కార్పొరేట్ శక్తులపై క్షురకుల కన్నెర్ర

0
519

అమలాపురం: కులవృత్తిని కార్పొరేట్ శక్తులు కూలదోస్తే సహించబోమని నాయీ బ్రాహ్మణులు హెచ్చరించారు. తమ వృత్తిదారుల పొట్ట కొట్టేందుకు ఓ కార్పొరేట్ కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కోనసీమలో నాయీ బ్రాహ్మణులు నిరసన గళం వినిపించారు. అమలాపురంలో వీఎల్ సీసీ అనే కార్పిరేట్ సంస్థ అధునాతన సెలూన్ ఏర్పాటు తమ వృత్తిని దెబ్బతీసే ప్రయత్నాన్ని నిరసిస్తూ కోనసీమ నాయీబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వరంలో శనివారం క్షురకులు ఆందోళన చేపట్టారు.

అమలాపురంలోని గడియారం స్తంభం సెంటర్ లో ధర్నా నిర్వహించారు. అంతకు ముందు హైస్కూల్ సెంటర్ నుంచి ర్యాలీ చేపట్టారు. దాదాపు 2 వేల మందిపైగా నాయీ బ్రాహ్మణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమలో ఉన్న దాదాపు 1500 సెలూన్లను మూసివేసి నిరసన తెలిపారు. తమ పొట్ట కొడుతున్న వీఎల్ సీసీ సెలూన్ ను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తరతరాలుగా కులవృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, కార్పొరేట్ కంపెనీల కారణంగా తాము రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని నాయీ బ్రాహ్మణులు వాపోయారు. తమ వృత్తిని చేపట్టకుండా కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

క్షురకులకు ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణ రావు, వివిధ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు ఇరవాడ వీరబ్రహ్మం, పసుపులేటి శ్రీను, పసుపులేటి మురళి, కోరువాడ శ్రీను, ఉప్పాడ అశోక్, పసుపులేటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply