అడవిని కొల్లగొట్టేందుకే కొత్త నియమాలు!

0
275

డా. పల్లా త్రినాధరావు

కేంద్రఅటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ జూన్ 28న జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల అటవీ హక్కులను కాలరాసి అటవీ భూములను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు వీలు కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఆదివాసీలు, పలు రాజకీయ పార్టీలు కొత్త అటవీ నియమాలకు వ్యతిరేకంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. అటవీ భూముల ఆధారంగా వ్యాపారం, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసకర ప్రాజెక్టులకు సత్వర అనుమతులు దొరికేందుకు వీలుగానే ఈ నూతన అటవీ సంరక్షణ నియమాలను రూపొందించారు.

అటవీ భూముల వర్గీకరణ నుంచి భూములను తొలగించేందుకూ (డీరిజర్వ్), అటవీ భూమిని వేరే అవసరాలకు లీజుపై ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంతిమ అనుమతులను జారీ చేసిన తర్వాత, ఆదివాసీల అటవీ హక్కుల అమలు బాధ్యతను రాష్ట్రాలపై వదిలి వేయడం అంటే, అటవీ హక్కుల చట్టాలను తుంగలోకి తొక్కడమే. కేంద్ర ప్రభుత్వం అంతిమ అనుమతులను జారీ చేసిన తర్వాత జిల్లా స్థాయి అధికారులు చట్టాల అమలు ఏ మేరకు చేయగలరో ఊహించడానికి పెద్ద ఆలోచన అవసరం లేదు.

అటవీ భూముల మళ్లింపుకు దరఖాస్తు చేసుకుంటే చాలు పూర్తి విచారణ లేకుండానే సూత్రప్రాయంగా ప్రాథమిక అనుమతులు జారీ చేయడానికి కొత్త నియమాలు అవకాశం కల్పిస్తున్నాయి. అటవీ భూముల మళ్లింపు విషయంలో సంపూర్ణ విచారణ అయిన తర్వాత అంతిమ అనుమతులు ఇవ్వబడతాయి. అయితే ఆడవులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీల, ఇతర వర్గ ప్రజల ప్రమేయం లేకుండానే అటవీ శాఖాధికారులు, రాజకీయ నాయకుల పాత్రతోనే అనుమతుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

అనుమతుల జారీని సులభతరం చేయడానికి స్క్రీనింగ్ కమిటీ, నోడల్ ఆఫీసరు వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాష్ట్ర స్థాయి అధికారుల సిఫారసులతోనే, అటవీ భూమి విస్తీర్ణం ఆధారంగా అనుమతులు లభిస్తాయి. మైనింగ్ కోసం అవసరమయ్యే 5 హెక్టార్ల పైబడి అటవీ భూమి డీరిజర్వ్ కోసం, ఆక్రమణల క్రమబద్ధీకరణ వంటి ప్రతిపాదనల కోసం కేంద్ర ప్రభుత్వ సలహా కమిటీ సిఫార్సులు అవసరం. 2003లో జారీ చేసిన ఈ నియమాలను, వాటి సవరణలను అధిగమిస్తూ ఇప్పుడు కొత్త నియమాలు తీసుకురాబడ్డాయి.

అటవీ భూములు వేరే ప్రయోజనాలకు వినియోగించాలంటే అటవీ సంరక్షణ చట్టం 1980 కింద కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవలసిందే. తీవ్రవాద కార్యకలాపాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో అటవీ భూమి వినియోగ పరిమితి విషయంలో 2005లో ఒక హెక్టారుతో సడలింపులు మొదలయ్యాయి. ఈ పరిమితి దఫ దఫాలుగా సడలింపులకు గురవుతూ ఫిబ్రవరి 2018 నాటికి 40 హెక్టార్లకు పెరిగింది.

