– సోషల్, డిజిటల్ మీడియాపై నియంత్రణ కోరుకుంటున్న కేంద్రం
– నిరసనలు, ఆందోళనలకు వేదికగా మారుతున్నాయనే..
– అడ్డుకునేందుకే తెరపైకి కొత్త ఐటీ నిబంధనలు : రాజకీయ విశ్లేషకులు
– ప్రభుత్వ ఆదేశానుసారం కంపెనీలు నడుచుకోవాల్సిందే..
న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో (ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్…) జరిగిన ప్రచారం 2014లో బీజేపీ అధికారాన్ని తీసుకురావటంలో కీలక భూమిక వహించిందన్న సంగతి తెలి సిందే. ఇప్పుడవే సామాజిక, డిజిటల్ మాధ్యమాలు మోడీ సర్కార్‌కు పంటి కింద రాయిలా మారాయి. రైతు ఉద్య మం, పెరుగుతున్న ఇంధన ధరలు, నిరుద్యోగం తదితర అంశాలపై కోట్లాది మంది మోడీసర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రజలు సంధిస్తున్న ప్రశ్నలకు పాలకుల నుంచి సమాధానం లేదు. ఇదంతా కూడా కేంద్రానికి సవాల్‌గా మారింది. రాజకీ యంగా దీనిని ఎదుర్కోలేమని గ్రహించిన పాలకులు, ‘కొత్త ఐటీ నిబంధనల్ని’ తెరపైకి తీసుకొచ్చారు. ఈ నిబంధన లతో భావప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగతగోప్యత అన్నది నామమాత్రంగా మారుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
మాట వినకపోతే.. నిబంధనలు..
కొత్త ఐటీ రూల్స్-2021లోని కొన్ని విషయాలు మాత్రమే బయటకు వచ్చాయి. వ్యక్తిగత
గోప్యత, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించే నిబంధనలు ఇందులో ఉన్నాయని, ఆ విషయాల్ని కేంద్రం దాస్తోందన్న విమర్శలున్నాయి. కొత్త ఐటీ నిబంధనావళికి పార్లమెంట్ ఆమోదం అవసరం లేదా? అంటే..లేదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా కంపెనీలన్నీ తాము చెప్పినట్టు నడుచుకోవాలని మోడీ సర్కార్ పరోక్షంగా చెప్పదల్చుకుందని, ఆ కోవలోనే కొత్త నిబంధనావళిని తీసుకుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమ మాట వినని సోషల్ మీడియా కంపెనీలపై పాలకులు చర్యలు తీసుకోవటం కోసమే కొత్త నిబంధనలు తప్ప, వీటితో సాధారణ ఖాతాదారుడికి ఒనగూడేదేమీ ఉండదని విశ్లేషకులు విమర్శించారు. రైతు ఉద్యమం, నిరుద్యోగంపై నిరసనలకు సామాజిక, డిజిటల్ మీడియాలు కేంద్రంగా మారాయన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటిని నడిపే కంపెనీల్ని నియంత్రించాలని మోడీ సర్కార్ భావిస్తోంది.
కొత్త ఐటీ నిబంధనలు ?
‘ ఇంటర్‌మీడియరీ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్’ అనే పేరుతో కేంద్రం నూతన ఐటీ రూల్స్-2021ను తీసుకొచ్చింది. సామాజిక, డిజిటల్ మీడియా, సోషల్ నెట్‌వర్క్స్, ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్, ఆన్‌లైన్ న్యూస్ సైట్స్…లలో వస్తున్న కంటెంట్‌కు ఆయా కంపెనీలే బాధ్యత వహించాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఖాతాదారుడి సాధికారతకు పెద్దపీట వేస్తూ నూతన నిబంధనలు రూపకల్పన చేశామని కేంద్రం చెబుతోంది. జాతీయ భద్రత, వ్యక్తిగత గౌరవానికి, రక్షణకు భంగం కలిగినట్టయితే వాటి ఫిర్యాదుల్ని పరిష్కరించే వ్యవస్థను చేపట్టాలని ఆయా కంపెనీలకు కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, వూట్, ప్రైమ్ వీడియో..వంటివి) ఫ్లాట్‌ఫామ్స్ ఇప్పటివరకూ స్వీయ నిబంధనావళిని ఏర్పాటు చేసుకున్నాయి. ఇకపై అలా నడవదు. కొత్త ఐటీ నిబంధనలు అమలుజేయాల్సిందేనని కేంద్రం తాజాగా సర్క్యూలర్ విడుదల చేసింది.
