ఫామ్‌హౌజ్‌పై కేటీఆర్‌కు నోటీసులు!

0
227
  • సీఎస్‌, జీహెచ్‌ఎంసీలకు కూడా!
  • అక్రమ నిర్మాణం ఆరోపణలపై నిజ నిర్ధారణకు కమిటీ ఏర్పాటు
  • రేవంత్‌ పిటిషన్‌పై ఎన్జీటీ ఆదేశం 

న్యూఢిల్లీ : హైదరాబాద్‌ గండిపేట చెరువుకు ఎగువన జన్వాడ గ్రామంలో జీవో 111కు విరుద్ధంగా ఫామ్‌హౌజ్‌ నిర్మించారంటూ దాఖలైన పిటిషన్‌లో మంత్రి కేటీఆర్‌కు జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్జీటీ) నోటీసులు జారీ చేసింది. కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై, సీవరేజ్‌ బోర్డు, హెచ్‌ఎండీఏ, రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ, హైదరాబాద్‌ లేక్స్‌ అండ్‌ వాటర్‌ బాడీస్‌ మెనేజ్‌మెంట్‌ సర్కిల్‌కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. జీవో నంబర్‌ 111ను ఉల్లంఘిస్తూ జన్వాడలో అనుమతులు లేకుండా అక్రమంగా ఫామ్‌హౌజ్‌ నిర్మించారంటూ పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ఎన్జీటీ న్యాయ సభ్యులు జస్టిస్‌ రామకృష్ణన్‌, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌ గుప్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

అక్రమ నిర్మాణం, అనుమతులు ఇతర అంశాలపై అధ్యయనం చేయడానికి నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయం నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్‌, హెచ్‌ఎండీఏ ప్రతినిధులతో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. ఫామ్‌హౌజ్‌ ప్రాంతాన్ని సందర్శించి, అక్రమ నిర్మాణమా? కాదా? ఒకవేళ అక్రమ నిర్మాణమైతే పునరుద్ధరణ చర్యలకు, పర్యావరణ పరిహారంగా ఎంత వసూలు చేయాలి? అన్న అంశాలను తేల్చి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకిట్రైబ్యునల్‌ నిర్దేశించింది. వీటితోపాటు జీవో నంబర్‌ 111కు సంబంధించి తాము గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలుపై కూడా నివేదిక అందించాలని సూచించింది.

పిటిషనర్‌ రేవంత్‌ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఫామ్‌హౌజ్‌ నిర్మించిన చాలాకాలం తర్వాత ఇప్పుడు ఎందుకు పిటిషన్‌ వేశారని ధర్మాసనం ప్రశ్నించింది. దానికి న్యాయవాది స్పందిస్తూ, గ్రీన్‌ కవర్‌(పాలీహౌజ్‌ ఫామింగ్‌ తరహాలో) వేసి నిర్మించడం వల్ల ఎవరూ గుర్తించలేక పోయారని, విస్తృతి కూడా పెద్దదని, నిర్మాణం పూర్తయిన తర్వాత అక్కడికి తరచూ కేటీఆర్‌ వస్తున్నట్లు గ్రామస్థులు సమాచారం ఇచ్చారని తెలిపారు. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత పిటిషన్‌ దాఖలు చేశారని చెప్పారు. ఒక సందర్భంలో ట్రైబ్యునల్‌ రేవంత్‌రెడ్డి రాజకీయ నేపథ్యం గురించి ఆరా తీసింది.

లక్ష చదరపు అడుగుల్లో వీవీఐపీ ఫామ్‌హౌజ్‌: రేవంత్‌
పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్న కేటీఆర్‌ చట్టవిరుద్ధంగా జన్వాడలో లక్ష చదరపు అడుగుల్లో ఫామ్‌ హౌజ్‌ భవనం నిర్మించారన్న ఆరోపణలు ఉన్నాయని పిటిషన్‌లో రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఫామ్‌ హౌజ్‌లో మూడు అంతస్థుల భవనం, స్విమ్మింగ్‌ పూల్‌, గార్డెన్‌ ఉన్నాయని వివరించారు. ఈ నిర్మాణం కోసం ఉస్మాన్‌ సాగర్‌కు ప్రధాన నీటి వనరుగా ఉన్న నాలాను నాశనం చేశారని, ఫామ్‌హౌజ్‌కు రోడ్డు వేయడానికి నాలాను మట్టితో నింపారని ఆరోపించారు. సమాచారం సేకరించడానికి తాను జన్వాడకు వెళ్లానని, పోలీసులు తనను అడ్డుకొని క్రిమినల్‌ కేసులు నమోదు చేశారని వివరించారు.

Courtesy Andhrajyothi

Leave a Reply