దళిత మేధో క్రాంతి దర్శనం

0
159

– జంగా గౌతమ్‌

దళితుల జీవన ప్రస్థానాన్ని సమగ్రంగా వివరించేందుకు పూనుకున్న గ్రంథం ‘ది దళిత్ ట్రూత్’. ప్రతి రంగంలో దళితులకు జరుగుతున్న అన్యాయాలను వాస్తవాధారాలతో ఎలుగెత్తి చాటడమే కాకుండా భారత రాజ్యాంగ లక్ష్యాల వెలుగులో వారి విముక్తికి కచ్చితమైన ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను నిర్దేశించింది ఈ పుస్తకం. మాజీ ఐఎఎస్‌ అధికారి, బహుజన మేధావి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకుడు కొప్పుల రాజు సంపాదకత్వం వహించిన ఈ పుస్తకాన్ని మహాకవులు గుర్రం జాషువా, బోయి భీమన్నలకు అంకితమిచ్చారు.

‘సత్యాన్ని సత్యంగాను, అసత్యాన్ని అసత్యంగాను తెలుసుకోవాలి’
– బుద్ధుడు

‘సమృద్ధ భారత్‌ ఫౌండేషన్‌’ సంస్థ, ‘పెంగ్విన్‌ రేండమ్‌ హౌస్‌ ఇండియా’ పుస్తక ప్రచురణ సంస్థ సంయుక్తంగా ఇటీవల ‘రీ థింకింగ్‌ ఇండియా’ పేరుతో దేశంలో నేడు కీలకమైన అంశాలపై పుస్తకాలను ఇంగ్లీషులో సిరీస్‌గా ప్రచురిస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా ఎనిమిదవదిగా ‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనం వచ్చింది. డా. బి.ఆర్‌. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ ఏడాది ప్రపంచం ముందుకు వస్తున్న ‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనం దళితుల జీవన ప్రస్థానాన్ని సమగ్రంగా వివరించేందుకు పూనుకున్నది. ప్రతి రంగంలో జరుగుతున్న అన్యాయాలను వాస్తావాధారాలతో ఎలుగెత్తి చాటడమేకాదు భారత రాజ్యాంగ లక్ష్యాల వెలుగులో దళితుల విముక్తికి కచ్చితమైన ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను నిర్దేశిస్తున్నది.

‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనానికి మాజీ ఐఎఎస్‌ అధికారి, బహుజన మేధావి, కాంగ్రెస్‌ పార్టీ జాతీయనాయకుడు కొప్పుల రాజు సంపాదకత్వం వహించారు. తెలుగు సమాజంతో పాటు దేశం గర్వించదగిన ప్రపంచస్థాయి మానవీయ కవులు, పద్మభూషణులు గుఱ్ఱం జాషువా, బోయి భీమన్నలకు ఈ ఇంగ్లీషు సంకలనాన్ని అంకితమిచ్చారు. ఈ సంకలనాన్ని వివరిస్తూ కె.రాజు రాసిన పరిచయ వ్యాసం భావోద్వేగంతో ప్రవాహంలా కొనసాగుతూ దళితులకు సంబంధించిన అనేక చారిత్రక సత్యాలను ఆవిష్కరించింది.అనేక రంగాల్లో నిష్ణాతులయి గుర్తింపు పొందిన 13 మంది ప్రముఖ దళిత మేధావుల రచనలు ఈ సంకలనంలో ఉన్నాయి. ఒక్కొక్క వ్యాసం ఒక పరిశోధనా గ్రంథమని చెప్పక తప్పదు. దీనిలోని వ్యాసాల సారాన్ని, లేవనెత్తిన ప్రశ్నలను సంక్షిప్తంగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను.

