోట్లు విరాళాలుగా వెళ్లటాన్ని ఆర్థిక నిపుణులు తప్పుబడుతున్నారు. ఆర్థిక సంవత్సరం చివర్లో కరోనా సంక్షోభం, లాక్‌డౌన్‌ వంటివి తీవ్రరూపం దాల్చాయి. మరో నాలుగురోజుల్లో ఆర్థిక సంవత్సరం(మార్చి 25న) ముగుస్తుందనగా (2019-20) 38 ప్రభుత్వరంగ సంస్థలు పీఎం కేర్స్‌కు తమ సీఎస్‌ఆర్‌ నిధుల్ని విరాళంగా అందజేశాయి. దీనిని బట్టి ఆయా సంస్థలు తమ సీఎస్‌ఆర్‌ నిధుల్ని ఆర్థిక సంవత్సరం చివరివరకూ వ్యయం చేయకుండా ఎందుకున్నాయి? అన్న ప్రశ్న తలెత్తుతున్నది. అంతేగాక సీఎస్‌ఆర్‌ బడ్జెట్‌కు తుది ఆమోదం లభించకుండానే ఆయా సంస్థలు విరాళాలు అందజేయటంలో పారదర్శకత లోపించిందని నిపుణులు చెబుతున్నారు.

మేం చెప్పం : పీఎంఓ
పీఎం కేర్స్‌కు ఎవరెవరు విరాళాలు ఇచ్చారు? ఎన్ని నిధులు వచ్చాయి? ఈ నిధుల్ని దేనికోసం వ్యయం చేశారు? వంటి సందేహాలకు ఆర్టీఐ కింద సమాచారాన్ని కోరగా మోడీ సర్కార్‌ ఇవ్వనంటోంది. పీఎం కేర్స్‌ ప్రభుత్వ నిధి కాదు..ఆర్టీఐ చట్ట పరిధిలోకి రాదని పీఎంఓ అధికారులు చెబుతున్నారు. మీడియా సంస్థలు, సామాజిక సంస్థలు ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోగా పీఎంఓ వాటిని తిరస్కరించింది. అలాంటప్పుడు ప్రభుత్వరంగ సంస్థల నుంచి వందల కోట్లు విరాళాలుగా సేకరించటం ఏ విధంగా సమంజసమని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయాలన్నీ తాజాగా ఒక జాతీయ ఆంగ్ల మీడియా తన వార్తా కథనంలో వెల్లడించింది. 55 ప్రభుత్వరంగ సంస్థలు సీఎస్‌ఆర్‌ కింద పీఎం కేర్స్‌కు విరాళాలు ఇచ్చిన సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా ఆ ఆంగ్ల దినపత్రిక సేకరించింది. ఈ సమాచారం ఆధారంగా, 38 పీఎస్‌యూలు ఆగస్టు 13నాటికి పీఎం కేర్స్‌కు రూ.2,105 కోట్లు విరాళాలుగా అందజేశాయని తేలింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద వ్యయం చేయాల్సిన నిధులకు బడ్జెట్‌ ఆమోదం లేకుండానే ఈ విరాళాలు పంపినట్టు ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

Courtesy Nava Telangana

Leave a Reply