అడ్డుకోకపోతే చర్యలు తప్పవు !
కేంద్రం విడుదల చేసిన కొత్త ఐటీ రూల్స్-2021ను ఆయా సోషల్, డిజిటల్ కంపెనీలు కచ్చితంగా పాటించా ల్సిందే. ఖాతాదార్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను అడ్డుకునే బాధ్యత ఇకపై ఆయా కంపెనీలదేనని కేంద్రం చెబుతోంది. హానికరమైన, ఉద్రిక్తతలకు దారితీసే వీడి యోలు, సందేశాల్ని అడ్డుకోవాల్సిందేనని, ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవని కొత్త నిబంధనలు తేల్చి చెప్పాయి. ఈ నిబంధనల ప్రకారం, వ్యక్తిగత గోప్యత పూర్తి స్థాయిలో అమలు కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ ఉన్న 2011 ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడి యా కంపెనీలు ఖాతాదారుడి వ్యక్తిగత గోప్యతకు ప్రాధా న్యత ఇచ్చాయి. జాతీయ భద్రతకు హాని తలపెట్టే తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌చేశారని, ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిపై లేదా ఒక సమూహంపై తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేశా రని అడ్డుకునే అధికారాన్ని సోషల్ మీడియా కంపెనీలకు కొత్త నిబంధనలు (ఐటీ రూల్స్-2021) ఇచ్చాయి. సంబం ధిత ప్రభుత్వ అధికారులు కోరితే, ఖాతాదారుడి వ్యక్తిగత వివరాల్ని సోషల్ మీడియా కంపెనీ బయటపెడుతుంది.
నిబంధనలు వర్తిస్తాయి..
ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్, ఓటీటీ వేదికలు, డిజిటల్ (యూట్యూబ్, వూట్, నెట్‌ఫ్లిక్స్) సోషల్ మీడియా (ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్) ఇవన్నీ కూడా కొత్తనిబంధనలు పాటించాలి. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి అధికారుల్ని నియమించాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు, కేబుల్ నెట్‌వర్క్ టెలివిజన్ నెట్‌వర్క్ రెగ్యులేషన్ యాక్ట్‌ను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ మీడియా సంస్థలు వార్తల్ని వెలువరించాలి.
పేరెంటల్ లాక్..
ఓటీటీ (నెట్‌ఫ్లిక్స్, అమోజాన్ ప్రైమ్, వూట్..) వేదికల పై వచ్చే కంటెంట్‌ను వినియోగదారుల వయస్సుల ఆధారం గా ఐదు విభాగాలుగా విభజించాలి. యూనివర్సల్, యూ/ఏ 7+ సంవత్సరాలు, యు/ఏ 13+ సంవత్సరాలు, యు/ఏ 16+ సంవత్సరాలు, ఏ (పెద్దలకు మాత్రమే) అనే ఐదు విభాగాలుగా ఉండాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. పేరెంటల్ లాక్ సదుపాయాన్ని కల్పించాలి. అడల్డ్ కంటెంట్ పిల్లలకు అందుబాటులో ఉండరాదని చెప్పారు.
సామాజిక మాధ్యమం భారత్‌లో ఖాతాదార్ల సంఖ్య
వాట్సాప్ 53కోట్లు
యూట్యూబ్ 44.8కోట్లు
ఫేస్‌బుక్ 41కోట్లు
ఇన్‌స్టాగ్రామ్ 21కోట్లు
ట్విట్టర్ 1.7కోట్లు
Courtesy Nava Telangana