ప్రముఖ ఆర్థికవేత్త ప్రొ. సుఖదేవ్‌ థొరాట్‌ ‘ది దళిత్‌ ఐడియా ఆఫ్‌ నేషన్‌. ఇన్స్‌పైర్డ్‌ బై అంబేడ్కర్‌ ’ అనే సిద్ధాంత వ్యాసం ఈ సంకలనంలో మొదటిది. దేశంలో ఒకవైపు పెట్టుబడిదారీ, మరోవైపు మెజారిటీ హిందూత్వ రాజకీయ విధానాలు (మనువు అండ్‌ మార్కెట్‌) ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను, సామాజిక, మత విద్వేషాలను పెంచుతూ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను ఏవిధంగా విధ్వంసం చేస్తున్నదీ థొరాట్‌ విశ్లేషించారు. ‘దేశం, జాతీయత’ అనే భావనలపై డా.అంబేడ్కర్‌ ఇచ్చిన విస్తృత అర్థం ఏమిటి? ప్రస్తుతం ఇవి రాజకీయ అజెండాలో భాగమై ఎలాంటి పరిమిత అర్థంలో భావోద్వేగాలు కలిగిస్తున్నాయి? అనే అంశాన్ని లోతుగా వివరిస్తూ బుద్ధుడి బోధనల్లోని సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వంలతో పాటు ‘సామాజిక ప్రజాస్వామ్య భావన’ భారతీయ సమాజానికి నేటికీ ఎంత ప్రాసస్థ్యం కలిగివున్నదో వివరించారు. డా. అంబేడ్కర్‌ ప్రతిపాదించిన ‘స్టేట్‌ సోషలిజం’ విధానాన్ని ఆమోదించకపోవడం వల్ల నేడు అమలవుతున్న నూతన ఆర్థిక, ప్రైవేటీకరణ విధానాలతో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు పెరిగి దేశం వర్గవైరుధ్యాల నిలయంగా మారుతుందని చెపుతూ ఇప్పటికైనా ఆర్థిక రంగంలో అంబేడ్కర్‌ ప్రతిపాదించిన ప్రత్యామ్నాయాలను దేశం ఆలోచించాల్సిందేనని స్పష్టం చేశారు.

ఐఎఎస్‌ అధికారి రాజశేఖర్‌ ఉండ్రు రాసిన ‘అంబేడ్కర్స్‌ రిప్రజెంటేషనల్‌ పాలిటిక్స్‌ ‘ఎక్స్‌పాండింగ్‌ పోజబులిటీస్‌’ అనే వ్యాసంలో భారతదేశంలో బ్రిటిష్‌ కాలం సుమారు వందేళ్ళ క్రితం నుంచీ దళితులకు, ఆదివాసులకు, వెనకబడిన కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో ప్రాతినిధ్యం కోసం ఏవిధంగా ప్రయత్నాలు జరిగాయి? డా. అంబేడ్కర్‌ నేతృత్వంలో ఎన్నేళ్ళపాటు, ఏయే సందర్భాల్లో దళితుల ప్రాతినిధ్యం కోసం సుదీర్ఘ పోరాటం జరిగిందీ, ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొన్నదీ ఒక క్రమంలో వివరించారు. రాజ్యాంగ రచనా కమిటీలో కూడా దళితులు, ఆదివాసులు, మహిళలు, బలహీనవర్గాల హక్కులు, ప్రాతినిధ్యం కోసం డా. అంబేడ్కర్‌ ఎలా ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందో ఆధారాలతో వివరిస్తూ నేడు స్థానిక సంస్థల్లో సైతం బలహీనవర్గాలకు రాజకీయ రిజర్వేషన్లు ప్రాతినిధ్య పోరాటాల ఫలితంగానే వచ్చాయని చెప్పారు.

