తదుపరి సీజేఐగా జస్టిస్‌ యు.యు. లలిత్‌..!

0
12

దిల్లీ: భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు 49వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ లేఖను కేంద్ర న్యాయశాఖ.. ప్రధానమంత్రి పరిశీలన కోసం పంపనుంది. ఆయన ఆమోదం తర్వాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. అంతిమంగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు.

ప్రస్తుత సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ నెల 26వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఆ లెక్కన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తర్వాత జస్టిస్‌ యు.యు.లలిత్‌ అత్యంత సీనియర్‌గా ఉన్నారు. జస్టిస్‌ లలిత్‌ ఆగస్టు 27న ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే, ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే ముగుస్తుంది. నవంబరు ఎనిమిదో తేదీన ఆయన పదవీ విరమణ చేస్తారు.

జస్టిస్‌ లలిత్‌ ప్రస్థానమిది..
దేశంలోనే తీవ్ర సంచలనం సృష్టించిన త్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక కేసుల్లో తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ యు.యు. లలిత్‌ ఉన్నారు. 1957 నవంబరు 9న జన్మించిన ఆయన జూన్‌ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. డిసెంబరు 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేశారు. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చారు. ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. నాటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి అయ్యారు.

ట్రిపుల్‌ తలాక్‌ విధానంలో విడాకులు చెల్లుబాటు కావని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2017లో 3-2 మెజారిటీతో తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ యు.యు.లలిత్‌ సభ్యుడు. కేరళలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ హక్కు అప్పటి రాజకుటుంబానికి ఉంటుందని జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

Leave a Reply