ఆదివాసీల, ఇతర అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు విషయంలో జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడానికి 2006లో కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని తీసుకువచ్చింది. అటవీ హక్కుల చట్ట నియమాలు అటవీ సంరక్షణ చట్ట నియమాలను కూడా అధిగమిస్తాయి. ఏదైనా అటవీ భూమిని ఇతర అవసరాలకు మళ్ళించాలంటే ముందుగా అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అటవీ హక్కులను సంపూర్ణంగా అమలు జరపాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అటవీ మంత్రిత్వ శాఖ 2009లో మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

అంటే ముందుగా అటవీ హక్కుల చట్టం కింద వ్యక్తిగత, సాముదాయక అటవీ వనరుల నిర్వహణ, ఇతర హక్కులు అమలు విషయంలో గ్రామసభ, జిల్లా కలెక్టరు ఒక ధృవీకరణ పత్రం జారీ చేసిన తర్వాతనే అటవీ భూమి మళ్లింపుకు అనుమతులు ఇవ్వాలి. అయితే ఈ అవసరం లేకుండానే ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు అటవీ భూమి మళ్ళించేందుకు నూతన అటవీ సంరక్షణ నియమాలు వీలు కల్పిస్తున్నాయి.

ఆదివాసీల సాంప్రదాయక హక్కులతో ముడిపడి ఉన్న అటవీ భూమి హక్కుల విషయంలో అటవీ హక్కుల చట్టం కింద వారి హక్కులు నిర్ధారణ తర్వాతే అటవీ భూమి మళ్లింపుకు అనుమతులను పరిశీలించాలని ఒరిస్సా మైనింగ్ కార్పొరేషనుకూ, కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖకూ మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు ఏప్రిల్ 2013లో ఉత్తర్వు జారీ చేసింది. అటవీ హక్కుల అమలు విషయంలో గ్రామసభ పాత్రను, అటవీ భూమి మళ్లింపు విషయంలో వాటి అనుమతి అవసరాన్ని స్పష్టపరిచింది. అందువల్ల నూతన అటవీ సంరక్షణ నియమాలు 2013 సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధం.

షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పంచాయతీ నియమాల విస్తరణ చట్టం (పీసా)1996, అలాగే అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006 కింద అటవీ భూమి వనరుల నిర్వహణ, హక్కులు నిర్ధారణ, అమలు చేసే అధికారం గ్రామసభకు ప్రాథమికంగా ఉంటుందని 2010లో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నూతన అటవీ సంరక్షణ నియమాలలో పీసా చట్ట గ్రామసభల సంప్రదింపులు వాటి అనుమతులు అటవీ భూమి మళ్లింపు ప్రక్రియ విషయంలో విస్మరించడం అంటే గ్రామసభల రాజ్యాంగ హక్కులను కాలరాయడమే.

అటవీ ప్రాంతాల్లో లీనియర్ ప్రాజెక్టుల (రహదార్లు, పైపులు, ట్రాన్స్‌మిషన్ ఇతర ప్రాజెక్టుల) అమలుకు షెడ్యూల్డ్ ప్రాంత గ్రామ సభ అనుమతి అవసరం లేదని గతంలో కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన 2013 ఉత్తర్వును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2019లో కొట్టేసింది. రాజ్యాంగ శాసనంగా పేర్కొనే పీసా చట్ట నియమాలకు భిన్నంగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు శాసనాలు చేయడానికి వీలులేదని స్పష్టం చేసింది. పీసా గ్రామ సభల అధికారాలకు తిలోదకాలు ఇస్తూ జారీ చేసిన నూతన అటవీ సంరక్షణ నియమాల చట్టబద్ధత ప్రశ్నార్ధకమే.

అందువల్ల 2022–నూతన అటవీ సంరక్షణ నియమాల అమలును నిలిపివేసి, ఆదివాసీల అటవీ హక్కులూ, షెడ్యూల్డ్ ప్రాంత స్వీయ పాలన కోసం ఉద్దేశించిన పీసా చట్ట గ్రామ సభ అధికారాలూ అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలి. అటవీ భూ వనరులతో ముడిపడి ఉన్న ఆదివాసీ జీవనం ఛిద్రం కాకుండా చూడాలి.

Leave a Reply