పాత్రికేయుడు, ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్వ కార్యకర్త భన్వర్‌ మేఘవంశీ రాసిన ‘సాఫర్నైజింగ్‌ ది దళిత్స్‌’ వ్యాసంలో ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ ప్రతిపాదిస్తున్న హిందూ రాష్ట్ర సిద్ధాంతం వెనకవున్న మూల ఉద్దేశ్యాలు, దాని నాయకుల రచనలు, ఆలోచనలు ఏవిధంగా బాహాటంగా మనుధర్మాన్ని బలపరుస్తున్నదీ, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నదీ, దోపిడీ కులవ్యవస్థను సమర్ధిస్తున్నదీ, రిజర్వేషన్ల తొలగింపునకు ఏవిధంగా పోరాడిందీ లాంటి అనేక వాస్తవాలను ఆధారాలతో వివరించారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తన అధికార రాజకీయ విస్తరణ కోసం, దళితులను తనవైపు తిప్పుకునేందుకు డా. అంబేడ్కర్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌తో స్నేహసంబంధాలు ఉన్నట్లు ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నదో వివరించారు. దళిత ఉపకులాల మధ్య వైరుధ్యాలను ఆసరా చేసుకుని వారు ఆరాధించే దేవుళ్ళ ప్రతిమలను, జాతరలను వాడుకుంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా హిందూ రాష్ట్ర భావనలో దళితులను భాగస్వాములను చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ అనుసరిస్తున్న ఎత్తుగడలను ఈ వ్యాసం విశదం చేస్తుంది. ప్రగతిశీలశక్తులు, సెక్యులర్‌, ప్రజాస్వామ్యశక్తులు, మధ్యస్థ విధానాలను అనుసరించే కాంగ్రెస్‌ లాంటి సంస్థలు హిందూ రాష్ట్ర భావనను తిప్పికొట్టడంలో ఏవిధంగా విఫలం చెందుతున్నాయో వివరిస్తూ నేటి బలహీనవర్గాల్లో కొత్త చైతన్యాన్ని అధ్యయనం చేసి వారికోసం కొత్తగా ఏవిధంగా పనిచేయాలో ప్రతిపాదిస్తుందీ వ్యాసం.

ఐపిఎస్‌ మాజీ అధికారి, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ రాసిన ‘ఎడ్యుకేషన్‌ ఇన్‌ దళిత్‌ లిబరేషన్‌’ అనే వ్యాసంలో తెలంగాణలోని రెసిడిన్షియల్‌ పాఠశాలల్లో దళిత విద్యార్థుల్లో తీసుకువచ్చిన గొప్ప ఆత్మవిశ్వాస మార్పును వివరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య సమన్వయం ఏర్పాటుచేస్తే వచ్చిన విజయాలను వివరించి చెప్పారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రియాంక ఖర్గే, నీరజ్‌ షెట్యే ఉమ్మడిగా రాసిన ‘అనిహిలేటింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ క్యాస్టిజం’ వ్యాసంలో ప్రైవేటీకరణ పరిణామాలు దళితుల అవకాశాలను ఏవిధంగా దెబ్బతీశాయో ఆధారాలతో సాధికారికంగా చెప్తూ, కర్ణాటకలో దళితుల అభివృద్ధికి తెచ్చిన కొన్ని కొత్త విధానాలను వివరించారు. ఐఎఎస్‌ అధికారి బుడితి రాజశేఖర్‌ రాసిన ‘రీ డిజైనింగ్‌ ద దళిత్‌ డవలప్‌మెంట్‌ పారాడిమ్‌’ వ్యాసంలో ఇప్పటివరకూ అమలు అయిన దళిత పథకాలు, స్కీములు, సంక్షేమ కార్యక్రమాలు ఏవిధంగా విఫలం అయ్యాయో సోదాహరణంగా వివరించారు. భవిష్యత్తులో దళితుల అబివృద్ధికి చేపట్టాల్సిన అభివృద్ధి కార్యాచరణలకు కొత్త ప్రతిపాదనలను చేశారు.

నేడు దళితులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళకు, అడ్డంకులకు దారిచూపే దివిటీలా ‘ద దళిత్‌ ట్రూత్‌’ పుస్తకం నిలుస్తుందని దీన్ని ప్రగతిశీల, దళిత బహుజనశక్తులు తప్పక అధ్యయనం చేయాలని సూచిస్తున్నాను.

‘రీ థింకింగ్‌ ఇండియా’ సిరీస్‌లో ఎనిమిదో పుస్తకమైన ‘ది దళిత్‌ ట్రూత్‌’ సంకలనం ఆవిష్కరణ నేడు ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీ జవహర్‌ భవన్‌లో జరగనున్నది. రాహుల్‌ గాంధీ కీలకోపన్యాసం చేస్తారు.

Leave a Reply