- ఎల్‌ఎంజీ, ఐఈడీలతో కూంబింగ్ దళాలపై దాడి
- 24 మంది జవాన్ల వీరమరణం.. 31 మందికి గాయాలు
- ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
- చిత్రహింసలకు గురి చేసి.. దారుణ హత్యలు
- తుపాకులతో కాల్చి.. కత్తులతో పొడిచి
- హిడ్మా నేతృత్వంలోని గెరిల్లాల దారుణం
- బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించిన మావోయిస్టులు
- తూటాలకే కాక డీహైడ్రేషన్‌తోనూ ప్రాణ నష్టం
- నక్సల్స్ కోసం వేటను కొనసాగిస్తాం: అమిత్షా
ఎక్కడ చూసినా తూటాల షెల్స్..! చెల్లా చెదురుగా మృతదేహాలు..! రక్తమోడిన దుస్తులతో విగతజీవులుగా పడి ఉన్న జవాన్లు..! కొందరి శరీరాలను తూటాలు జల్లెడగా మార్చగా.. మరికొందరి ఒంటిపై పదునైన ఆయుధాలతో పెట్టిన గాట్లు ఉన్నాయి..! కొందరి కాళ్లు చేతులను తెగనరికిన దాఖలాలు..! ఇవీ దండకారణ్యంలో కనిపించిన దృశ్యాలు. ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య శనివారం జరిగిన భారీ ఎదురు కాల్పుల్లో.. 24 మంది జవాన్లు అసువులు బాసారు.
రాయ్‌పూర్, చర్ల, సాలూరు రూరల్ : దండకారణ్యం నెత్తురోడింది. ఛత్తీ స్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో.. 24 మంది జవాన్లు అసువులుబాసారు. మృతుల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మావోయిస్టుల వైపు కూడా 12 మంది చనిపోయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. శనివారం అర్ధరాత్రి వరకు ఐదుగురు జవాన్ల మృతదేహాలు లభ్యమవ్వగా.. ఆదివారం ఉదయం మరో 19 మంది జవాన్లు వీరమరణం పొందినట్లు అధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రి కడపటి వార్తలందేసరికి 20 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో 9 మంది కోబ్రా, 8 మంది డీఆర్జీ, ఆరుగురు ఎస్పీఎఫ్, ఒక బస్తర్ బెటాలియన్ జవాను ఉన్నారు. ఒక మహిళా మావోయిస్టు మృతదేహాన్ని కూడా పోలీసులు గుర్తించారు. 31 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో శనివారం రాత్రే హెలికాప్టర్ల ద్వారా రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారు బీజాపూర్ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో కోబ్రాజవాను గల్లంతైనట్లు, మిగతావారంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
బీజాపూర్, సుకుమా జిల్లాల్లోని అడవుల్లో కూంబింగ్‌ను ఉధృతం చేశామని నక్సల్స్ వ్యతిరేక బృందం డైరెక్టర్ జనరల్ అశోక్ జునేజా వెల్లడించారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్‌దీప్ సింగ్ కూడా ఆదివారం ఉదయం హుటాహుటిన ఛత్తీ్‌సగఢ్ చేరుకుని, పరిస్థితులను సమీక్షించారు. ‘‘పది రోజులుగా మావోయిస్టు గెరిల్లా దళానికి చెందిన అగ్రనేత మాద్వీ హిడ్మా బీజాపూర్ అడవుల్లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలిసింది. మానవ, సాంకేతిక ఆధారాలు సేకరించాకే.. అతని కోసం శుక్రవారం రాత్రి నుంచి వేట సాగించాం. మొత్తం 2వేల మందితో ఆరుచోట్ల కూంబింగ్ ప్రారంభించాం. తెర్రాం వద్ద జొన్నగడ్డ గ్రామానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో మావోయిస్టుల జాడ కనిపించింది. కానీ, అప్పటికే నక్సల్స్ ఎత్తైన, వ్యూహాత్మక ప్రదేశాల్లో పొజిషన్‌లో ఉండి కాల్పులు ప్రారంభించారు. హిడ్మా గురించి లీకులు ఇచ్చి, జవాన్లను ట్రాప్ చేశారని తెలుస్తోంది’’ అని ఓ అధికారి తెలిపారు. బుల్లెట్ గాయాలతో ఇబ్బంది పడుతున్న జవాన్లను అతి దగ్గరి నుంచి కాల్చి చంపారని పోలీసులు చెబుతున్నారు. ఓ ఇన్‌స్పెక్టర్ తన తుపాకీ మేగజీన్‌ను రీలోడ్ చేసుకుంటుండగా.. మూకుమ్మడిగా దాడి చేశారని, కత్తులతో అతని చేతులను నరికేశారని చెప్పారు. మావోయిస్టులు ఈ దాడిలో అధునాతన ఆయుధాలు, లైట్ మెషీన్ గన్స్ (ఎల్‌ఎంజీ), గ్రనేడ్ లాంచర్లు, ఐఈడీలను వినియోగించారని వివరించారు.
400 మందికి పైగా మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొన్నారని తెలిపారు. చెట్లమాటున కొందరు, పశువుల కాపర్లుగా మరికొందరు అడవుల్లో నక్కి, ఈ దాడికి పాల్పడి ఉంటారన్నారు. మావోయిస్టులు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించారని, అందుకే అటువైపు నష్టం పెద్దగా లేదని తెలుస్తోంది. ‘‘మేము వారిని ధీటుగానే ఎదుర్కొన్నాం. అతి సమీపంలో ఉన్నవారిపై గురిచూసి కాల్పులు జరిపాం. అయితే.. వారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి ఉండడం వల్ల.. ఫలితం లేకపోయింది. మా వైపు తూటాలతో కొందరు.. నీళ్లు లేక.. డీహైడ్రేషన్‌తో మరికొందరు చనిపోయారు’’ అని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లు తెలిపారు. చనిపోయిన జవాన్ల వద్ద ఆయుధాలు, బుల్లెట్లు, బూట్లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. కాగా అమర జవాన్లలో ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన రౌతు జగదీశ్ ఉన్నారు. వచ్చే నెల ఆయన పెళ్లి నిశ్చమైందని తోటి జవాన్లు చెప్పారు.
రాష్ట్రపతి, ప్రధాని సంతాపం
మృతిచెందిన జవాన్లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘జవాన్లు ప్రాణాలు కోల్పో వడం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. జవాన్ల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదు’’ అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. తెలంగాణ మంత్రు లు మహమూద్ అలీ, ఎర్రబెల్లి మృతిచెందిన జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
Courtesy Andhrajyothi